NTV Telugu Site icon

వైసీపీ ఎమ్మెల్యేకు షాడోగా మరో నేత ?

Switch Akda Vundaday

Switch Akda Vundaday

నెల్లూరు జిల్లా ఉదయగిరి. ఇక్కడ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. ఈ మధ్య తరచూ వార్తల్లో.. ప్రచారంలో ఉంటున్న శాసనసభ్యుడు. వివాదాలు కోరుకుంటున్నారో ఏమో.. అవి లేకుండా చంద్రశేఖర్‌రెడ్డి పేరు ఉదయగిరిలో వినిపించదు. ఈ కోవలోనే చర్చల్లోకి వస్తోంది ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి యవ్వారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంత చెబితే అంత కాదు.. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. దాంతో ఆయనకు ఎమ్మెల్యే షాడో అనే గుర్తింపు వచ్చేసిందిట. ఏ పని కావాలన్నా మొదటిగా షాడోను కలిస్తేనే వర్కవుట్‌ అవుతుందట.

ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలలోని నేతలకు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే బాస్‌. అధికారులకు కూడా ఆయన ఆదేశాలే శిరోధార్యమట. ఇక్కడో విచిత్రం ఉంది. అన్ని మండలాల్లో ఈయనగారికి ప్రత్యేకంగా అనుచరులు ఉన్నారట. వారి ద్వారానే అన్నీ చక్కబెడతారని టాక్‌. అంగన్‌వాడీ పోస్టుల నుంచి.. ఉద్యోగుల బదిలీలు.. పోస్టింగ్‌లు అన్నింటిలోనూ ప్రధాన అనుచరుడు వేలు పెడతారట. ఒకవేళ ఆయన కాదూ కూడదు అంటే ఫైల్‌ ఆగిపోవాల్సిందే. అడిగినంత బరువు చేతిలో పెడితే ఫైల్‌ చకచకా పరుగులు పెడుతుందని ఉదయగిరి వైసీపీలో కథలు కథలుగా చెప్పుకొంటారు.

ఆ మధ్య ఉదయగిరిలో గుప్తనిధుల తవ్వకాల్లో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే ప్రధాన నిందితుడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు తట్టుకోలేక కర్నాటకకు పారిపోయారట. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. తన స్థాయిలో చక్రం తిప్పి.. కేసులు మాఫీ చేయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఉదయగిరిలో ఎమ్మెల్యే కంటే పవర్‌ఫుల్‌గా మారిపోయినట్టు వైసీపీవర్గాల వాదన. ఇక మామూళ్ల వసూళ్లలో తన మన భేదం ఉండదట ఈ షాడోకు. పనిపై వచ్చినవాళ్లు వైసీపీ వాళ్లే అయినా.. ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనట. ఇదేం గోల అని.. కొందరు పార్టీ నేతలు ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పుకొని గగ్గోలు పెట్టారట. అయినాసరే ఎమ్మెల్యే కిమ్మనలేదని వాపోతున్నాయి వైసీపీ శ్రేణులు.

కొందరు పార్టీ నేతలు ఉదయగిరిలో షాడో వ్యవహారాలను మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. ఆయనేమో.. ఉదయగిరితో ఎందుకెలేబ్బా.. అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి షాడో గేర్‌ మార్చేసినట్టు సమాచారం. వరికుంటపాడు మండలంలోని ఒక ప్రజాప్రతినిధి సహకారంతో ప్రభుత్వ, అటవీ, రైతుల భూముల్లో అనుమతులు లేకుండా తెల్లరాయి తవ్వేస్తున్నారట ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. ఈ విషయం తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. కొండాయపాలెంలోని ప్రభుత్వ భూముల్లో పగలు రాత్రి తేడా లేకుండా తెల్లరాయి తవ్వేస్తుంటే స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే చేతిలో పవర్‌ చూపించి వాళ్లను బెదరగొట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

మాట వినకపోతే కేసులు పెట్టేస్తారు? ఆనకట్టు పనుల్లో ఎవరూ టెండర్లు వేయకుండా వార్నింగ్‌?మామూళ్లు ఇచ్చుకోలేక ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు?

ఇక వింజమూరు మండలంలో ఒక నేతతో కలిసి పిల్లాపేరు వాగు నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారట సదరు షాడో ఎమ్మెల్యే. ఉదయగిరిలో ఎక్కడైనా గ్రావెల్‌ తరలించాలన్నా.. ఇటుక బట్టీలకు మట్టిని సరఫరా చేయాలన్నా షాడో అనుమతి ఉండాల్సిందేనట. మాట వినకపోతే కేసులు పెట్టడానికి రెడీగా ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్నారు. నాడు నేడు పథకం కింద పాఠశాల పనులు అనుచరులకు అప్పగించి.. తూతూ మంత్రంగా వర్క్స్‌ పూర్తి చేసి.. ఆ షాడో నేత లక్షలు కాజేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వేసిన సిమెంట్‌ రోడ్లకు హంగులు చూపించి.. సైడ్‌ కాలువలు కూడా కట్టకుండా బిల్లులు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఉదయగిరి ఆనకట్ట ఆధునీకరణ కోసం 15 కోట్ల విలువైన పనులు అనుచరులకు ఇప్పించే పనిలో ఉన్నారట. టెండర్లు వేయడానికి ఎవరినీ రాకుండా భయపెడుతున్నట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇప్పటికే ఆనకట్ట సమీపంలో నాలుగు ఎకరాలు కబ్జా చేసి.. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఇచ్చేశారట. కృష్ణంపల్లిలో 92 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పట్టాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో అధికారులు విచారణ చేపట్టినా … రిపోర్ట్‌ను తొక్కిపెట్టినట్టు సమాచారం. ఇదే కాదు.. ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడులలో ఉండే ఓకేషనల్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలను తలా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారట సదరు షాడో నేత. అలా ఇవ్వని వాళ్లను వేధిస్తుండటంతో జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ మధ్య అనారోగ్యంతో చాలాకాలంపాటు ఎమ్మెల్యే ఉదయగిరికి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో షాడో ఎమ్మెల్యే మొత్తం కథ నడిపించేశారట. మామూళ్లు ఇవ్వని వారిపై పితూరీలు చెప్పి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డికి వారిని దూరం చేస్తున్నారట. ఇటీవల ఒక మండల నేతను ఎమ్మెల్యే ద్వారా బాగా తిట్టించినట్టు పార్టీలో టాక్‌. దీంతో షాడో వ్యవహారాలపై కొందరు లోకల్‌ లీడర్స్‌ వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అందుకే తాడేపల్లి నుంచి ఎలాంటి ఉపశమనం లభిస్తుందా అని ఉదయగిరి వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారట.