Andhra Pradesh Home Minister Taneti Vanitha : ఆ మంత్రి ఇలాకాలో టీడీపీ జెండా రెప రెపలాడింది. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేశారు తెలుగు తమ్ముళ్లు. ఈ పరిణామం వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా మంత్రి? ఎందుకలా జరిగింది? లెట్స్ వాచ్..!
కొవ్వూరు. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ నియోజవర్గ ఎమ్మెల్యే తానేటి వనిత. ప్రస్తుతం ఏపీ హోంమంత్రి కూడా. కేబినెట్‌లో పెద్దపోస్ట్‌లో ఉండటంతో.. నియోజకవర్గంలో ఆమె మాటే చెల్లుబాటు అవుతుందని భావిస్తారు. కానీ.. తానేటి వనితకు పెద్దషాకే తగిలింది. టీడీపీ, వైసీపీ కుమ్మక్కైనట్టు కొవ్వూరులో కోడై కూస్తున్నారు. అది అధికారపార్టీలో పెద్ద చర్చగా మారిపోయింది.
కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ పరిణామం మంత్రి వనితతోపాటు వైసీపీ నేతలకు మింగుడు పడలేదు. హోంమంత్రి ఇలాకాలో ఇలా ఎలా జరిగింది అని ఆరా తీస్తున్నారంతా. ఈసారి ఎలాగైనా అర్బన్ బ్యాంకులో పాగా వేయాలని మొదటి నుంచి ప్లాన్ వేశారట వైసీపీ నేతలు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి.. తర్వాత బ్యాంకు ఎన్నికల్లో పట్టు సాధించాలని అనుకున్నారట. ఈ వ్యూహాన్ని పసిగట్టిన టీడీపీ నేతలు.. సహకార చట్టాల ప్రకారం ఎన్నికలు జరిగేలా చూసుకుని.. అన్ని పదవులూ ఏకగ్రీవం అయ్యేలా చక్రం తిప్పేశారట. మద్దిపట్ల శివరామకృష్ణ ఐదోసారి బ్యాంక్ ఛైర్మన్ అయ్యారు. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు.. పెట్టుబడి లేకపోవడంతో సొంతంగా ఎన్నికల అధికారిని నియమించుకుని ఎన్నికలు జరుపుకోవచ్చన్నది ఎలక్షన్ ఆఫీసర్ రమణమూర్తి చెప్పేమాట. నోటిఫికేషన్ రావడం.. నామినేషన్లు దాఖలు కావడం.. ఉపసంహరణలు పూర్తి కావడం.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం చక చకా జరిగిపోయింది. వైసీపీ నుంచి ఒక్కరూ నామినేషన్ వేయలేదు.
ఎన్నికల గురించి బ్యాంక్ ఖాతాదారులకు కూడా తెలియదట. కస్టమర్లకు తెలియకపోయినా.. రాజకీయ ఎత్తుగడలు.. వ్యూహాలను వైసీపీ ఎలా పసిగట్టలేదన్నదే ప్రశ్న. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం చర్చగా మారింది. మంత్రి తీరుపై మనస్తాపంతో కొవ్వూరు శ్రీరామా ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్ష పదవికి కంఠమణి రమేష్ రాజీనామా చేశారు. బ్యాంక్ ఎన్నికల్లో సత్తా చాటుదామని ఆశించిన వారికి షాక్ తగిలింది. దీనికంతటికీ హోంమంత్రి తానేటి వనితే కారణమన్నది వైసీపీలో కొందరి ఆరోపణ. గతంలో టీడీపీ నేతలతో మంత్రి వనిత చేసుకున్న జెంటిల్మెన్ ఒప్పందమే కారణమని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల సమయంలోనే అది జరిగిందట. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే.. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీని గెలిచించాలని అవగాహనకు వచ్చారట.
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 15, టీడీపీ, 7, బీజేపీ ఒకచోట గెలిచాయి. అప్పుడే వైసీపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. ఆనాడు అర్బన్ బ్యాంక్ ఎన్నికల కోసం ఒప్పందం జరిగిందో లేదో కానీ.. కొవ్వూరులో వైసీపీకి జరుగుతున్న పరాభవాలకు మంత్రి వనిత వైఖరి కారణమని సొంతపార్టీ వాళ్లే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. గత ప్రభుత్వంలో టీడీపీ వల్ల ఇబ్బంది పడ్డ వైసీపీ వాళ్లను మంత్రి దూరం చేస్తున్నారని.. అది కూడా పార్టీ బలహీన పడటానికి కారణంగా కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి హోంమంత్రి ఇలాకాలో జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరి.. ఈ అంశంపై వైసీపీ అధిష్ఠానం పోస్టుమార్టం చేస్తుందో లేదో చూడాలి.
