వినాయక చవితి ఆంక్షలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఆ జిల్లాలో బీజేపీకి కలిసి వస్తాయా? హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చాక కూడా పార్టీ శ్రేణులు ఎందుకు గొడవలు చేస్తున్నాయి? వినాయక చవితిని అడ్డంపెట్టుకుని గ్రామస్థాయిలో స్థానం కోసం కాషాయ దళం ప్రయత్నిస్తోందా?
చవితి ఆంక్షలతో జిల్లాలో బీజేపీ బలపడే వ్యూహం!
వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు ప్రకటించినప్పటి నుంచి దూకుడు పెంచింది బీజేపీ. కర్నూలుజిల్లాలో బీజేపీ ఆందోళనలకు దిగింది. అదే సమయంలో బీజేపీ రాయలసీమస్థాయి సమావేశం జరుగుతుండటంతో.. అక్కడికక్కడే ఆందోళనకు పిలుపిచ్చింది. ఆ మాట అందుకుని బీజేపీ నేతలు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. కోర్టు అనుమతితో విగ్రహాలు పెట్టినా నిమజ్జనం సందర్భంగా లౌడ్ స్పీకర్ల విషయంలో అనేక ప్రాంతాల్లో ఆందోళనలు, పోలీసులతో ఘర్షణకు దారితీసింది. ఈ ఆందోళనల వెనక ఉన్నది బీజేపీ శ్రేణులేనని.. పరిస్థితులను రాజకీయంగా అనుకూలంగా మలుచుకుంటున్నారని వైరిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నిమజ్జనాల సందర్భంగా ఉద్రిక్తతల వెనక ఉన్నది ఎవరు?
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా డీజే ఏర్పాటు విషయంలో పోలీసులతో ఘర్షణ పడ్డారు నిర్వాహకులు. గూడూరు, ఆలూరు, పత్తికొండ, కోడుమూరుల్లో ఉద్రిక్తతకు దారితీసింది. గూడూరులో నిరసనకారుల్లో ఒకరు పెట్రోల్ పోసుకోవడంతో కలకలం రేగింది. పోలీసులు వారించినా.. నిర్వాహకులు గొడవ పడటం వెనక బీజేపీ వాళ్లు ఉన్నారని అనుమానిస్తున్నారట. 18న జరిగే ప్రధాన నిమజ్జనంలోనూ డిజే, మైక్ సిస్టమ్ పెట్టేందుకు బీజేపీ శ్రేణులు పట్టుబడుతున్నట్టు సమాచారం. హైకోర్టు ఉత్తర్వులలో డీజే వద్దని ఉందా అని ప్రశ్నిస్తున్నారట. మండపాల్లో మైక్ సిస్టమ్‌ను తొలగించిన కర్నూలు వన్ టౌన్ పోలీసులకు లీగల్ నోటీస్ ఇచ్చామని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఈ పరిణామాలే జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారుతున్నాయి.
గ్రామస్థాయిలోకి చొచ్చుకెళ్లాలనే బీజేపీ ఆలోచన!
చవితి ఉత్సవాలపై పోలీసుల అభ్యంతరాలు ఒక్కోచోట ఒక్కోలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. తమకు అనుకూలంగా ఉన్నవారు డీజేలు.. మైక్‌లు పెట్టినా పోలీసులు ఏం పట్టించుకోవడం లేదన్నది బీజేపీ కార్యకర్తల ఆరోపణ. జిల్లాలోని మంత్రుల నియోజకవర్గాల్లో నిమజ్జనాలను ఆర్భాటంగా.. కోవిడ్ నిబంధనలు పాటించకుండా చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అసలు వివాదం ఎలా ఉన్నా.. ఈ ఎపిసోడ్ ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట కమలనాథులు. గ్రామస్థాయిలో పార్టీ సంబంధాలు.. కేడర్ బలపడేందుకు ఈ ఉద్యమం ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట. ముఖ్యంగా హిందూ పండగలు, ఉత్సవాల టైమ్‌లో ప్రజల్లోకి వెళ్లేందుకు చూస్తున్నారట నాయకులు. మరి.. కర్నూలు జిల్లాలో బలపడేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత వరకు వారికి వర్కవుట్ అవుతాయో చూడాలి.