Site icon NTV Telugu

Union Budget 2026: భార్యాభర్తలకు నిర్మలమ్మ గుడ్‌న్యూస్‌.. డబ్బును ఆదా చేసుకునే ఛాన్స్?

Joint Taxation India

Joint Taxation India

పెళ్లి.. అంటే రెండు జీవితాలు కలిసి నడవడం. కానీ పన్ను చెల్లించే విషయంలో మాత్రం ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఒంటరిగానే నిలబడాల్సిన పరిస్థితి. ఆదాయంపై ట్యాక్స్‌ను వ్యక్తిగతంగా లెక్కించే సిస్టమ్ మనది. దీనికారణంగా మధ్యతరగతి కుటుంబాలపై పన్ను భారం పెరుగుతోంది. అయితే ఈ పరిస్థితి మారే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఫిబ్రవరి 1 బడ్జెట్‌(Union Budget 2026)కి ముందు ప్రభుత్వం ఒక కొత్త విధానంపై చర్చిస్తోంది. భార్యాభర్తలు కలిసి ఒకే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేలా జాయింట్ ట్యాక్సేషన్ విధానం తీసుకురావాలనే అంశం పరిశీలనలో ఉంది. ఇంతకీ ఈ జాయింట్ ట్యాక్సేషన్ అంటే ఏంటి? ఇది నిజంగా ట్యాక్స్ భారాన్ని తగ్గిస్తుందా?
YouTube video player
ఇప్పుడున్న వ్యవస్థలో భార్యా భర్తలు ఇద్దరూ వేర్వేరుగా ట్యాక్స్ చెల్లించాలి. పెళ్లి అయినా సరే ఆదాయం లెక్కింపు వ్యక్తిగతంగానే జరుగుతుంది. ఇద్దరికీ విడివిడిగా స్లాబులు, మినహాయింపులు, డిడక్షన్లు వర్తిస్తాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే ఒకే ఆదాయం ఉన్న కుటుంబాల్లో ప్రాబ్లెమ్ ఉంటుంది.

భార్య లేదా భర్తలో ఒకరికి ఆదాయం లేకపోతే, ఆ వ్యక్తికి లభించే మినహాయింపులు పూర్తిగా వాడుకోలేకపోతున్నారు. దీని కారణంగా మొత్తం ఆదాయంపై ట్యాక్స్ భారం ఎక్కువగా పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు జాయింట్ ట్యాక్సేషన్ అనే ఆలోచన ముందుకు వస్తోంది. ఈ విధానంలో భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి ఒకే ట్యాక్స్ రిటర్న్‌గా ఫైల్ చేయొచ్చు. అంటే కుటుంబాన్ని ఒక ఆర్థిక యూనిట్‌గా చూసే విధానం. ఈ విధానం తప్పనిసరి కాదు. కావాలంటే ఇప్పటి పర్సనల్ ట్యాక్స్ సిస్టమ్‌లోనే ఉండొచ్చు. లేదంటే జాయింట్ ట్యాక్సేషన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్రతిపాదనకు చార్టెడ్ అకౌంటెంట్ల సంస్థ ICAI మద్దతు ఇచ్చింది. అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో ఇదే విధానం అమల్లో ఉంది. అక్కడ పెళ్లైన దంపతులు కలిసి ట్యాక్స్ ఫైల్ చేస్తారు. దీనివల్ల ముఖ్యంగా సింగిల్ ఇన్‌కమ్ కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తోంది.

జాయింట్ ట్యాక్సేషన్ అమల్లోకి వస్తే ట్యాక్స్ స్లాబులు కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక వ్యక్తికి ఉన్న బేసిక్ ఎగ్జెంప్షన్ పరిమితి ఉదాహరణకు మూడు లక్షలు అనుకుందాం. జాయింట్ ఫైలింగ్‌లో ఈ పరిమితిని రెండింతలు చేయొచ్చు. అంటే ఆరు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీని వల్ల మధ్యతరగతి కుటుంబాలపై పన్ను భారం భారీగా తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం సర్‌చార్జ్. ఇప్పటి విధానంలో 50లక్షల రూపాయల ఆదాయం దాటితే అదనపు సర్‌చార్జ్ పడుతుంది. జాయింట్ ట్యాక్సేషన్‌లో ఈ పరిమితిని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు 75లక్షల వరకు సర్‌చార్జ్ లేకుండా చేయవచ్చని అభిప్రాయం. ఇది కూడా ఎక్కువ ఆదాయమున్న కుటుంబాలకు కొంత ఉపశమనం ఇస్తుంది. అయితే జాయింట్ ట్యాక్సేషన్ వచ్చినా స్టాండర్డ్ డిడక్షన్ లాంటి ప్రయోజనాలు ఇద్దరికీ విడివిడిగా కొనసాగవచ్చు. అంటే డబుల్ ఇన్‌కమ్ కుటుంబాలకు కూడా నష్టం లేకుండా వ్యవస్థను రూపొందించాలనే ఆలోచన ఉంది.

అయితే అన్ని కుటుంబాలకు ఇది లాభమేనా అనే ప్రశ్న కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఇద్దరి ఆదాయాలు కలిస్తే పై స్లాబ్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే దీనిని ఆప్షనల్‌గా ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎవరికైతే లాభమో వాళ్లు ఎంచుకుంటారు. మిగతావాళ్లు ఇప్పటి విధానంలోనే ఉంటారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనపై స్పష్టత రావచ్చు. జాయింట్ ట్యాక్సేషన్ అమలైతే పెళ్లి తర్వాత ట్యాక్స్ విషయంలో కూడా కలిసి నడిచే అవకాశం దంపతులకు దక్కుతుంది. అయితే ఇది మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా ఊరటనిస్తుందా? లేదా కాగితాల వరకే పరిమితమవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం బడ్జెట్ రోజే తేలనుంది.

ALSO READ: జీతం ఆపేస్తే కంపెనీకి శిక్ష.. ఉద్యోగుల శాలరీని ఆలస్యం చేస్తున్న సంస్థలకు వార్నింగ్

Exit mobile version