NTV Telugu Site icon

Sunita Williams: మిషన్ సక్సెస్..కానీ……!!!

Sunitha

Sunitha

1967లో అపోలో 1…
1986లో ఛాలెంజర్…
2003లో కొలంబియా…
… ఈ మూడు ప్రమాదాలు అంతరిక్షయాన చరిత్రలో అత్యంత విషాదాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని మూడు నెలలైంది. 8 రోజుల ప్రయాణం కోసం వెళ్లిన వీళ్లిద్దరూ తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు.. వాళ్ల రాకను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. అసలు వాళ్లు ఎందుకు వెళ్లారు.. ఎలా వెళ్లారు.. తిరిగి రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.. వాళ్లు భూమికి ఎప్పుడు తిరిగొస్తారు.. లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.

అంతరిక్ష యానం అనగానే మనకు గుర్తొచ్చే పేరు నాసా. కానీ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష యానానికి బోయింగ్ కంపెనీ తయారు చేసిన వాహక నౌకను వాడింది నాసా. స్పేస్ క్రాఫ్ట్ తయారీకోసం నాసా బోయింగ్ పైన ఎందుకు ఆధారపడిందో ఇప్పుడు చూద్దాం..అంతరిక్ష ప్రయోగాల్లో నాసా ముందుంటుంది. అంతరిక్ష కేంద్రానికి వెళ్లాలంటే సమర్థవంతమైన స్పేస్ క్రాఫ్ట్ లు అవసరం. నాసా కొన్ని దశాబ్దాలపాటు సొంతంగానే వాహక నౌకలను తయారు చేసుకుని ప్రయోగించింది. అయితే 2011 నాటికి అవన్నీ షెడ్డుకు చేరాయి. కొన్ని మార్గమధ్యంలోనే పేలిపోయాయి. దీంతో దాదాపు దశాబ్దంపాటు రష్యాకు చెందిన సూయుజ్ స్పేస్ క్రాఫ్ట్ పై నాసా ఆధారపడింది. ఇది అంత సేఫ్ కాదని భావించిన నాసా.. కొత్త వాహకనౌకల శ్రేణిని తయారు చేసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా వాహకనౌకలను తయారు చేసేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించింది. విమాన తయారీరంగంలో అగ్రగామిగా ఉన్న బోయింగ్, అంతరిక్ష ప్రయోగాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీలు ఈ బిడ్ లను దక్కించుకున్నాయి. బోయింగ్ కంపెనీకి 35వేల 274 కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కగా.. స్పేస్ ఎక్స్ కు 21వేల 836 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు లభించాయి. ఈ రేసులో బోయింగ్ కంటే స్పేస్ ఎక్స్ ముందు నిలబడింది.

నాసా కాంట్రాక్టులు దక్కించుకున్న బోయింగ్, స్పేస్ ఎక్స్ కంపెనీలు తమదైన శైలిలో అంతరక్ష వాహక నౌకలను రూపొందించాయి. ఈ విషయంలో బోయింగ్ వెనుకబడింది. తొలి విమాన వాహక నౌకలోనే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాసా కోసం స్పేస్ ఎక్స్ ఇప్పటికే 9 వాహనాలను సిద్ధం చేసి అంతరిక్ష కేంద్రానికి పంపించింది. అయితే బోయింగ్ కంపెనీకి మాత్రం అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. కాంట్రాక్టు దక్కించుకున్న తర్వాత 2019, 2022లో ప్రయాణికులు లేని వాహనాలను బోయింగ్ ప్రయోగించింది. అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా స్టార్ లైనర్ పేరుతో ప్రయాణికులతో కూడిన వ్యోమనౌకను రెడీ చేసింది. ఈ స్టార్ లైనర్ వాహక నౌకలోనే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 5న ఫ్లోరిడాలోని కేపె కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్లిన స్టార్ లైనర్ ISSకు చేరుకుంది. కానీ టేకాఫ్ అయినప్పటి నుంచి ఆటంకాలే ఎదురయ్యాయి. ప్రొపెల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడ్డాయి. థ్రస్టర్స్ మూసుకుపోయాయి. అయినా ఎలాగోలా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టార్ లైనర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిదిద్దేందుకు నాసా, బోయింగ్ ఎంతో ప్రయత్నించాయి. అయితే పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను అక్కడే ఉంచి స్టార్ లైనర్ భూమికి తిరిగి ప్రయాణమైంది.

సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్టార్ లైనర్ భూమికి తిరిగి వస్తుందా.. రాదా.. అనే సందేహాలుండేవి. అయితే అది క్షేమంగా తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం అది చేరుకోలేకపోయింది. ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేందుకు స్టార్ లైనర్ అనే స్పేస్ షిప్ ను తయారు చేసింది బోయింగ్. జూన్ 5న దీన్ని ప్రయోగించారు. ఇందులో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. స్టార్ లైనర్ 8 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇది టేకాఫ్ అయినప్పటి నుంచి సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో అనుకున్నట్టు సాగలేదు. అందుకే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను అంతరిక్ష కేంద్రంలోనే విడిచిపెట్టి ఆటోపైలెట్ మోడ్ లో భూమికి తిరిగి వచ్చేసింది స్టార్ లైనర్. న్యూ మెక్సికో లోని వైట్ శాండ్స్ హార్బర్ లో ఇది ల్యాండ్ అయింది.

మరి సునీతా విలియమ్స్, విల్మోర్ ల పరిస్థితి ఏంటి..? వాళ్లు ఎప్పుడు భూమికి తిరిగి వస్తారు..? బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను అందులో భూమికి తీసుకురావడం క్షేమం కాదని నాసా అభిప్రాయపడింది. అందుకే వాళ్లిద్దరినీ అంతరిక్ష కేంద్రంలోనే ఉంచారు. వాళ్లను స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా కిందకి తీసుకురావాలని నాసా నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ చివరి నాటికి క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సిద్ధం కానుంది. నలుగురు ప్రయాణికులు వెళ్లేందుకు వీలుగా దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఇద్దరితోనే ఇది అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, విల్మోర్ లను భూమికి తీసుకురానుంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో గడిపిన అనుభవం ఉంది. కాబట్టి వాళ్లకు ఇది ఆందోళన కలిగించే విషయం కాదు.

అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు చాలాసార్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ల పునరాగమనంపై మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.. దీనికి కారణమేంటి..? నాసా ఆధ్వర్యంలో గతంలో స్పేస్ షిప్స్ ఎన్నోసార్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తిరిగొచ్చాయి. ఎందరో వ్యోమగాములు సురక్షితంగా వెళ్లి వచ్చారు. కానీ 2003 ఫిబ్రవరి 1న నాసా స్పేస్ షటిల్ కొలంబియా తీవ్ర విషాదాన్ని నింపింది. అంతరిక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణమైన కొలంబియా వ్యోమనౌక భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో పేలిపోయింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన కల్పానా చావ్లా సహా ఆరుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 1986 జనవరి 26న ఛాలెంజర్ వ్యోమనౌక పేలిపేవడంతో ఏడుగురు చనిపోయారు. ఈ రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని నాసా ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే స్టార్ లైనర్ లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ల తిరుగు ప్రయాణానికి నాసా నో చెప్పింది. ఇప్పుడు ISS నుంచి స్టార్ లైనర్ భూమికి ఖాళీగా తిరిగొచ్చింది. కాబట్టి ఇది సేఫ్ అని చెప్పే వాళ్లూ ఉన్నారు. కానీ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా.. అందుకే సునీతా విలియమ్స్, విల్మోర్ ల రాకకు నాసా నో చెప్పింది.

8 రోజుల ప్రయాణం కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు 8 నెలలపాటు అక్కడే గడపాల్సి వస్తోంది. 2025 ఫిబ్రవరిలో వాళ్లిద్దరూ భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆలస్యమైనా పర్లేదు.. వాళ్లిద్దరూ క్షేమంగా తిరిగి వస్తే చాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. నాసా కూడా వ్యోమగాముల విషయంలో తొందర పడకూడదని నిర్ణయించింది. స్టార్ లైనర్ లోనే వాళ్లను తిరిగి తీసుకురావాలని బోయింగ్ ఎంత ఒత్తిడి చేసినా నాసా ఏమాత్రం తగ్గలేదు. వాళ్లను క్షేమంగా భూమికి తిరిగి తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యం అని తేల్చేసింది. మొత్తానికి బోయింగ్ స్టార్ లైనర్.. మిషన్ సక్సెస్ అయింది.. కానీ టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోయింది.

Show comments