బడ్జెట్(Union Budget 2026) దగ్గర పడిన ప్రతిసారి పన్ను రాయితీలు, సబ్సిడీలపైనే చర్చ నడుస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం దృష్టి మరో వైపు కూడా ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న మహిళలకు నిజంగా ఆ అకౌంట్ ఉపయోగపడుతోందా అనే ప్రశ్నపై చర్చ జరుగుతోంది.
కోట్లాది మహిళల పేర్లపై జనధన్ అకౌంట్లు ఉన్నాయి. కానీ వాటిలో చాలావరకు యాక్టివ్‌గా లేవు. డబ్బు జమ చేయడానికి మాత్రమే కాదు, అప్పు తీసుకోవడానికి, ఇన్సూరెన్స్ భద్రత పొందడానికి ఆ అకౌంట్లు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్నదే ఇప్పుడు బడ్జెట్‌కి ముందు కీలక చర్చగా మారింది. ఇదే సమయంలో మహిళల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులు, లోన్లు, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ తీసుకురావాలా అనే ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రామీణ మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, మొదటిసారి వ్యాపారం మొదలుపెట్టే మహిళలకు ఫైనాన్స్ నిజంగా చేరుతోందా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కషన్.
ఇక జనధన్ తర్వాత ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో రెండో దశ మొదలవుతోందా అనే ప్రశ్న వినిపిస్తోంది. మరి 2026 బడ్జెట్ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యానికి నిజమైన మలుపు తిప్పగలదా?
ఈ చర్చ వెనుక ఉన్న ప్రధాన కారణం ఒకటి. జనధన్ యోజనతో భారత్‌లో బ్యాంక్ అకౌంట్లు తెరవడంలో ప్రభుత్వం దాదాపు లక్ష్యాన్ని చేరుకుంది. అంటే.. ఎక్కువమంది మహిళల పేర్లపై ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కానీ అకౌంట్ తెరవడం ఒక దశ అయితే, దాన్ని ఆర్థిక జీవితంలో ఉపయోగపడే సాధనంగా మార్చడం మరో పెద్ద దశ. ప్రభుత్వ అంచనాల ప్రకారం కోట్లాది జనధన్ అకౌంట్లు ఇప్పటికీ లావాదేవీలు లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల అకౌంట్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అకౌంట్ ఉన్నా అప్పు తీసుకునే అవకాశం లేదు. ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలియదు. దీంతో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అనేది సంఖ్యల వరకే పరిమితమైపోయిందన్న విమర్శలు ఉన్నాయి.
అందుకే బడ్జెట్ 2026లో మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌పై కేంద్రం ఆలోచిస్తోంది. మహిళల పేరుపై జనధన్ అకౌంట్ ఉన్నవారికి టైలర్‌మేడ్ క్రెడిట్ కార్డులు, చిన్న మొత్తాల్లో లోన్లు, తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్ స్కీములు తీసుకురావాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
ఇది మహిళలను కేవలం సేవింగ్స్ వరకే పరిమితం చేయకుండా, క్రెడిట్ వ్యవస్థలోకి తీసుకురావాలన్న ప్రయత్నంగా అధికారులు చూస్తున్నారు. ఇదే సమయంలో గ్రామీణ మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులపై కూడా ప్రత్యేక ఫోకస్ ఉంది. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ పనిచేస్తున్నా, బ్యాంకింగ్ వ్యవస్థతో వారి కనెక్షన్ ఇంకా బలహీనంగానే ఉంది. గ్రామీణ వ్యాపారాలు, చిన్న స్థాయి పరిశ్రమలు మొదలుపెట్టే మహిళలకు క్రెడిట్ స్కోర్ లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారుతోంది. దీన్ని మార్చేందుకు గత బడ్జెట్‌లో తీసుకొచ్చిన గ్రామీణ క్రెడిట్ స్కోర్ వ్యవస్థను మరింత విస్తరించాలన్న ఆలోచన కూడా ఈసారి చర్చలో ఉంది.
నీతిఆయోగ్ కూడా జనధన్ యోజన పనితీరును సమీక్షిస్తోంది. ముఖ్యంగా అకౌంట్లు యాక్టివ్‌గా ఉంచేలా ఎలా ప్రోత్సహించాలన్నదానిపై దృష్టి పెట్టింది. కేవలం డబ్బు జమ చేయడానికి మాత్రమే కాకుండా, అవసరమైనప్పుడు అప్పు తీసుకునే అవకాశం, ప్రమాద సమయంలో ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తేనే అకౌంట్లు యాక్టివ్‌గా ఉంటాయన్నది ఈ రివ్యూలో వచ్చిన ముఖ్యమైన అభిప్రాయం.
100శాతం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అంటే అకౌంట్ల సంఖ్య కాదు, వాటి వినియోగమని కేంద్రం అర్థంచేసుకుంది. మరో కీలక అంశం ఫైనాన్షియల్ లిటరసీ. మహిళలకు క్రెడిట్, ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్నా, వాటిని అర్థం చేసుకునే అవగాహన లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే అకౌంట్లతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా బడ్జెట్‌లో భాగంగా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది డిజిటల్ ఎకానమీని బలపర్చడానికి కూడా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త కూడా అవసరం.
క్రెడిట్ అందుబాటులో పెరిగితే అప్పుల భారం కూడా పెరిగే ప్రమాదం ఉంది. మహిళల పేరుపై తీసుకున్న లోన్లు తిరిగి కుటుంబ ఆర్థిక ఒత్తిడిగా మారకుండా ఎలా నియంత్రించాలన్న ప్రశ్న కూడా నిపుణులు లేవనెత్తుతున్నారు. అందుకే ఈ స్కీములు సంక్షేమం మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన ఫైనాన్స్ దిశగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ALSO READ: మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది? ఆ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా?
