NTV Special Story Israel’s Unit 8200 in Lebanon Explosions: మూడు రోజులుగా పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. లెబనాన్ లోని హెజ్బొల్లా తీవ్రవాదుల పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసిందనే అనుమానాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. తాజాగా హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ నేరుగా విరుచుకుపడుతోంది. ఆ సంస్థ స్థావరాలపై రాకెట్లతో దాడులు చేస్తోంది. దీంతో ఇది యుద్ధమేనంటోంది లెబనాన్. అసలు హెజ్బొల్లా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ ఎలా పసిగట్టింది.. వాటిని ఎలా పేల్చేసింది..?
పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అట్టుడికిన నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. గాజాకు పరిమితమైన యుద్ధం లెబనాన్‌కూ విస్తరించిందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ హమాస్‌పై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్, ఇప్పుడు హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా గురువారం టీవీలో మాట్లాడారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయెల్ హద్దు మీరిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. అంతకుముందు హెజ్‌బొల్లా డ్రోన్ దాడులు చేసింది. ఇందులో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు లెబనాన్‌లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య 37కు పెరిగింది. దాదాపు 3 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. ఇందులో దాదాపు 300 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలతో దాదాపు ఏడాది నుంచి పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం లెబనాన్‌కూ విస్తరించిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ – IDF వైమానిక దాడులు చేపట్టింది. మరోవైపు అమెరికా కూడా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్బొల్లా హెచ్చరించడంతో ప్రతి దాడులకు అమెరికా కూడా సమాయత్తమవుతోంది.
పేజర్లు, వాకీటాకీలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండడంతో వాటిపై నిషేధం విధించింది లెబనాన్. పలు విమానయాన సంస్థలు కూడా వీటిని బ్యాన్ చేశాయి. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అప్రమత్తమైంది. తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది. ఖతర్ ఎయిర్‌లైన్స్ కూడా బీరుట్ నుంచి రాకపోకలు సాగించే తమ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.
అసలు పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ ఎలా టార్గెట్ చేసింది.. వాటిని ఎలా పేల్చేసింది అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ దీనిపై కొంతకాలంగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలు తమ ఉనికిని కనిపెట్టేస్తాయనే భయంతో హెజ్బొల్లా చాలాకాలంగా మొబైల్ ఫోన్లను వాడడం పక్కన పెట్టేసింది. వాటి స్థానంలో పేజర్లను వినియోగించడం మొదలు పెట్టింది. అయితే వీటి వల్ల కూడా ముప్పు ఉందని ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి విషయాలను పసిగట్టడంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఎప్పుడూ ముందుంటుంది. దీనికి ఇజ్రాయెల్ రహస్య యూనిట్ 8200 కూడా తోడైంది.
పేజర్ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ ఎంత పకడ్బందీ వ్యూహముందో ఇప్పుడు అర్థమవుతోంది. మొబైల్ ఫోన్ల నుంచి పేజర్లకు హెజ్బొల్లా మారుతోందని పసిగట్టిన ఇజ్రాయెల్ అందుకు అనుగుణంగా స్కెచ్ వేసింది. హెజ్బొల్లా స్కెచ్ గమనించిన మొస్సాద్.. హంగరీలోని బుడాపెస్ట్ కేంద్రంగా 2022లోనే బీఏసీ కన్సల్టింగ్ సంస్థను ఏర్పాటు చేసింది. మరో రెండు షెల్ కంపెనీలనూ రంగంలోకి దింపింది. తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో బ్రాండ్‌ను వినియోగించుకొని పేజర్ల విక్రయానికి ఒప్పందం చేసుకుంది. సాధారణ వినియోగదార్లకు మామూలు పేజర్లనే విక్రయించింది. పేలుడు పదార్థాలున్న కొన్ని పేజర్లను 2022లో హెజ్‌బొల్లాకు విక్రయించింది. అక్కడి నుంచి వేగం పెంచింది. హెజ్బొల్లా మొబైళ్లను వదిలేసి పూర్తిస్థాయిలో పేజర్లకు మారడంతో.. ఇజ్రాయెల్ షెల్ కంపెనీ BAC ఒక్కసారిగా పేజర్ల ఉత్పత్తిని పెంచేసింది. బ్యాటరీల వద్ద PETN అనే పేలుడు పదార్థాన్ని ఉంచి తయారు చేసింది. యుద్ధ సంకేతాలు తలెత్తడంతో లెబనాన్ లోకి భారీ ఎత్తున పేజర్లు ప్రవేశించాయి. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్.. హెజ్బొల్లా కదలికలను గమనించి పేజర్లు, వాకీటాకీలను పేల్చేసింది.
పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసింది. అదే యూనిట్ 8200. ఇజ్రాయెల్ రహస్య యూనిట్ 8200ను ‘యహిద షమోనే మతాయిమ్’ అని కూడా పిలుస్తారు. ఈ యూనిట్‌లో ఎవరికి పడితే వారికి అవకాశం రాదు. యువ ప్రతిభావంతులకు.. సృజనాత్మకంగా ఆలోచించి, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుంది. వీరికి హ్యాకింగ్, ఎన్‌క్రిప్షన్, నిఘా వంటి సంక్లిష్టమైన శిక్షణలు ఇస్తారు. ఈ యూనిట్ కార్యకలాపాలు దేశం బయట కూడా జరుగుతాయి. ఇరాన్ అణుకేంద్రాన్ని చిందరవందర చేసింది ఈ బృందమే. ఇప్పుడు పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనక కూడా ఈ యూనిట్ కీలక పాత్ర పోషించింది.
ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సంస్థలు ఎలాంటి ఎత్తులు వేస్తున్నాయో పసిగట్టడంలో ఇజ్రాయెల్ ముందుంటుంది. ఆ దేశ నిఘా సంస్థ మొస్సాద్ ఇలాంటి ఆపరేషన్లు చేయడంలో దిట్ట. ఇప్పుడు మరోసారి ఇజ్రాయెల్ ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. తమ దేశం జోలికి వస్తే ఎందాకైనా వెళ్లడం ఇజ్రాయెల్ నైజం. ఇప్పుడు ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో వేచి చూడాలి.