Site icon NTV Telugu

Smoking: 20ఏళ్లలోపే స్మోక్ చేశారా? షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన పరిశోధన!

Smoking Before 20

Smoking Before 20

రాహుల్‌ వయసు 45.. పెద్దగా స్మోక్‌ చేసేవాడు కాదు. రోజుకు రెండు సిగరెట్లు మాత్రమే ఊదేవాడు. అయితే ఒక రోజు అకస్మాత్తుగా మాట రావడం ఆగిపోయింది. కుడి వైపు శరీరం కదలలేదు. దీన్నే స్ట్రోక్ అంటారని డాక్టర్లు చెప్పారు. మెడికల్‌ పరీక్ష చేసిన తర్వాత వాళ్లు అడిగిన ప్రశ్న ఒక్కటే. ‘స్మోక్ ఎప్పుడు మొదలుపెట్టారు?’ 17 ఏళ్ల వయసులో అంటూ రాహుల్ ఆన్సర్ చెప్పాడు.

ఇలాంటి కేసులు ఒక్కటి కాదు. వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఈ అనుభవాలను సంఖ్యలుగా మార్చిన ఒక పెద్ద అధ్యయనం బయటకు వచ్చింది. దక్షిణ కొరియాలో దాదాపు 90లక్షల మంది ఆరోగ్య డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 ఏళ్లకు ముందే పొగతాగడం మొదలుపెట్టినవాళ్లకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. 20ఏళ్ల తర్వాత పూర్తిగా స్మోక్ మానేసినా రిస్క్ మాత్రం అలానే ఉంటుందట.

ఈ అధ్యయనం దక్షిణ కొరియాలో జరిగింది. అక్కడ ప్రభుత్వం ప్రతి పౌరుడికి రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేస్తుంది. అదే డేటాను ఉపయోగించి శాస్త్రవేత్తలు దాదాపు 90లక్షల మందిని తొమ్మిదేళ్ల పాటు ఫాలో అయ్యారు.

ఎవరికెప్పుడు స్ట్రోక్ వచ్చింది, ఎవరికెప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, ఎవరు అకాల మరణానికి గురయ్యారన్నదాన్ని లెక్కబెట్టారు. 20 ఏళ్లకు ముందే పొగతాగడం మొదలుపెట్టినవాళ్లకు, నాన్ స్మోకర్లతో పోలిస్తే స్ట్రోక్ వచ్చే ప్రమాదం దాదాపు 70 నుంచి 80 శాతం ఎక్కువగా ఉంది. నిజానికి 20 ఏళ్ల లోపు మన శరీరం పూర్తిగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మెదడు, రక్తనాళాలు, గుండె వ్యవస్థ అప్పటికీ సెన్సిటివ్‌గా ఉంటాయి. అలాంటి సమయంలో సిగరెట్ పొగలో ఉన్న విషపదార్థాలు రక్తనాళాలపై శాశ్వత ప్రభావం చూపిస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే 30 ఏళ్లకే స్మోక్ మానేసినా, 40 ఏళ్లకే ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా, లోపల నాళాల్లో జరిగిన డ్యామేజ్ మాత్రం మాయం కాదు. అది సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా స్ట్రోక్‌గా బయటపడుతోంది.

ఇది కొరియాకే పరిమితమైన విషయం కాదు. భారత్‌లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం, భారత్‌లో స్మోకింగ్ మొదలుపెట్టే వయసు క్రమంగా తగ్గుతోంది. చాలా రాష్ట్రాల్లో 15 నుంచి 18 ఏళ్ల మధ్యే పొగతాగే అలవాటు మొదలవుతోంది.

ఇదే సమయంలో ఇండియాలో స్ట్రోక్ కేసులు యంగ్ అడల్ట్స్‌లో పెరుగుతున్నాయన్నది న్యూరాలజిస్టులు చెబుతున్న నిజం. ఇక స్కూల్ చదువుతున్న పిల్లలపై చేసిన సర్వేలు చూస్తే, 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులోనే టొబాకోను మొదటిసారి ప్రయత్నిస్తున్న పిల్లలు వేల సంఖ్యలో ఉన్నారు. కొన్ని కేసుల్లో 10 ఏళ్లకే ఈ అలవాటు మొదలైనట్టు కూడా రికార్డులు ఉన్నాయి. అంటే మెదడు, గుండె, రక్తనాళాలు ఇంకా పూర్తిగా ఎదగకముందే వాటిపై విషం పడుతోందన్న మాట. ఇదే విషయాన్ని ఇప్పుడు సైన్స్ సంఖ్యలతో నిరూపిస్తోంది. ఇటు ఇండియాలో ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్‌లు పెద్ద మరణ కారణాలుగా మారాయి.

టొబాకో వాడకం కారణంగా ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ డేటానే చెబుతోంది. ఇందులో చాలామందికి పొగతాగడం చాలా చిన్న వయసులో మొదలైందన్నది గమనించాల్సిన విషయం. అంటే ఈ ప్రమాదం భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో.. బీ కేర్‌ఫుల్‌.. తాత్కాలిక ఆనందాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోకండి!

ALSO READ: జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, డయేరియా.. ఇండియాలో మరో వైరస్‌ టెన్షన్..!

Exit mobile version