Site icon NTV Telugu

Health News: జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, డయేరియా.. ఇండియాలో మరో వైరస్‌ టెన్షన్..!

Nipah Virus

Nipah Virus

ఒక చిన్న జ్వరం… ఒక సాధారణ దగ్గు.. కానీ ఆ లక్షణాల వెనుక దాక్కున్న ముప్పు ప్రాణాంతకం. దేశంలో మళ్లీ నిపా వైరస్ కలకలం మొదలైంది.

పశ్చిమ బెంగాల్‌లో మొదట ఇద్దరు నర్సులకు నిపా వైరస్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తమైంది. వెంటనే డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌, కుటుంబ సభ్యులు కలిపి దాదాపు వంద మందిని క్వారంటైన్‌కి పంపించారు. ఐసీయూ బెడ్లపై ప్రాణాల కోసం పోరాడుతున్న రోగులు, ఆస్పత్రుల్లో భయం, బయట అనిశ్చితి. ఇది కొత్త వైరస్ కాదు. కానీ ప్రతి సారి వచ్చినప్పుడు ఇదే స్థాయి భయాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే నిపా వైరస్ అంటే సాధారణ ఇన్ఫెక్షన్ కాదు. మెదడుపై దాడి చేసే ఎన్‌సెఫలైటిస్‌.. శ్వాసకోశాన్ని కూల్చే ఇన్ఫెక్షన్.. మరణశాతం చాలా ఎక్కువ. గతంలో కేరళ, బెంగాల్, బంగ్లాదేశ్‌లో ఈ వైరస్ ఎలా ప్రాణాలు తీసిందో మనం చూశాం. ఇప్పుడు మళ్లీ అదే భయాలు మొదలయ్యాయి.

ఇంతకీ ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతి ఏడాది భారత్ ఎందుకు దీని ముప్పును ఎదుర్కొంటోంది? ఇది ఎంత ప్రమాదకరం? దీన్ని ఆపడానికి ప్రభుత్వం, వైద్య వ్యవస్థ ఏం చేస్తోంది?

పశ్చిమ బెంగాల్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన కేసులు ఆందోళనను రేపాయి. బరాసత్ సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు నర్సులకు మొదట నిపా వైరస్ నిర్ధారణ అయిది. తర్వాత ఒక డాక్టర్‌, మరో నర్స్‌, హెల్త్ స్టాఫ్‌కు కూడా ఇన్ఫెక్షన్ సోకినట్టు తేలింది. వీరిని వెంటనే బెలేఘాటా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్‌కు తరలించారు.

ఇద్దరు నర్సుల్లో ఒకరి పరిస్థితి మెరుగుపడుతున్నా మరో నర్స్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. నిజానికి నిపా వైరస్ కొత్తగా పుట్టిందేమీ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్. ప్రధానంగా ఫ్రూట్ బ్యాట్స్‌ ఈ వైరస్‌కు సహజ వాహకులు. బ్యాట్స్ తినే పండ్లపై లేదా వాటి లాలాజలం, మూత్రం ద్వారా వైరస్ చేరుతుంది. ఆ పండ్లను శుభ్రంగా కడగకుండా తినడం, పచ్చి ఖర్జూర రసం లాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మనుషులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల సమీపంలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం నిపా వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కొంతమందిలో లక్షణాలు లేకుండానే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మరికొంతమందిలో జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, డయేరియా కనిపిస్తాయి. తీవ్రమైన కేసుల్లో మెదడు వాపు వచ్చి స్పృహ కోల్పోవడం, కోమా, మరణం కూడా సంభవించొచ్చు. ముఖ్యంగా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్‌మిషన్ జరిగితే ప్రమాదం మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, సంరక్షకులు, వైద్య సిబ్బంది ఎక్కువ రిస్క్‌లో ఉంటారు.

నిపా వైరస్ చరిత్రను చూస్తే మలేషియాలో 1998-99లో మొదటి పెద్ద అవుట్‌బ్రేక్ జరిగింది. అక్కడ పందుల ద్వారా వైరస్ మనుషులకు వ్యాపించింది. తర్వాత బంగ్లాదేశ్‌, భారత్‌లో జరిగిన అవుట్‌బ్రేక్‌లలో ఫ్రూట్ బ్యాట్స్ ప్రధాన వనరుగా గుర్తించారు.

భారత్‌లో ముఖ్యంగా కేరళలో 2018 నుంచి తరచుగా నిపా కేసులు నమోదవుతున్నాయి. ప్రతి సారి వేగంగా కంటైన్ చేయడం వల్ల పెద్ద ఎత్తున వ్యాప్తి ఆగింది. కానీ పూర్తిగా అంతమయ్యే వైరస్ మాత్రం కాదు. తాజా కేసుల కారణంగా- పశ్చిమ బెంగాల్‌లో బ్యాట్స్‌పై సర్వే నిర్వహించారు. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో తొమ్మిది బ్యాట్స్‌ను పరీక్షించారు. RT-PCR పరీక్షల్లో అన్ని నమూనాలు నెగటివ్‌గా వచ్చాయి. అయితే ఒక బ్యాట్‌లో యాంటీబాడీలను గుర్తించారు. అంటే గతంలో వైరస్‌కు గురై ఉండొచ్చన్న సంకేతం మాత్రమే. ప్రస్తుతం యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. అయినా పూర్తి భద్రత వచ్చేవరకు పర్యవేక్షణ కొనసాగుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇక నిపా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడానికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స లేదు. అందుకే ప్రివెన్షన్‌ మాత్రమే ప్రధాన ఆయుధం. పండ్లను బాగా కడిగి తినడం, చెట్ల నుంచి పడిన పండ్లను తినకపోవడం, పచ్చి ఖర్జూర రసం తాగకపోవడం, జ్వరం లేదా శ్వాస సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు కీలకం. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ పాటించడం కూడా అత్యంత అవసరం. ఇటు ప్రతి ఏడాది నిపా వైరస్ మళ్లీ మళ్లీ కనిపించడం ఒక హెచ్చరిక. మనిషి-ప్రకృతి మధ్య పెరుగుతున్న ఘర్షణకు ఇది ప్రత్యక్ష ఫలితం.

అడవులు తగ్గిపోవడం, జంతువుల నివాసాలు నాశనం కావడం, మనుషుల జీవన విధానాలు మారడం వల్ల ఈ రకమైన వైరస్‌లు మనకు దగ్గరవుతున్నాయి. నిపా ఒక్కటే కాదు. ఇది రానున్న పెద్ద ఆరోగ్య ముప్పులకు సంకేతం.

ALSO READ: చరిత్ర నుంచి రక్తపాతాన్ని తుడిచివేసే ప్రయత్నం.. చైనా బరితెగింపు రాజకీయం!

Exit mobile version