వయసు పెరిగేకొద్దీ అయ్యో.. ముసలివాళ్లం అయిపోతున్నామే.. అనే ఆందోళన కలగడం సహజమే..! అందుకే తమ జీవితకాలాన్ని పెంచుకునేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ఆరోగ్యకరమైన తిండి తినేందుకు, వ్యాయామాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చనేది ఒక నమ్మకం. అయితే ఇప్పుడు వయసుకు బ్రేక్ చెప్పేందుకు సరికొత్త మార్గాలు మనముందు ఆవిష్కారం కాబోతున్నాయి.
అమృతం తాగితే మరణం ఉండదని మనం పురాణాల్లో విన్నాం. అయితే ఇప్పుడు మరణాన్ని ఆపలేకపోయినా వయసు పెరుగుదలను అడ్డుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. శాస్త్ర సాంకేతిక రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. అసాధ్యం అనుకున్నవాటిని సుసాధ్యం చేసి చూపెడుతోంది. అలాంటి వాటిలో ఒకటి ముసలితనానికి బ్రేక్ వేయడం. చాలా మంది తమకు మరణం ఉండకూడదని.. లేకుంటే ఎక్కువ కాలం జీవించాలని కోరుకోవడం సహజం. అయితే మనిషి ఆయుర్దాయం సరాసరిన 70 ఏళ్లుగా ఉంది. అయితే ఇది సరిపోవట్లేదు.. వందేళ్లకు పైగా జీవించాలని కోరుకుంటున్నారు. శాస్త్రవేత్తలు కూడా మనిషి జీవితకాలాన్ని పెంచే మార్గాలపై పరిశోధనలు చేస్తున్నారు. అందులో ఒకటి ఇటీవల సఫలమైనట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన పారిశ్రామిక వేత్త బ్రయాన్ జాన్సన్ తన వయసు తగ్గించుకునేందుకు ఏడాదికి 16 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అప్పటి నుంచి ఆయన ఏం వాడుతున్నారు.. ఆయన వయసును ఎలా తగ్గించుకుంటున్నారనే ఆసక్తి ఏర్పడింది. దీర్ఘాయుష్షు కోసం జరుగుతున్న పరిశోధనల్లో రాపామైసిన్ అనే మందు కీలక పాత్ర పోషిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్నే బ్రయాన్ జాన్సన్ వాడుతున్నారు. దీనికి జీవితాన్ని పొడిగించే శక్తి ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. అందుకే దీన్ని మ్యాజిక్ పిల్ అని పిలుస్తున్నారు. 2009లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ అనే సంస్థ.. ఇంటర్వెన్షన్స్ టెస్టింగ్ ప్రోగ్రామ్ ను ఎలుకలపై చేపట్టింది. వీటికి రాపామైసిన్ ఇవ్వడం ద్వారా వాటి జీవితకాలం 25శాతం పెరిగినట్లు గుర్తించింది. తర్వాత బ్రయాన్ జాన్సన్ వ్యక్తిగత వైద్యులు కూడా ఆయనకు రాపామైసిన్ ను అందించారు.
రాపామైసిన్ వయసును తగ్గిస్తోందనే వార్తలు రాగానే దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది. అసలు రాపామైసిన్ ఏంటి..? ఇటీవలికాలంలో అవయవమార్పిడి సర్వసాధారణం అయిపోయింది. ఇలా ఏదైనా ఒక వ్యక్తి అవయవాన్ని మరొక వ్యక్తికి అమర్చినప్పుడు.. అతని శరీరం ఆ అవయవాన్ని వేరొకరిదిగా భావించి దానిపై దాడి చేస్తుంది. అలా దాడి చేయకుండా రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే మందులను ఇమ్యునో సప్రెజెంట్స్ అంటారు. ఈ రాపామైసిన్ కూడా అలాంటిదే. యాంటీ క్యాన్సర్ చికిత్సల్లో కూడా దీన్ని వాడుతున్నారు. ఐస్‌లాండ్, చిలీ తదితర ప్రాంతాల్లోని ఒక బ్యాక్టీరియా నుండి రాపామైసిన్ ను తయారు చేశారు. మన శరీరంలో mTOR అనే ప్రొటీన్ కణాల పెరుగుదల, వ్యాప్తి, మనుగడను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాపామైసిన్ అనే మందు ఈ mTOR ప్రొటీన్ ని నిరోధిస్తుంది. తద్వారా కణాల పెరుగుదల నెమ్మదిస్తుంది. అందుకే దీన్ని యాంటీ ఏజింగ్ ఔషధంగా పిలుస్తున్నారు.
మరి రాపామైసిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? వృద్ధాప్యానికి మన శరీరంలోని టెలోమియర్లు కారణం. ఇవి కణాలకు సంబంధించిన జన్యుసమాచారాన్ని భద్రపరుచుకుంటూ ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ టెలోమియర్ల పొడవు తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా వృద్ధాప్యం సంభవిస్తుంది. ఈ టెలోమియర్ల పొడవు తగ్గకుండా ఆపగలిగితే వృద్ధాప్యాన్ని ఆపినట్లే. కొన్ని రకాల మందులు, ఇంజెక్షన్ల ద్వారా టెలోమియర్ల పొడవును తగ్గించవచ్చు. కానీ కణవిభజన జరిగి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వృద్ధాప్యాన్ని ఆపే ప్రయోగాలపై దృష్టి పెట్టారు.
టెలోమియర్ల పొడవును రాపామైసిన్ తగ్గిస్తోందా..? దానివల్లే వృద్ధాప్యానికి చెక్ పడుతోందా.. అనే దానిపై శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు. టెలోమియర్ల పొడవును అడ్డుకోగలిగితే వృద్ధాప్యానికి చెక్ పెట్టినట్టే అని తెలుసుకున్నాం. మరి రాపామైసిన్ వాడిన వాళ్లలో టెలోమియర్ల పొడవు ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఆరోగ్యవంతమైన ఎలుకలపై రాపామైసిన్ ప్రయోగించినప్పుడు వాటి జీవితకాలం పెరిగింది. అదే అనారోగ్యంతో ఉన్న, జన్యుసంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఎలుకలపై రాపామైసిన్ ప్రయోగించినప్పుడు టెలోమియర్ల పొడవును మరింత తగ్గించింది. దీన్నిబట్టి రాపామైసిన్ కు, టెలోమియర్లకు ఏదో సంబంధం ఉందని మాత్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిపై లోతైన పరిశోధనలు చేస్తున్నారు.
ఒక్క రాపామైసిన్ మాత్రమే కాదు.. వృద్ధాప్యానికి బ్రేక్ వేసేందుకు అనేక రకాల మందులు దోహదపుడుతున్నాయి. వాటిపైన అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒక్కోటి ఒక్కోరకమైన ప్రయోజనాన్ని కలిగిస్తోంది. వీటన్నిటినీ కలిపితే మరింత ప్రయోజనం ఉంటుందనే యాంగిల్లో కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే దీర్ఘాయుష్షు సాధ్యమే..!