Site icon NTV Telugu

Japan Tsunami : జులైలో భారీ సునామీ..!? జపాన్ బాబా వాంగా దివ్య దృష్టి నిజమవుతుందా..?

Japan Tsunamo

Japan Tsunamo

జపాన్‌లో ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ ర్యో టట్సుకీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆమె ఇటీవల ఒక సెన్సేషనల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది జులైలో జపాన్‌లో భారీ సునామీ వస్తుందని, అది 2011లో వచ్చిన సునామీ కంటే భయంకరంగా ఉంటుందని హెచ్చరించింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నిజంగా ఈ సునామీ వస్తుందా..? గతంలో ర్యో టట్సుకీ చెప్పినవి ఏమైనా నిజమయ్యాయా? ఇలాంటి భవిష్యవాణులను నమ్మొచ్చా?… లాంటివి ఇప్పుడు తెలుసుకుందాం.

భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందే హెచ్చరించడం కొందరికి అలవాటు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి మనకు తెలుసు. అలాగే నోస్ట్రడామస్, బాబా వాంగా గురించి కూడా విన్నాం. వీళ్లలాగే జపాన్ లో ర్యో టట్సుకీ చాలా ఫేమస్. ర్యో టట్సుకీ జపాన్‌లో చాలా ఫేమస్ మాంగా ఆర్టిస్ట్. మాంగా అంటే జపాన్‌లో కామిక్ బుక్స్ లాంటివి. ఆమె రాసే కథలు, గీసే పిక్చర్స్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆమె కథల్లో ఫాంటసీ, అడ్వెంచర్, మిస్టరీ దాగి ఉంటాయి. అందుకే యూత్‌కి ఆమె అంటే పిచ్చి. కానీ ఇప్పుడామె చెప్పిన ఓ భవిష్యవాణి వార్తల్లో నిలిచింది. జులైలో భారీ సునామీ రాబోతోందంటూ ఆమె చేసిన హెచ్చరిక జపాన్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది. కొందరు ఆమెను “జపాన్ బాబా వాంగా” అని కూడా పిలుస్తుంటారు.

అసలు ర్యో టట్సుకీ రాబోయే సునామీ గురించి ఏం చెప్పారు..? జనం ఎందుకింత భయపడిపోతున్నారు..? ఈ ఏడాది జులైలో జపాన్‌ని ఒక భారీ సునామీ తాకుతుందని ర్యో టట్సుకీ ప్రకటించింది. తనకు ఈ మేరకు కల వచ్చిందని తెలిపింది. దీన్నే దివ్య దృష్టిగా భావిస్తారు. 2011లో వచ్చిన సునామీ కంటే చాలా డేంజరస్‌ అని చెప్పింది. జపాన్ తీర ప్రాంతాలను పూర్తిగా నాశనం చేస్తుందని హెచ్చరించింది. అంతేకాదు.. ప్రపంచ చరిత్రలోనే రాబోయేది అతి భయంకరమైన సునామీ అని ర్యో టట్సుకీ చెప్పింది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 2011లో వచ్చిన సునామీ ధాటికి 16వేల మంది చనిపోయారు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైంది. మళ్లీ అలాంటి విపత్తు వస్తుందనే భయం అందరిలోనూ ఉంది.

గతంలో కూడా ర్యో టట్సుకీ ఇలాంటి హెచ్చరికలు కొన్ని చేశారు. వాటిలో కొన్ని నిజం కావడంతో అందరూ ఆమె భవిష్యవాణులను నమ్ముతున్నారు. అందుకే ఈ సునామీ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు. ర్యో టట్సుకీ గతంలో కూడా కొన్ని భవిష్యవాణులు చెప్పారు. 2011లో జపాన్ ను సునామీ అతలాకుతలం చేసింది. దీని గురించి ర్యో టట్సుకీ ముందే చెప్పిందని ఆమె అభిమానులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. కోవిడ్-19 మహమ్మారిని కూడా ఆమె ముందే అంచనా వేసినట్లు చెప్తున్నారు. “ప్రపంచాన్ని ఒక పెద్ద విపత్తు కమ్మేస్తుంది” అని ఆమె చెప్పినట్లు కొన్ని ఆధారాలను చూపిస్తున్నారు. కొన్ని దేశాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తుతాయని, వాటి వల్ల అల్లకల్లోలం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అశాంతి రేగడంతో ర్యో టట్సుకీ ఈ విషయం ముందే చెప్పిందని కొందరు ప్రమోట్ చేస్తున్నారు. ర్యో టట్సుకీ చేసిన ఈ హెచ్చరికలు చాలా జనరల్ గా ఉన్నాయి. దీంతో ఇవన్నీ మామూలే కదా.. ఇందులో వింతేముంది అని కొట్టిపారేసే వాళ్లు కూడా ఉన్నారు.

ర్యో టట్సుకీ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ కు ఒక పెద్ద సమస్య ఉంది. ఆమె చెప్పిన వేటికీ డాక్యుమెంటేషన్ ఉండదు. ఇవన్నీ బొమ్మలు, గీతల ద్వారానే ఉంటాయి. ర్యో టట్సుకీ మాంగా ఆర్టిస్ట్ అని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఆమె తన భవిష్యత్ అంచనాలను ఇలాంటి చిత్రాల ద్వారా వెల్లడిస్తూ ఉంటారని ఆమె అభిమానులు చెప్తూ ఉంటారు. వాటినే సోషల్ మీడియాలో పోస్టులు, న్యూస్ ఆర్టికల్స్ ద్వారా సర్క్యులేట్ చేస్తంటారు. వాటిలో ఏవైనా జరిగింతే.. ఇది ఆమె చెప్పిందే అని జనం కనెక్ట్ చేసేస్తుంటారు. వాస్తవానికి జపాన్‌లో భూకంపాలు, సునామీలు చాలా తరచూ వస్తుంటాయి. పెద్ద విపత్తు వస్తుందని ఆమె చెప్పింది. నిజంగా రేపు జులైలో ఇలాంటి విపత్తు ఏదైనా సంభవిస్తే ఆమె ముందే చెప్పింది.. అని జనం నమ్మేస్తుంటారు.

అయితే ర్యో టట్సుకీ హెచ్చరికలను జనం అంత ఈజీగా కొట్టిపారేయట్లేదు. నిజంగానే జపాన్ తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. జపాన్ భూకంపాలకు, సునామీలకు హాట్‌స్పాట్. 2004లో ఇండోనేషియాలో వచ్చిన సునామీ, 2011లో జపాన్ లో వచ్చిన సునామీ లాంటివివాటిని జనం ఇంకా మర్చిపోలేదు. 2011 సునామీ ధాటికి లక్షల కోట్ల నష్టం జరిగింది. జపాన్‌లో షింటో, బౌద్ధమతం లాంటి ఆధ్యాత్మిక నమ్మకాలు చాలా ఎక్కువ. కలలు, దివ్యదృష్టి లాంటివాటిని కొందరు సీరియస్‌గా తీసుకుంటారు. అందుకే ర్యో టట్సుకీ కలలో చూసిన హెచ్చరికను కొందరు బలంగా నమ్ముతున్నారు. ర్యో టట్సుకీ ఇప్పటికే ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ కాబట్టి, ఆమె మాటకు వెయిట్ ఎక్కువ. వాటికి తోడు ఈ మధ్యకాలంలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కోవిడ్-19, వాతావరణ మార్పులు, రాజకీయ సంక్షోభాలు లాంటివి ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి.. ఇలాంటి టైంలో జనం సహజంగానే ఇలాంటి భవిష్యవాణులను ఎక్కువగా నమ్ముతుంటారు.

ర్యో టట్సుకీని కొందరు “జపాన్ బాబా వాంగా” అని పిలుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాబా వాంగా చెప్పినవి నిజం కాలేదేమో కానీ ర్యో టట్సుకీ చెప్పినవి మాత్రం నిజమయ్యాయని జపాన్ వాసులు నమ్ముతున్నారు. బాబా వాంగా ఎవరో మనకు తెలుసు. ఆమె బల్గేరియాకు చెందిన ఫేమస్ భవిష్యవక్త. 9/11 దాడులు, ఐసిస్ ఉగ్రవాదం, వాతావరణ మార్పులు లాంటివాటిని ఆమె ముందే చెప్పిందని జనం నమ్ముతారు. ఆమె కూడా తన కలల ద్వారా భవిష్యత్తును చూస్తానని చెప్పుకుంటుంది. ర్యో టట్సుకీ కూడా అంతే. అయితే బాబా వాంగా భవిష్యవాణులు చాలా అస్పష్టంగా ఉండేవి. ఉదాహరణకు, 9/11 గురించి ఆమె Attack of the steel birds అని చెప్పారు. అంటే ఉక్కు పక్షుల దాడి అని అర్థం. ఇక్కడ ఉక్కు పక్షులు అంటే విమానాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో ఫేమస్ భవిష్యవక్త నోస్ట్రాడామస్ గురించి మనం విన్నాం. ఈయన ఫ్రాన్స్ కు చెందిన వ్యక్తి. 16వ శతాబ్దంలోనే ఆయన ఫ్రెంచ్ విప్లవం, రెండో ప్రపంచ యుద్ధం లాంటి వాటి గురించి చెప్పాడని అంటారు. కానీ అతని రాతలు కూడా చాలా అస్పష్టంగా ఉండేవి. కానీ ర్యో టట్సుకీ అలా కాదు. బాబా వాంగా, నోస్ట్రాడామస్ లాగా కాకుండా, ర్యో టట్సుకీ అంచనాలు కాస్త నిర్దిష్టంగా ఉంటాయి. ఆమె జులై 2025 అని స్పెసిఫిక్‌గా చెప్పింది.

ప్రపంచంలో చాలా మంది ఈ భవిష్యవాణులపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొంతమంది వీటిని బలంగా నమ్ముతుంటారు. మరికొంతమంది వీటిని కొట్టిపారేస్తుంటారు. జులైలో సునామీ వస్తుందని సైంటిఫిక్ గా ఇప్పటికైతే ఎవరూ నిర్ధారించలేదు. భూకంప శాస్త్రవేత్తలు భూమి కదలికల ఆధారంగా భూకంపాలను కొంతమేర ముందే అంచనా వేస్తుంటారు. కానీ కొన్ని నెలల ముందే వీటిని గుర్తించడం కష్టం. జపాన్ లో ఏటా 1500 చిన్నాచితకా భూకంపాలు వస్తుంటాయి. ఎప్పుడో ఒకసారి పెద్ద పెద్ద భూకంపాలు వస్తుంటాయి. వాటి వల్ల సునామీలు సంభవిస్తుంటాయి. జపాన్‌లో ఆధ్యాత్మిక నమ్మకాలు బలంగా ఉన్నాయి. అందుకే ర్యో టట్సుకీ హెచ్చరికలను కొందరు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

ర్యో టట్సుకీ హెచ్చరికలు ఇప్పుడు జపాన్ సహా పలు దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆమె చెప్పింది జరుగుతుందో లేదో తెలీదు.. కానీ ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు వాటి గురించి చర్చ జరగడం సహజం.

Exit mobile version