Site icon NTV Telugu

Union Budget 2026: మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది? ఆ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా?

Budget 2026 Middle Class

Budget 2026 Middle Class

ప్రతి బడ్జెట్ ముందు ఇండియన్‌ మిడిల్ క్లాస్‌ వర్గంలో ఒకే రకమైన ఆలోచనా విధానం కనిపిస్తుంది. ఈసారి అయినా ట్యాక్స్ ఫైలింగ్ సులభం అవుతుందా? డాక్యుమెంట్ల పని, నోటీసులు, గందరగోళం తక్కువవుతాయా?

నిజానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించే బాధ్యతను ఎవరూ తప్పించుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఆ బాధ్యత అర్థం కాని డాక్యుమెంట్లు, మారుతున్న నిబంధనల మధ్య భయంగా మారకూడదన్నదే ఉద్యోగులు, మధ్యతరగతి కోరుకుంటోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు ముందు ఈ ఆశలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి.

వన్ నేషన్ వన్ ITR నుంచి TDS వ్యవస్థ మార్పుల వరకు, ఎయిర్ పొల్యూషన్‌ను ట్యాక్స్ పాలసీతో ఎదుర్కోవాలన్న ప్రతిపాదనల వరకూ ఈసారి డిమాండ్లు సాధారణ రాయితీలకన్నా పెద్దవిగా మారాయి. ఇంతకీ ఇవి నిజంగా అమలయ్యే సంస్కరణలా? నిర్మలమ్మ ఏం చేయనున్నారు?

బడ్జెట్ 2026పై మధ్యతరగతి ఆశల్లో మొదటి పెద్ద అంశం.. వన్ నేషన్-వన్ ITR ఫారం. ప్రస్తుతం ఏడు రకాల ITR ఫారాలు ఉండటం ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ఫ్రీల్యాన్సర్లకు పెద్ద గందరగోళంగా మారుతోంది.

ఒకే వ్యక్తికి ఒక ఏడాది ఒక ఫారం, మరో ఏడాది మరో ఫారం అవసరమవుతోంది. ఆదాయ వనరులు కొద్దిగా మారినా మొత్తం రిటర్న్ ఫైలింగ్ విధానమే మారిపోతుంది. అందుకే ఒకే యూనిఫైడ్ ITR ఫారం ఉంటే, అందులో ఆదాయ రకం ఎంచుకుంటే సరిపోతుందన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇది ట్యాక్స్ తగ్గించకపోయినా, భయాన్ని తగ్గించే సంస్కరణగా మిడిల్ క్లాస్ చూస్తోంది. ఇక కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి రానుండడంతో మరో కన్ఫ్యూజన్ నెలకొంది. గత ఆరు దశాబ్దాల్లో వచ్చిన వందలాది సర్క్యులర్లు, నోటిఫికేషన్లు ఇప్పటికీ రిఫరెన్స్‌గా ఉండటంతో ఏ నిబంధన వర్తిస్తుందో అర్థం కాక ఉద్యోగులు, అకౌంటెంట్లు ఇబ్బంది పడుతున్నారు. కొత్త చట్టానికి అనుసంధానంగా ఏ సర్క్యులర్ చెల్లుబాటు అవుతుందో ఒకే డాక్యుమెంట్‌లో స్పష్టంగా చెబితే ట్యాక్స్ కంప్లయన్స్ చాలా సులభమవుతుందన్నది ఈ వర్గం ఆశ.

మరింత తీవ్రమైన సమస్యగా TDS వ్యవస్థ మారింది. ప్రతి చిన్న చెల్లింపుపై వేర్వేరు రేట్లు, వేర్వేరు సెక్షన్లు ఉండటం వల్ల కంపెనీలు మాత్రమే కాదు, ఉద్యోగులు కూడా రీఫండ్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక ఇప్పటికే డిజిటల్ రికార్డుల్లో ఉన్న సమాచారానికి మళ్లీ సర్టిఫికెట్లు అవసరం లేదన్న సూచనలు ఈసారి బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి ఆదాయం తగ్గించకుండా, ప్రజల సమయాన్ని ఆదా చేసే మార్పుగా భావిస్తున్నారు. అటు ఈసారి ట్యాక్స్‌ను ఒక సామాజిక సమస్యకు ఉపయోగించాలన్న డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. గాలి కాలుష్యం దేశవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభంగా మారుతున్న వేళ.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రత్యేక ట్యాక్స్ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదన చర్చలో ఉంది. తక్కువ పన్నులు, తక్కువ మినహాయింపుల విధానానికి విరుద్ధంగా ఉన్నా, ఇది ప్రజారోగ్యానికి అవసరమైన మినహాయింపుగా ప్రభుత్వం చూడాలని మధ్యతరగతి భావిస్తోంది.

మొత్తంగా చూస్తే ఈసారి మిడిల్ క్లాస్ అడుగుతున్నది భారీ ట్యాక్స్ రాయితీలు కాదు. స్పష్టత, స్థిరత్వం, సులభత. ట్యాక్స్ వ్యవస్థ భయపెట్టే అడ్డంకిగా కాకుండా, అర్థమయ్యే ప్రక్రియగా మారాలని కోరుకుంటోంది. ఈ ఆశలు ఎంతవరకు బడ్జెట్‌లో ప్రతిఫలిస్తాయో ఫిబ్రవరి 1న తేలనుంది.

ALSO READ: భార్యాభర్తలకు నిర్మలమ్మ గుడ్‌న్యూస్‌.. డబ్బును ఆదా చేసుకునే ఛాన్స్?

Exit mobile version