NTV Telugu Site icon

Tollywood Rewind 2024 : 2024లో భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన తెలుగు సినిమాలివే

Tollywood Hit Movies

Tollywood Hit Movies

సినీ పరిశ్రమ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ. ప్రతి ఏడాది రెండు వందలకు పైగా సినిమాలు విడుదలవుతాయి. కానీ అందులో పది, పదిహేను సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తున్నాయి. మరి ఈ ఏడాది అంటే 2024లో తెలుగులో ఎన్ని సినిమాలు తెరకెక్కాయి. అందులో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అయ్యాయి… ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయో “టాలీవుడ్ రీవైండ్ 2024″లో చూద్దాం.

ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా సినీ ప్రియులను అలరించడానికి అనేక తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ మూవీస్, చిన్నా చితకా చిత్రాలు అన్నీ కలిపి దాదాపు 250 సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అన్ని తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ, వాటిల్లో ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్ రేట్ చూసుకుంటే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. గట్టిగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సినిమాలు 20 కూడా లేవు. జనవరి విషయానికి వస్తే మొత్తం 20 సినిమాలు రిలీజ్ అయితే సంక్రాంతి సందర్భంగా వచ్చిన హనుమాన్, నా సామి రంగ మాత్రమే హిట్ అయ్యాయి. ఫిబ్రవరి విషయానికొస్తే.. ఈ నెలలోనే 20 కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో విజయాన్ని అందుకున్నవి రెండో మూడో సినిమాలుంటాయంతే. ముందుగా సుహాస్ హీరోగా నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మంచి విజయాన్ని అందుకుంది. సుహాస్ కి మంచి పేరు తెచ్చింది. అలాగే యంగ్ హీరో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోనతో హిట్ అందుకున్నాడు. సుందరం మాస్టర్, మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించాయి.

ఆ తరువాత టాలీవుడ్ లో మే నెలలో 20కి పైగా సినిమాలు తమ లక్ ని టెస్ట్ చేసుకునేందుకు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కానీ ప్రేక్షకుల్ని సరిగ్గా మెప్పించలేక పోయాయి. అందులో ఒక్క సినిమా మాత్రమే బాక్సాఫీస్ వద్ద కాస్త సక్సెస్ అయ్యిందని చెప్పాలి. అదే విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ డిఫరెంట్ గెటప్, యాక్టింగ్ తో మెప్పించాడు. మే నెలలో ఇదొక్కటే హిట్ సినిమా. ఇదే నెలలో తమ సినిమాలు రిలీజ్ చేసిన అల్లరి నరేష్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండకి నిరాశే మిగిలింది. ఇక 2024 సెకండ్ హాఫ్ జూలై నెలలో కేవలం 10 సినిమాలే వచ్చాయి. కానీ వాటిల్లో ఒక్కటి కూడా మెప్పించలేకపోయింది. కానీ ఆగస్టు నెలలో 30 సినిమాలొచ్చాయి మూడు నాలుగు హిట్స్ కూడా ఉన్నాయి. అలాగే సక్సెస్ అవుతాయనుకున్న సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయిన వారిలో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలున్నాయి. వీటిపై అంచనాలున్నాయి. కానీ అవి అందుకోలేక దారుణంగా పరాజయాన్ని చవిచూశాయి. కానీ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.

ఇక సెప్టెంబర్ నెల కూడా టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చింది. ఈ నెలలో 35 చిన్న కథ కాదు, మత్తు వదలరా2 బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఇక సెప్టెంబర్ ఎండింగ్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ దేవర పార్ట్1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం అన్ని బాషల్లోనూ సక్సెస్ టాక్ తెచ్చుకుని 600 ల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో అదరగొట్టగా… శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక నవంబర్ లోనూ దాదాపు 20 సినిమాల వరకూ రిలీజయ్యాయి. కానీ సరైన విజయం ఒక్కటీ లేదు. నవంబర్ లో భారీ క్రేజ్ తో వచ్చిన వరుణ్ తేజ్ మట్కా నిరాశపరచింది. అలాగే డబ్బింగ్ మూవీ కంగువ కూడా ఫెయిల్ అయ్యింది. ఇక డిసెంబర్ లో మాత్రం టాలీవుడ్ కి ఓ భారీ విజయం దక్కింది. అదే పుష్ప 2. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతూ పాన్ ఇండియా లెవల్లో రికార్డులను బ్రేక్ చేస్తోంది.