Site icon NTV Telugu

Shekar Kammula : శేఖర్ కమ్ముల మూవీలు.. సోషల్ మెసేజ్ లు..!

Shekar Kammula

Shekar Kammula

Shekar Kammula : డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీలకు స్పెషల్ బ్రాండ్ ఉంది. సోషల్ మెసేజ్ లేకుండా అసలు సినిమానే తీయరు. హీరోను బట్టి కథలో మార్పులు చేయరు. మాస్ డైలాగులు ఉండవు. కత్తి పట్టి నరకడాలు అసలే ఉండవు. హీరో వంద మందిని కొట్టి చంపేయడాలు ఊహకు కూడా కనిపించవు. శేఖర్ సినిమాలు అంటే కథే కీలకం. సన్నివేశాలే హీరోలు. అదే ఆయన స్పెషాలిటీ. తన కథకు తగ్గ హీరోలను ఆయన వెతుక్కుంటారు. అంతే గానీ హీరోలను బట్టి కథలు రాసుకోరు. మొన్న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి కూడా ఇదే చెప్పాడు. శేఖర్ కమ్ముల ఎవరికోసమే తన సిద్ధాంతాలను అస్సలు మార్చుకోరు అని.

ఇప్పటి వరకు శేఖర్ చేసిన సినిమాలను చూస్తేనే ఇది అర్థం అవుతోంది. పైగా ఆయన సినిమాల్లో కామన్ గా ఉండేది సోషల్ మెసేజ్. లీడర్ సినిమాలో నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించాడు. ఇప్పటి రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయి.. ఎంత అవినీతి జరుగుతోంది.. న్యాయం ఎవరికి జరుగుతోంది అన్నది కళ్లకు కట్టినట్టు చూపించారు శేఖర్ కమ్ముల. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాను చూస్తే.. వయసుకు ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల ఆశయాలను పక్కన పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. చివరకు లైఫ్ లో సెటిల్ అయితే కుబుంబం ఎంత హ్యాపీగా ఉంటుంది.. నిజమైన ప్రేమ, అట్రాక్షన్ కు తేడా చూపించారు.

read also : Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్?

ఫిదా సినిమాలో ఒక ఆడపిల్ల తన పుట్టింటితో ఎంతటి అనుబంధాన్ని పెనవేసుకుంటుంది.. ఆ ఇంటిని, తన కుటుంబాన్ని వదిలేయడానికి ఎంత కష్టపడుతుంది అనేది మనసును హత్తుకునేలా చూపించాడు శేఖర్. పల్లె సంస్కృతి, పట్టింపులే కాకుండా.. అమెరికా అబ్బాయి వ్యవహార తీరుతెన్నులు చూపించారు. భర్త కోసం అన్నీ వదిలేసుకుని వచ్చే అమ్మాయి కోసం.. అబ్బాయి ఏం చేస్తే ఆమె సంతోషంగా ఉంటుందనేది ఇందులో చూపించి అందరినీ మెప్పించాడు. ఒక అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేస్తే ఎలాంటి త్యాగం చేస్తాడో శేఖర్ వివరించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. నిజమైన ప్రేమ, ఆడపిల్ల జీవితంపై అందరికీ పాఠాలు చెప్పాడు.

లవ్ స్టోరీ సినిమాలో ప్రేమ, కులం అనే పాయింట్ తో పాటు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎదుర్కుంటున్న లైంగిక వేధింపులను వేలెత్తి ప్రశ్నించాడు. ఈ రోజుల్లో ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. కులం అనేది ఈ రోజుల్లో కూడా మనుషులను ఎంతకు దిగజార్చుతుందో వివరించాడు. అమ్మాయిలు మౌనంగా భరిస్తున్న లైంగిక వేధింపులపై గొంతెత్తాలి అని ఈ మూవీతో మెసేజ్ ఇచ్చాడు. కులం కన్నా అమ్మాయికి లైంగిక వేధింపులే అతిపెద్ద సమస్య అని చెప్పాడు.

తాజాగా తీసిన కుబేర సినిమాలో డబ్బు మనుషులను ఎలా ఆడిస్తుందో చెప్పకనే చెప్పేశాడు. నిజంగా డబ్బు ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడా.. డబ్బు లేని వ్యక్తి బాధపడుతూ బతుకుతాడా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. సంతోషంగా జీవిస్తున్న సగటు మనిషి జీవితంలోకి డబ్బు అనేది వస్తే అతని ఆలోచనలు ఎలా మారిపోతాయి.. ఎంతటి స్థాయికి దిగజార్చుతుంది అనేది శేఖర్ కన్నా గొప్పగా ఎవరూ చూపించలేరేమో. బలమైన భావోద్వేగాలను డబ్బు ఎలా కంట్రోల్ చేస్తుందో చూపించి.. మనిషి జీవితం ఈ రోజుల్లో డబ్బు అనే వ్యసనం నుంచి బయటకు వస్తేనే బెటర్ అని మెసేజ్ ఇచ్చాడు. ఇలా ఎప్పటికప్పుడు మూవీలతో మెసేజ్ లు ఇవ్వాలంటే అది శేఖర్ కమ్ములకే సాధ్యం కాబోలు.

read also : Kubera : కుడి ఎడమైందే..!

Exit mobile version