ఆకాశంలో యుద్ధం ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు యుద్ధ విమానాలు, భారీ క్షిపణులే శక్తి చిహ్నాలు. కానీ ఇప్పుడు చిన్నగా కనిపించే డ్రోన్లు పెద్ద దేశాల సైన్యాలను కూడా సవాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెడ్ కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలను కొత్తగా ఆలోచించేలా చేశాయి. చూడటానికి సాధారణంగా కనిపించే ఈ డ్రోన్ల ఖర్చు కేవలం 40లక్షల రూపాయలు మాత్రమే. కానీ వాటిని కూల్చడానికి ఉపయోగించే ఇంటర్‌సెప్టర్ క్షిపణుల ఖర్చు కోట్లలో ఉంటుంది.
దీని అర్థం తక్కువ ఖర్చుతో తయారయ్యే ఒక డ్రోన్.. కోట్ల విలువైన రక్షణ వ్యవస్థలను కూడా ఒత్తిడిలోకి నెడుతోంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం నుంచి ఇప్పటి ఇరాన్ ఘర్షణ వరకు ఈ డ్రోన్లు యుద్ధంలో ఎంత ప్రభావం చూపగలవో ప్రపంచం చూసింది. అంతే కాదు.. ఇరాన్ డ్రోన్ డిజైన్ ఆధారంగా అమెరికా కూడా LUCAS అనే తక్కువ ఖర్చు డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరిచూపు ఇండియా వైపు కూడా పడింది. ఇంతకీ ఆధునిక యుద్ధాల్లో కీలకంగా మారుతున్న కామికాజే డ్రోన్లు భారత్ వద్ద కూడా ఉన్నాయా?
ఇలాంటి డ్రోన్లు ఎందుకు అంత ప్రాధాన్యం పొందుతున్నాయో అర్థం చేసుకోవాలంటే ఇటీవల జరిగిన యుద్ధాలను చూడాలి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ తయారు చేసిన షాహెడ్-136 డ్రోన్లు పెద్ద చర్చగా మారాయి. ఒక్కో డ్రోన్ ధర తక్కువే అయినా వాటిని వందల సంఖ్యలో పంపిస్తే శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారీ ఒత్తిడి పడుతుంది.
యుక్రెయిన్ వాటిని అడ్డుకోవడానికి కోట్ల రూపాయల విలువైన క్షిపణులను ఉపయోగించాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఆధునిక యుద్ధంలో ఒక కొత్త వాస్తవాన్ని చూపించింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లు అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థలను కూడా బీట్ చేయగలవు. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఇలాంటి లోకాస్ట్ కామికాజే డ్రోన్ల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాయి. ఇలాంటి టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ కూడా దూసుకెళ్తోంది. ఇప్పటికే భారత సైన్యంలోకి స్వదేశీ కామికాజే డ్రోన్లు ప్రవేశించాయి. వాటిలో ముఖ్యమైనది నాగాస్త్ర-1. సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ 2024 నుంచి భారత సైన్యంతో కలిసి చక్కర్లు కొడుతోంది. లక్ష్యాన్ని గుర్తించి దానిపై నేరుగా దూసుకెళ్లి పేలడం ఈ డ్రోన్ ప్రత్యేకత.
ఇటు స్కై స్ట్రైకర్ స్యూసైడ్ డ్రోన్‌ను కూడా భారత సైన్యం ఉపయోగిస్తోంది. బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ కంపెనీ, ఇజ్రాయెల్ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్‌తో కలిసి దీన్ని అభివృద్ధి చేసింది. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఆపరేషన్లలో ఈ డ్రోన్లు వినియోగంలోకి వచ్చాయి. ఇక పెద్ద పరిధిలో దాడులు చేయగల తక్కువ ఖర్చు డ్రోన్లను కూడా ఇండియా అభివృద్ధి చేస్తోంది. వాటిలో ముఖ్యమైన ప్రాజెక్ట్ శేషనాగ్-150.
బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ సంస్థ ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేస్తోంది. సుమారు 150 కిలోల బరువుతో ఉండే ఈ డ్రోన్ 1000 నుంచి 1200 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. 25 నుంచి 40 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఈ డ్రోన్‌లో మరో ముఖ్యమైన అంశం స్వార్మ్ టెక్నాలజీ. అంటే ఒకేసారి అనేక డ్రోన్లు కలిసి దాడి చేస్తాయి. ఈ విధానం శత్రు రక్షణ వ్యవస్థలను గందరగోళంలో పడేసే అవకాశం ఉంది.
శేషనాగ్-150 డ్రోన్‌ను మొదటిసారి 2025 ఫిబ్రవరిలో టెస్టింగ్ చేశారు. ఇదికాకుండా ప్రాజెక్ట్ KAL అనే మరో లో-కాస్ట్ స్ట్రైక్ డ్రోన్ అభివృద్ధి దశలో ఉంది. నోయిడాకు చెందిన ఐజీ డిఫెన్స్ సంస్థ దీనిపై వర్క్ చేస్తోంది. సుమారు 1000 కిలోమీటర్ల వరకు వెళ్లగల సామర్థ్యంతో ఈ డ్రోన్‌ను రూపొందిస్తున్నారు. ఇక భారత్‌లోని కొన్ని సంస్థలు FPV అనే చిన్న యుద్ధ డ్రోన్లను కూడా అభివృద్ధి చేస్తున్నాయి. ఇటీవల లడఖ్ ప్రాంతంలో చైనా సరిహద్దు దగ్గర వీటిని పరీక్షించారు. ప్రస్తుతం ప్రపంచ యుద్ధ వ్యూహాల్లో ఒక పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భారీ యుద్ధ విమానాలు, ఖరీదైన క్షిపణులే కాకుండా చిన్న డ్రోన్లు కూడా యుద్ధంలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్లు శత్రు రక్షణ వ్యవస్థలను నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ డ్రోన్ యుద్ధ సాంకేతికతపై దృష్టి పెడుతున్నాయి. భారత్ కూడా స్వదేశీ టెక్నాలజీతో ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేస్తూ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపర్చే దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు.
