NTV Telugu Site icon

Cities disasters : ఈ నగరాలకు ఏమైంది..?

Ee Nagaralaku Emaindo

Ee Nagaralaku Emaindo

NTV Special Story on Cities disasters : చెన్నైలో భారీ వర్షం- ఫ్లై ఓవర్లపైకి వచ్చేసిన కార్లు.. హైదరాబాద్ లో కుండపోత- కిలోమీటర్లకొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్.. ఢిల్లీలో వాయు కాలుష్యం- వాహనాలపై నియంత్రణ.. ముంబైలో వరదలు- స్తంభించిన జనజీవనం… ఇలా నిత్యం ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. చిన్నపాటి వర్షాలకే మన మహానగరాలు అతలాకుతలమైపోతున్నాయి.. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది..? లోపం ఎక్కడుంది..? అసలు ఈ మహా నగరాలకు ఏమైంది..?

మెట్రో సిటీలను విశ్వనగరాలుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాయి మన ప్రభుత్వాలు. కానీ ఇవి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారవుతున్నాయి. చిన్నపాటి వరదలు, ఓ మోస్తరు ఎండలకే తట్టుకోలేకపోతున్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు.. ఇలా మహా నగరాల పేర్లు వినగానే మనకు కలల ప్రపంచం కదలాడుతుంటుంది. ఇలాంటి నగరాల్లో ఉండాలనే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నగరవాసులు మాత్రం ఒక్కోసారి ఈ నరకం నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్టు ఆలోచిస్తుంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. చిన్న వాన పడితే చాలు రోడ్లన్నీ జలమయం అయిపోతాయి. మ్యాన్ హోల్స్ నోరు తెరుచుకుంటాయి. ట్రాఫిక్ కిలోమీటర్లకొద్దీ ఆగిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోతుంది. కొన్ని నగరాల్లో పడవలను వాడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ట్రాక్టర్లు, జేసీబీలు ఉపయోగించాల్సిన పరిస్థితి. సంపన్నులుండే విలాసవంతమైన భవనాలు కూడా రోజుల తరబడీ నీళ్లల్లో చిక్కుకుంటున్నాయి.

మహానగరాల్లో విపత్తులు ఇటీవల సర్వసాధారణమైపోతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితి కామనే అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రకృతి ఇలాంటి వాటి ద్వారా హెచ్చరికలు జారీచేస్తోందనే అంశాన్ని మర్చిపోతున్నాం. మహా నగరాలనగానే మనకు గుర్తొచ్చేవి ఆకాశాన్నంటే భవనాలు.. కాంక్రీట్ రోడ్లు..! లేక్ వ్యూ రిసార్టులు, అపార్ట్ మెంట్ల పేరుతో చెరువులను ఆక్రమించి కట్టేసిన భవనాలు అత్యంత సుందరంగా కనిపిస్తాయి.. ఇక చెట్ల పెంపకం సంగతి అటుంచితే వాటిని కొట్టేసి ఇళ్లు కట్టేస్తున్నారు. జంతువులకు నిలువ నీడలేకుండా చేస్తున్నారు. దీంతో క్రూర జంతువులు సైతం మానవ నివాసాల్లోకి చొరబడుతున్నాయి. పద్దతీపాడూ లేకుండా కట్టేసిన భవనాలు, రోడ్ల వల్ల డ్రైనేజీకి మార్గం లేకుండా పోతోంది. అందుకే చిన్నపాటి వర్షానికి సైతం తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మెట్రో సిటీలన్నింటి పరిస్థితి దాదాపు ఇదే. గంటల వ్యవధిలోనే కుండపోత వర్షాలు, భరించలేని ఎండలు.. ఇటీవలికాలంలో సర్వసాధారణం అయిపోయాయి. ఇవన్నీ భవిష్యత్ ప్రమాదాలకు సూచికలు.

మహా నగరాలు విపత్తుల బారిన పడటానికి అనేక కారణాలున్నాయి. నగరీకరణపై మోజు, మౌలిక వసతుల లేమి, ప్రకృతిపై పగ పర్యావరణంలో మార్పులకు కారణమవుతున్నాయి. అందుకే విపత్తులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా నివసించేవాళ్లు. కానీ ఇప్పుడు గ్రామాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు లేకుండా పోతున్నాయి. అందుకే జనం పట్టణాలు, నగరాలకు పరుగులు పెడుతున్నారు. నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. భవనాలు, రోడ్లు విస్తరిస్తున్నాయి. సహజ వనరులు, చెరువులు, కుంటలు, పార్కులు లాంటివి తగ్గిపోతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వరదలను తట్టుకోవడం నగరాలకు సాధ్యం కావట్లేదు. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఇప్పటికీ దశాబ్దాల నాటి డ్రైనేజీ వ్యవస్థే అమలవుతోంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపడట్లేదు.

పర్యావరణంలో మార్పులు, గ్లోబలైజేషన్ వల్ల మహా నగరాలు వణికిపోతున్నాయి. ఇవి నగరవాసుల జీవనవిధానంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గ్లోబలైజేషన్ వల్ల నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సహజ వనరులు తగ్గిపోతున్నాయి. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. తుపానులు, వరదలు, భయంకరమైన ఎండలు నమోదవుతున్నాయి. గ్లోబలైజేషన్ వల్ల పరిశ్రమలు పెరిగిపోతున్నాయి. కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్నాయి. నగరాలన్నీ పొగమంచుతో కప్పబడిపోతున్నాయి. ఢిల్లీలో పొగమంచు వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయో మనం ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం. వాతావరణంలో మార్పులు నగరవాసుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. శ్వాసకోస, చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. వానాకాలంలో అంటురోగాలు వ్యాపిస్తున్నాయి. జనాభాకు అవసరమైన మంచినీరు, ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.

విపత్తుల నుంచి నగరాలు బయటపడాలంటే తక్షణమే అనేక మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మౌలిక వసతులను మెరుగుపరచడం, నగరీకరణను నియంత్రించడం లాంటివి ఇందులో ప్రధానమైనవి. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచకపోతే విపత్తుల నుంచి ఎప్పుడూ బయటపడలేం. పురాతన డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాలి. వర్షపు నీరు నిల్వ ఉండకుండా పారడానికి అవసరమైన అత్యాధునిక నీటి నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. లోతైన ప్రాంతాల్లో రోడ్లు, భవనాలను ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలి. విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివాటి సాయంతో విపత్తులను ముందే అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలి. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలి. నగరాల్లో పార్కులను, అడవులను కాపాడుకోవాలి. తద్వారా వేడి నుంచి బయటపడొచ్చు. సహజ వాతావరణానికి అనుకూలమైన మార్గాలు అన్వేషించాలి. జలమార్గాలను పునరుద్ధరించి నీటిపారుదలకు ఆటంకాలు తొలగించాలి. నగరాభివృద్ధి ఒక పద్ధతి ప్రకారం సాగాలి. భవనాలు, రోడ్లు మరియు మౌలిక వసతులు పటిష్టంగా ఉండాలి. భవన నిర్మాణాలు భూకంపాలు, వరదలు, తుఫానులు వంటి విపత్తులను తట్టుకోగలగాలి. అన్నిటికీ మించి పర్యావరణంపై ప్రజలకు అవగాహన ఉండాలి. ప్రకృతిని నాశనం చేసుకుంటూ పోతే కలిగే విపరణామాలపై చర్చించాలి.

మహా నగరాలు విపత్తుల నుంచి బయటపడాలంటే ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి జరగాలి. మౌలిక వసతులు మెరుగుపడాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రజల అవగాహనకు కల్పించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అన్నింటికీ మించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అప్పుడే నగరాలు విపత్తుల నుంచి బయటపడగలవు.