Site icon NTV Telugu

Taliban-Domestic Violence: భార్యను చితకబాదే హక్కు.. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు బహిరంగ శిక్షలు!

Taliban enforcers overseeing public punishment of women in Afghanistan under new domestic violence laws

Domestic Violence Legalise In Afghanistan

ఆ దేశంలో భార్యను కొట్టొచ్చు. చితకబాదొచ్చు కూడా! అయితే ఎముకలు విరగకుండా బాదాలట. రక్తం బయటకు కారకుండా కొబితే చట్టం భర్త వెంట ఉంటుంది. ఆఫ్ఘానిస్తాన్‌లో అమలవుతున్న కొత్త రూల్ ఇదే. అక్కడ గృహహింసను చట్టబద్ధం చేసేశారు. భర్త చేతి దెబ్బకు పరిమితి పెట్టిన ప్రభుత్వం.. అసలు భార్యను శారీరంగా హింస పెట్టకూడదని మాత్రం చెప్పలేదు. హింసకు గీత గీసిన ప్రభుత్వం..హింసను రద్దు చేయకుండా భర్తకు సర్వ హక్కులూ ఇచ్చింది. ఈ కొత్త చట్టానికి తాలిబాన్ అత్యున్నత నాయకత్వం ఆమోదం ఇచ్చింది.

సమాజాన్ని స్పష్టంగా స్థాయిలుగా విభజించింది. పైస్థాయిలో ఉన్న మత పెద్దలకు కేవలం సూచన సరిపోతుంది. కాస్త ఇన్‌ఫ్లుయన్స్‌ ఉంటే కేవలం హెచ్చరించి వదిలేస్తోంది. మధ్యస్థ వర్గానికి జైలు శిక్ష ఉంటుంది. దిగువ వర్గానికి జైలుతో పాటు శారీరక శిక్ష అమలుచేస్తారు.

మహిళల స్థితి ఇందులో ఇంకా దారుణంగా ఉంది. ఆమెను స్వతంత్ర హక్కులున్న వ్యక్తిగా కాకుండా పురుష ఆధీనంలో ఉండాల్సిన సభ్యురాలిగా చిత్రీకరించారు. ఆమె జీవితం తన చేతుల్లో కాదు.. నియంత్రణలో ఉండాల్సిన ఒక శరీరంగా మాత్రమే చూస్తున్నారు. ఒక మహిళ తనపై జరిగిన దాడిని ఫిర్యాదు చేయాలంటే, గాయాలు చూపించాలి. పూర్తిగా ముసుగుతో నిలబడాలి. తనపై దాడి చేసిన భర్తనే వెంట తీసుకురావాలి. అతనే భార్యపై దాడి చేసి అతనే సాక్ష్యం చెప్పాలట. గృహహింసను కుటుంబ క్రమశిక్షణగా మలిచిన ఈ శాసనంపై మావన హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

ఈ కొత్త శిక్షాస్మృతికి మహాకిము జజాయి ఉసూల్‌నామా అని పేరు పెట్టారు. సుమారు 90పేజీల ఈ పుస్తకం దేశవ్యాప్తంగా కోర్టులకు పంపిణీ అయింది. ఇందులో శిక్షల విధానం పూర్తిగా మతాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించారు. తీవ్రమైన నేరాలకు తీర్పు చెప్పేది సివిల్ కోర్టులు కాదు, మత పెద్దలు.

చిన్న నేరాలకు తజీర్ పేరుతో శిక్షలు అమలు చేస్తారు. భార్య విషయంలో తజీర్ అంటే భర్తతో దెబ్బలు తినడం. ఇంకా ఆందోళన కలిగిస్తున్న అంశం ఆర్టికల్-34. భర్త అనుమతి లేకుండా భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తిరిగి రాకపోతే ఆమెనే నేరస్తురాలిగా పరిగణిస్తారు. ఆమెను ఆశ్రయించిన కుటుంబ సభ్యులకూ జైలు శిక్ష విధించే నిబంధన ఉంది. అంటే హింస నుంచి తప్పించుకునేందుకు ఇంటి బయట అడుగు పెడితే అది కూడా నేరమే. ఇది కేవలం గృహహింసకే పరిమితం కాదు. మొత్తం సమాజాన్ని శ్రేణులుగా విభజించే విధానం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే నేరానికి శిక్ష వ్యక్తి సామాజిక స్థితిని బట్టి మారుతుంది. చట్టం ముందు సమానత్వం అనే భావన పూర్తిగా కూలిపోయింది.

నిజానికి ఈ పరిస్థితి ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. 90దశకంలో తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలకు చదువును దూరం చేశారు. ఉద్యోగాలపై ఆంక్షలు, ప్రజా ప్రదేశాల్లో దేహదండనలు అమలయ్యాయి.

2021లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట మహిళలకు పాఠశాలలు మూసివేశారు. విశ్వవిద్యాలయాల నిషేధం విధించారు. ఎన్‌జీవోలపై ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు శిక్షాస్మృతిలో ఈ మార్పులు వరుసగా అమలవుతున్నాయి. గతంలో నాటో మద్దతు ఉన్న ప్రభుత్వ కాలంలో కూడా బలవంతపు వివాహాలు, అత్యాచారం, గృహహింసలపై ప్రత్యేక చట్టాలు ఉండేవి. శిక్షలు తక్కువైనా, కనీసం నేరంగా గుర్తించేవి. ఇప్పుడు ఆ రక్షణలేవీ లేవు. ఒక మహిళ తనపై జరిగిన తీవ్రమైన దాడిని నిరూపించినా, భర్తకు గరిష్టంగా 15 రోజుల శిక్ష మాత్రమే ఉండే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

నిజానికి మహిళలపై వివక్షను తొలగించే అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఇలాంటి శారీరక, మానసిక హింసను నిరాకరిస్తాయి. కానీ ఆఫ్ఘానిస్తాన్‌లో ఇప్పుడు చట్టమే హింసకు మద్దతుగా నిలుస్తోంది.

ఇంకా భయంకర విషయం ఏమిటంటే ఈ చట్టంపై బహిరంగంగా చర్చించడానికే ప్రజలు భయపడుతున్నారు. ప్రతీకార చర్యల భయం వెంటాడుతోంది. కోర్టుల్లో పనిచేసే కొంతమంది న్యాయ సలహాదారులు కూడా మౌనంగా ఉన్నారని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఒక మహిళ తన హక్కు గురించి మాట్లాడటమే ప్రమాదంగా మారింది.
చట్టం ప్రజలను రక్షించాలి కానీ.. ఇక్కడ చట్టం ఒక వర్గాన్ని, ముఖ్యంగా మహిళలను, నియంత్రించడానికి ఆయుధంగా మారింది.

ఇంటి గోడల మధ్య కనిపించే నరకం ఇప్పుడు న్యాయపరమైన పరిమితుల్లో ఉంటే చాలు అన్నట్టుగా వ్యవస్థ పనిచేస్తోంది. ఒక దేశంలో హింసకు గరిష్ట పరిమితి నిర్ణయించడమేంటో అర్థంకాని దుస్థితి దాపరించింది.

ALSO READ: ప్లే బాయ్‌.. హ్యాండ్‌సమ్‌.. క్రికెట్‌లో తోపు.. చివరకు జైలు గోడల మధ్య చిక్కుకుపోయాడు.. ఇమ్రాన్‌ఖాన్‌ గూస్‌బంప్స్ స్టోరీ!

Exit mobile version