Site icon NTV Telugu

మంత్రి పేర్ని నాని నియోజకవర్గంలో ఏసీబీ తనిఖీలు !

మంత్రిగారి ఇలాకాలో తనిఖీలు లేదా దాడులు చేయాలంటే అధికారులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఆ అమాత్యుడి నియోజకవర్గంలో ఏకంగా ACB ఎంట్రీ ఇచ్చింది. ప్రతి రికార్డును నిశితంగా పరిశీలించడంతో ఒక్కటే గగ్గోలు.. ఉద్యోగవర్గాల్లో కలకలం. కానీ.. ACB దాడుల వెనక అసలు సంగతి వేరే ఉందట. అదే అక్కడ హాట్‌ టాపిక్‌!

బందర్‌ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలపై చర్చ!

ఇటీవల కృష్ణా జిల్లా బందరు మున్సిపాల్టీలో పెద్దఎత్తున ఏసీబీ సోదాలు జరిగాయి. మున్సిపల్‌ రికార్డులను తనిఖీలు చేశారు. మచిలీపట్నం మంత్రి పేర్ని నాని నియోజకవర్గం. బందర్‌ మున్సిపాలిటీ అంటే నియోజకవర్గానికి కీలకం. అలాంటిచోట ఏసీబీ సోదాలు జిల్లాలో చర్చకు దారి తీశాయి. ప్రత్యర్థి పార్టీల నేతలకు.. విమర్శలకు గట్టిగా కౌంటర్లు ఇచ్చే మంత్రి పేర్ని నాని.. తన సొంత నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో అవినీతి జరుగుతోంటే ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపించాయి.

read also : బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్….

ఏసీబీ తనిఖీలు చేయించింది మంత్రే!
ఇళ్ల పన్ను నిర్ధారణలో అక్రమాలు!

ACB దాడుల వెనక అసలు సంగతి వేరే ఉందట. తనిఖీలు చేయించింది మంత్రి పేర్ని నానీయేనని సమాచారం. ఈ విషయం తెలియడంతో అందరికీ మూర్ఛ వచ్చినంత పనైందట. అదేంటీ.. స్వయంగా మంత్రి ఈ తరహాలో ఎందుకు చేయించారని అంతా చెవులు కొరుక్కున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పన్ను విధించే అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందట. ఆ విషయం మంత్రి దృష్టికి రావడంతో.. ప్రాథమికంగా ఆరా తీశారట. అక్రమాలు జరగడం నిజమేనని తేలడంతో.. ఆయన సీరియస్‌గా ఫోకస్‌ పెట్టారట.

40 వేల ఇళ్లను సర్వే చేయించిన మంత్రి!
5 వేల ఇళ్ల వివరాలు తప్పుగా నమోదు!

అసలు విషయం రాబట్టే క్రమంలో బందర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 40 వేల ఇళ్లను సర్వే చేయించారట. సర్వే చేసిన ఇంటి పరిస్థితి ఏంటి? ఆ ఇంటికి సంబంధించి మున్సిపల్‌ రికార్డుల్లో ఏమని నమోదైంది? ఎంత పన్ను వేశారు? అనే అంశాలను వెలికి తీయించారట మంత్రి పేర్ని నాని. దీంతో కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయట. సర్వే చేయించిన ఇళ్లల్లో సుమారు 5 వేలకు పైగా ఇళ్లకు సంబంధించి తప్పుగా మున్సిపల్‌ రికార్డుల్లో నమోదు చేసినట్టు గుర్తించారట. డాబా ఉంటే పెంకుటిల్లుగా.. పెంకుటిల్లు ఉంటే పూరి గుడిశెగా.. రెండంతస్థుల భవనం అయితే ఓ చిన్నపాటి డాబా అని ఇలా రకరకాలుగా తప్పుడు లెక్కలు వేశారట. వాటినే మున్సిపల్‌ రికార్డుల్లో నమోదు చేసి దాని ద్వారా పన్నును తగ్గించుకుని లబ్ధి పొందారట.

లోతైన విచారణ కోసం ఏసీబీని దించిన మంత్రి!
సోదాల్లో సూత్రధారులు, పాత్రధారులు బయటపడతారా?

అవినీతి ఊడలు బలంగానే ఉంటాయని భావించిన మంత్రి పేర్ని నాని.. సర్వే వివరాలను ACBకి అందజేసినట్టు చెబుతున్నారు. లోతైన విచారణ చేయాలని ACBని ఆయన కోరారట. ఈ క్రమంలోనే బందర్‌ మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంట్రీ ఇచ్చారని సమాచారం. ఈ మొత్తం అక్రమాల వెనక గత ప్రభుత్వంలో స్థానికంగా ఉన్న కొద్దిమంది టీడీపీ లీడర్ల హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ACB సోదాలు ఓ కొలిక్కి వస్తే.. మరింత క్లారిటీ వస్తుంది. అప్పుడు సూత్రధారులు.. పాత్రధారుల భరతం పట్టొచ్చనే ఆలోచనలో ఉన్నారట అమాత్యుల వారు. అసలు సంగతి ఆలస్యంగా బయటపడంతో మంత్రి పేరు చెప్పినా.. ACB అని ఎవరైనా పలికినా.. మున్సిపాలిటీ వర్గాలు ఉలిక్కి పడుతున్నాయట. మరి.. రానున్న రోజుల్లో ఈ ఎపిసోడ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version