NTV Telugu Site icon

Telugu Heroines: కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు.. అండగా నిలిచేందుకు మనసు రాదా?

Floods Heorines

Floods Heorines

Telugu Heroines Ignoring Floods in telugu States: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ లాంటి చోట్ల గత మూడు నాలుగు రోజుల నుంచి అన్నం కూడా దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నాయి. అయినా పూర్తిస్థాయిలో ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్న నేపద్యంలో చాలావరకు ప్రైవేటు సంస్థలు జనసేన, తెలుగుదేశం, వైసీపీ లాంటి పార్టీలు సైతం రంగంలోకి దిగి తాము చేయాల్సింది చేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్, నందమూరి బాలకృష్ణ, సిద్దు జొన్నలగడ్డ లాంటి హీరోలు. త్రివిక్రమ్, వెంకీ అట్లూరి లాంటి దర్శకులు, చినబాబు, నాగ వంశీ, అశ్వినీ దత్ లాంటి నిర్మాతలు తమ పరిధిలో తాము విరాళాలు ప్రకటించారు.

Biggest Flop in India: 45 కోట్లు బడ్జెట్ పెడితే 45 వేలు వచ్చాయ్.. ఏ ఓటీటీలో చూడాలంటే?

అయితే తెలుగు హీరోయిన్లకు మాత్రం ఏమైంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు హవా అంతా బయట(ఇతర రాష్ట్రాల) నుంచి వచ్చిన భామలదే. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాళ్లకు చాలా తక్కువ ఆదరణ లభిస్తుంది, ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో. ఇప్పుడు టాప్ తెలుగు హీరోయిన్ల విషయానికి వస్తే సమంత, శ్రీ లీల, రష్మిక మందన, పూజ హెగ్డే, తమన్నా, కాజల్, రకుల్, కీర్తి సురేష్, శృతిహాసన్, సంయుక్త మీనన్, అనుపమ, మృణాల్, నిధి అగర్వాల్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, రాశి ఖన్నా అంటూ చాలామంది టాప్ లీగ్ లో కొనసాగుతున్నారు. వారి స్థానాలు ఏవైనా, ఇలాంటి సమయంలో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క హీరోయిన్ నుంచి కూడా విరాళం సంగతి పక్కన పెడదాం. కనీసం వరద బాధితులకు అండగా ఉంటామని కానీ ధైర్యంగా ఉండండి అని చెప్పిన పాపాన పోలేదు.

తెలుగు అమ్మాయి, హీరోయిన్గా కొన్ని సినిమాల్లో ప్రయత్నాలు చేసి ఇప్పుడు హీరోయిన్ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న అనన్య నాగళ్ళ మాత్రం ఈ విషయంలో మంచి మనసు చాటుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండున్నర లక్షలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రెండున్నర లక్షలు ప్రకటించింది. తెలుగు వాళ్ళ అభిమానం మీద మార్కెట్ ఏర్పాటు చేసుకుని కోట్లకు కోట్లు తీసుకునే హీరోయిన్లు అదే తెలుగు వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కనీసం అటువైపు చూడకపోవడం బాధాకరం. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు హీరోయిన్ల మార్కెట్ ఆధారంగా కాకుండా, తెలుగువారిని ప్రోత్సహిస్తే తెలుగు వారికి అండగా నిలబడే అవకాశం ఉంటుంది అని నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆలోచిస్తే లాజికల్ అనిపించక పోయినా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఇక్కడ వాళ్ల మీద ప్రేమ ఉంటుందా? అంటే అవునని చెప్పలేం. ఏదో తమ టాలెంట్ చూసి డబ్బులు ఇస్తున్నారు అని రెమ్యునరేషన్లు తమ సొంత రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడ తమ కుటుంబాలను వృద్ధిపరుచుకుంటున్నారు. కానీ ఎవరైతే సినిమాలు చూస్తున్నారు కాబట్టి తమకు ఇంత మార్కెట్ వచ్చిందో, వాళ్లని మాత్రం విస్మరించినట్లే అనిపిస్తోంది. నిజానికి ఈ విషయంలో ఇంకా కొందరు హీరోలు కూడా ముందుకు రాలేదు. వేరువేరు దేశాలలో వెకేషన్ కి వెళ్ళిన వాళ్ళు, ఇంకా ఎంత ఇవ్వాలో డిసైడ్ కాని వాళ్ళు, ఫలానా వాళ్లు ఇస్తే చూద్దాంలే అనుకుంటున్న హీరోలు సైతం ఉన్నారు. కానీ హీరోయిన్ల విషయం మాత్రం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ముందుకొచ్చి ఇచ్చారు కానీ మరికొందరు పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉండిపోయారు. మరి ఇప్పుడేం చేస్తారో చూడాలి.