Site icon NTV Telugu

Yuvraj Mehta: ‘నాన్నా.. నన్ను కాపాడు…’ ఇది వ్యవస్థ చేసిన హ*త్య..? సంచలన రేపుతోన్న యువరాజ్‌ డెత్ ఎపిసోడ్!

Yuvraj Mehta, Noida drowning, techie death, Sector 150 accident, waterlogged pit, construction negligence, administrative failure, Uttar Pradesh news, Greater Noida tragedy, ignored warning letter, systemic murder, road safety lapse, Noida Authority, fog accident, software engineer death, youth drowning India

Yuvraj Mehta Death Episode

ఆ రాత్రి వర్షం మాత్రమే కాదు.. నిర్లక్ష్యం కూడా కురిసింది..! ఇది యాక్సిడెంట్‌ కాదు.. ఒక వ్యవస్థ చేసిన దారుణ హత్య! ఇంటికి కేవలం కిలోమీటర్ దూరంలో ఒక యువకుడు తన ప్రాణాల కోసం పోరాడాడు. నీటితో నిండిన చీకటి గుంతలో చిక్కుకుని 90 నిమిషాల పాటు సహాయం కోసం కేకలు వేశాడు. ఫోన్ టార్చ్ వెలిగించి బయట తిరుగుతున్న వాళ్లకి కనిపించేందుకు ప్రయత్నించాడు. తండ్రికి కాల్ చేసి తనని రక్షించాలని వేడుకున్నాడు. కానీ ఆ చీకటిలో బయట ప్రపంచానికి వినిపించని అతని వేదన చివరికి మూగబోయింది.

యూపీకి చెందిన యువరాజ్ మెహతా మరణం ఒక క్షణంలో జరిగిన ప్రమాదం కాదు.. మూడు సంవత్సరాల క్రితమే వచ్చిన ఒక హెచ్చరికను పట్టించుకోని ఫలితం. ఒక లెటర్.. ఒక ఫైల్.. ఒక సంతకం లేకపోవడం వల్ల చెల్లించిన మూల్యం ఇది. ఆ లేఖలో ఉన్న విషయాలనే ఆ నాడు అధికారులు పట్టించుకొని ఉంటే ఆ గుంతలో నీరు ఉండేది కాదు. ఇంతకీ ఆ లేఖలో ఏముంది?

యువరాజ్ మెహతా వయసు 27 ఏళ్లు. నోయిడాలో నివసించే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. గురుగ్రామ్‌లో ఉద్యోగం చేసే సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఆ రాత్రి ఆఫీస్ నుంచి కారులో ఇంటికి తిరిగొస్తున్నాడు. తన అపార్ట్‌మెంట్‌కి చేరడానికి కేవలం ఒక కిలోమీటర్ దూరమే మిగిలి ఉంది. కానీ ఆ చివరి మలుపే అతడి జీవితానికి చివరి అంకమైంది.

సెక్టర్ 150లో ఉన్న ఒక అండర్‌కన్‌స్ట్రక్షన్ బేస్‌మెంట్ పక్కన ఉన్న రోడ్డుకు ఎలాంటి హెచ్చరికలు లేవు. బ్యారికేడ్లు లేవు. రిఫ్లెక్టర్లు లేవు. భారీ వర్షాల తర్వాత నెలలుగా అక్కడ నీరు నిలిచిపోయింది. రోడ్డూ, గుంత మధ్య తేడా గుర్తించే పరిస్థితి లేదు. కారు అదుపు తప్పింది. నేరుగా నీటితో నిండిన గుంతలో పడిపోయింది. అది వర్షపు నీరు మాత్రమే కాదు. చుట్టుపక్కల రెసిడెన్షియల్ సొసైటీల డ్రైన్ల నుంచి వచ్చి చేరిన నీరు కూడా. లోతైన చీకటి, బయటకు దారి లేని ఒక గుంత. కారులో చిక్కుకున్న యువరాజ్ బయటకు రావడానికి ప్రయత్నించాడు. ఫోన్ వెలిగించాడు. సహాయం కోసం కేకలు వేశాడు. తండ్రికి కాల్ చేసి ప్రమాదంలో చిక్కుకున్నానని చెప్పాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చారు. కానీ మబ్బు, చీకటి, నీటి లోతు లాంటి అంశాలు రక్షణ చర్యలను నిమ్మదిగా సాగేలా చేశాయి. దాదాపు గంటన్నర పాటు అతడు ఆ గుంతలో ప్రాణాల కోసం పోరాడాడు. చివరకు ఆ పోరాటం అక్కడే ముగిసింది.

ఈ మరణం తర్వాత బయటకు వచ్చిన విషయం మరింత భయానకమైనది. 2023లోనే యూపీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ నోయిడా అథారిటీకి ఒక అధికారిక లేఖ పంపింది. ఆ లేఖలో ఇదే ప్రాంతంలో నీరు నిలిచిపోతున్న సమస్యను స్పష్టంగా ప్రస్తావించారు. అక్కడ హెడ్ రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తే అదనపు నీరు హిండన్ నదిలోకి మళ్లించవచ్చని చెప్పారు. నీరు నిలవదని, ప్రమాదం నివారించవచ్చని వివరించారు. ఆ పనికి అవసరమైన బడ్జెట్ కూడా అప్పుడే కేటాయించామన్నారు. అంటే సమస్య తెలిసింది. పరిష్కారం తెలిసింది. డబ్బు కూడా ఉంది. కానీ ఆ లేఖ ఫైళ్లలోనే మిగిలిపోయింది. ప్రాజెక్ట్ మొదలుకాలేదు. నీరు అలాగే పేరుకుపోయింది. ఆ నిర్లక్ష్యమే ఆ రాత్రి యువరాజ్ ప్రాణాన్ని తీసుకుంది. ఆ గుంత దగ్గర ఒక బ్యారికేడ్ పెట్టినా, ఒక రిఫ్లెక్టర్ పెట్టినా, ఒక హెచ్చరిక బోర్డు పెట్టినా ఈ రోజు నా కుమారుడు బతికేవాడు కదా అని యువరాజ్‌ తండ్రి కన్నీళ్లు పెట్టకున్నాడు. అయితే అతని ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. నోయిడా అథారిటీ సీఈవోను పదవి నుంచి తప్పించింది. రియల్ ఎస్టేట్ కంపెనీలపై కేసులు నమోదయ్యాయి.

బాధ్యతలు ఒకరి నుంచి మరొకరికి నెట్టే ప్రక్రియ మొదలైంది. కానీ ఇవన్నీ ఒక నిజాన్ని మార్చలేవు. ఒక లేఖ సమయానికి కదిలి ఉంటే, ఒక ఫైల్ ముందుకు వెళ్లి ఉంటే, ఒక సంతకం పెట్టి ఉంటే యువరాజ్ ఈ రోజు తన ఇంట్లో ఉండేవాడు. ఇదంతా కనిపించడానికి ఓ వ్యక్తి మరణంలా కనిపించవచ్చు కానీ.. దానికి కారణమైన మూలాలు మాత్రం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ముసుగును కప్పుకొని కూర్చున్నాయి.

Exit mobile version