NTV Telugu Site icon

Sunitha Returns: సునీతా విలియమ్స్ రాకకు వేళాయే..!!

Sunitha Williams

Sunitha Williams

అంతరిక్ష ప్రయోగంలో భాగంగా ISSకు వెళ్లిన సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడంపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. సునీతా టీమ్.. క్షేమంగా తిరిగి వస్తుందా.. అనే ఆందోళన కూడా మొదలైంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి రిస్కూ తీసుకోకూడదని నాసా నిర్ణయించింది. ఇప్పుడు వాళ్లను క్షేమంగా భూమికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. మరి సునీతా విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది..? వాళ్లు భూమికి ఎలా తిరిగి రాబోతున్నారు…?

అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ ఎప్పుడు వస్తుంది.. ఎలా వస్తుంది.. అనే విషయాలు తెలుసుకునే ముందు.. అసలు సునీతా విలియమ్స్ అక్కడికి ఎలా వెళ్లింది.. ఎందుకు తిరిగి రాలేకపోయింది అనే అంశాలను చూద్దాం.. అంతరిక్ష ప్రయోగం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నాసా. అయితే నాసా కూడా అప్పుడప్పుడు ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్స్ పైన ఆధారపడాల్సి వస్తుంది. గతంలో నాసా ప్రయోగించిన కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ పేలిపోవడం, మరికొన్ని మూలన పడడంతో కొత్త వాహక నౌకలపై ఆధారపడాల్సి వచ్చింది. అందుకే కొత్త స్పేస్ షిప్‌ల కోసం ప్రైవేటు సంస్థలను ఆహ్వానించింది. విమాన తయారీరంగంలో అగ్రగామిగా ఉన్న బోయింగ్, అంతరిక్ష ప్రయోగాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీలు కొత్త స్పేస్ క్రాఫ్ట్స్ తయారీకి ముందుకొచ్చాయి. బోయింగ్ కంపెనీ 35వేల 274 కోట్ల రూపాయల కాంట్రాక్టును.. స్పేస్ ఎక్స్ 21వేల 836 కోట్ల రూపాయల కాంట్రాక్టును దక్కించుకున్నాయి.

నాసా కాంట్రాక్టులు దక్కించుకున్న బోయింగ్, స్పేస్ ఎక్స్ కంపెనీలు తమదైన శైలిలో అంతరక్ష వాహక నౌకలను రూపొందించాయి. ఈ విషయంలో బోయింగ్ వెనుకబడింది. తొలి విమాన వాహక నౌకలోనే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాసా కోసం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఇప్పటికే 9 వాహనాలను సిద్ధం చేసి అంతరిక్ష కేంద్రానికి పంపించింది. అయితే బోయింగ్ కంపెనీకి మాత్రం అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. కాంట్రాక్టు దక్కించుకున్న తర్వాత 2019, 2022లో ప్రయాణికులు లేని వాహనాలను బోయింగ్ ప్రయోగించింది. అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా స్టార్ లైనర్ పేరుతో ప్రయాణికులతో కూడిన వ్యోమనౌకను రెడీ చేసింది. ఈ స్టార్ లైనర్ వాహక నౌకలోనే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 5న ఫ్లోరిడాలోని కేపె కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్లిన స్టార్ లైనర్ ISSకు చేరుకుంది. కానీ టేకాఫ్ అయినప్పటి నుంచి ఆటంకాలే ఎదురయ్యాయి. ప్రొపెల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడ్డాయి. థ్రస్టర్స్ మూసుకుపోయాయి. అయినా ఎలాగోలా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టార్ లైనర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిదిద్దేందుకు నాసా, బోయింగ్ ఎంతో ప్రయత్నించాయి. అయితే పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు.

సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్టార్ లైనర్ భూమికి తిరిగి వస్తుందా.. రాదా.. అనే సందేహాలుండేవి. అయితే అది క్షేమంగా తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం అది చేరుకోలేకపోయింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ జూన్ 5న టేకాఫ్ అయింది. స్టార్ లైనర్ 8 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇది టేకాఫ్ అయినప్పటి నుంచి సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో అనుకున్నట్టు ముందుకు సాగలేదు. అందుకే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను అంతరిక్ష కేంద్రంలోనే విడిచిపెట్టి ఆటోపైలెట్ మోడ్ లో సెప్టెంబర్ 7న భూమికి తిరిగి వచ్చేసింది స్టార్ లైనర్. న్యూ మెక్సికో లోని వైట్ శాండ్స్ హార్బర్ లో ఇది ల్యాండ్ అయింది.

అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మర్ లను రెస్క్కూ చేసేందుకు నాసా ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టింది. మిషన్ క్రూ-9 కి నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్-9 స్పేస్ షిప్ నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 26నే ఈ స్పేస్ షిప్ బయలుదేరాల్సి ఉంది. అయితే కెనెవెరల్ లో తుపాను కారణంగా సెప్టెంబర్ 28కి మార్చారు. చివరకు భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటల 47నిమిషాలకు ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 30వ తేదీ తెల్లవారుజామున ఇది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ చేరుకుంది.

స్పేస్ ఎక్స్ రాకెట్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది సరే… మరి సునీతా విలియమ్స్, విల్మోర్ లు ఎప్పుడు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది..? స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సెప్టెంబర్ 28న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. వాస్తవానికి ఇందులో నలుగురు అంతరిక్ష వ్యోమగాములు వెళ్లే వీలుంది. కానీ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను భూమికి తీసుకొచ్చేందుకు ఇద్దరితో మాత్రమే ఇది అంతరిక్షానికి వెళ్లింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ ఫాల్కన్-9 రాకెట్లో నిక్ హాగ్వే, అలెగ్జాండర్ గార్బునోవ్ ISSకు వెళ్లారు. నిక్ హాగ్వే నాసా ఆస్ట్రొనాట్ కాగా అలెగ్జాండర్ గార్బునోవ్ రష్యన్ కాస్మొనాట్. వీళ్లిద్దరూ 30న అంతరిక్ష కేంద్రానికి క్షేమంగా చేరుకున్నారు. వీళ్లకు సునీతా విలియమ్స్, విల్మోర్ స్వాగతం పలికారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ని తీసుకుని ఫాల్కన్ 9 స్పేస్ షిప్ భూమికి తిరిగి రానుంది. 8 రోజుల ప్రయాణం కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 నెలలపాటు అక్కడే గడపాల్సి వస్తోంది. 2025 ఫిబ్రవరిలో వాళ్లిద్దరూ భూమికి తిరిగి వచ్చేందుకు సర్వం సిద్ధమైంది.

Show comments