Thailand Cambodia war: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు చాలవన్నట్లు, ఇప్పుడు కొత్తగా థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు బౌద్ధ దేశాలు 1000 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం కొట్టుకోవడం గమనార్హం. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే 11 వ శతాబ్ధపు హిందూ దేవాలయం(ప్రీహ్ విహార్) కోసం యుద్ధం చేసుకుంటున్నాయి. శతాబ్ధ కాలం నుంచి ఈ ఆలయంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. తాజాగా, జరుగుతున్న ఘర్షణల్లో 10 మందికి పైగా పౌరులు, అనేక మంది సైనికులు మరణించారు.
మే నెల నుంచి ముదురుతున్న వివాదం..
రెండు దేశాల మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంగమైన ఎమరాల్డ్ ట్రయాంగిల్‌లో థాయ్ దళాలతో జరిగిన ఘర్షణలో కంబోడియా సైనికుడు మరణించిన తర్వాత మే నెలలో ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నాయి. జూన్ నెలలో సరిహద్దు ప్రాంతంలో మరోసారి టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. థాయిలాండ్ కంబోడియాకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని బెదిరించింది. జూలై నెలలో ఐదుగురు థాయి సైనికులు ల్యాండ్ మైన్ పేలుడు కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. దీనికి కంబోడియాను థాయిలాండ్ నిందించింది. అయితే, ఈ ఆరోపణల్ని కంబోడియా ఖండించింది. థాయిలాండ్ కంబోడియా రాయబారిని బహిష్కరించింది. సరిహద్దు మూసేయడంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. బ్యాంకాంగ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయడం ద్వారా కంబోడియా ప్రతీకారం తీర్చుకుంది.
ఎఫ్-16, రాకెట్లతో దాడులు:
గురువారం సరిహద్దు వద్ద రెండు దేశాలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డాయి. రెండు దేశాల సైనికులు ఇరు వైపుల కాల్పులు జరిపారు. థాయిలాండ్‌లోని సిసా కెట్ ప్రావిన్స్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. ఒక గ్యాస్ స్టేషన్ పై కాల్పుల జరపడంతో ఆరుగురు మరణించారు. సురిన్ ప్రావిన్స్‌లోని ఫానోమ్ డాంగ్ రాక్ హాస్పిటల్‌తో సహా థాయిలాండ్‌లోని సైనిక మరియు సైనికేతర ప్రదేశాలపై కంబోడియా రాకెట్లను ప్రయోగించిందని థాయిలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
ప్రతిగా థాయిలాండ్ తన ఎఫ్-16 ఫైటర్ జెట్లను మోహరించింది. కంబోడియా సరిహద్దు ప్రాంతాలపై బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించినట్లు కంబోడియా తెలిపింది. ఉద్రిక్తతల మధ్య మీడియేషన్ చేసేందుకు చైనా ఆఫర్ చేసింది. అయినప్పటికీ ఘర్షణలు పెరుగుతూనే ఉన్నాయి. థాయిలాండ్ కంబోడియాలోని తమ పౌరుల్ని దేశం విడిచిపెట్టి రావాలని కోరింది.
హిందూ ఆలయం కోసం ఘర్షణ:
థాయిలాండ్, కంబోడియాలు 800 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. 1863-1953 వరకు ఫ్రెంచ్ వలసదారులు కంబోడియాను ఆక్రమించిన సమయంలో ఈ సరిహద్దును గీశారు. 1907లో ఈ సరిహద్దుపై ఒక ఒప్పందం కుదిరింది. అయితే, థాయిలాండ్ ఈ మ్యాప్‌ని సవాల్ చేసి, 11వ శతాబ్ధపు హిందూ ఆలయం (ప్రీహ్ విహార్)ను కంబోడియాలో ఉండటాన్ని వ్యతిరేకించింది. ప్రీహ్ విహార్ ఒక శివాలయం. దీనిని కెమెర్ రాజ్యపాలనలో కట్టారు. 1959లో కంబోడియా ఈ విషయాన్ని అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లింది. కంబోడియాకే ఆ ఆలయం చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది.
2008లో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది థాయిలాండ్ నుండి తీవ్ర నిరసనకు దారితీసింది. రెండు వైపుల సైనికుల మధ్య అప్పటి నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2011లో పెద్ద ఘర్షణ జరిగింది. రెండు దేశాల మధ్య వారం పాటు యుద్ధం జరిగింది. ఈ ఘర్షణల్లో 15 మంది మరణించారు.10,000 మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా, మరోసారి ఈ రెండు దేశాలు యుద్ధం అంచుకు చేరుకున్నాయి.
