Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?

Infosys Salary explained

Infosys Salary

ఓవైపు AI దూకుడుతో ఉద్యోగాలు ఊడిపడుతుంటే మరోవైపు కోటి రూపాయల జీతాలు అందుకుంటున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందట. ఒకవైపు ఉద్యోగ భద్రతపై భయాలు… మరోవైపు కోటి రూపాయల వార్షిక వేతనాలు. అసలు ఇంతకీ ఐటీ రంగంలో జరుగుతోంది?

ఇన్ఫోసిస్‌ నివేదికలో ఏముంది?

ఇన్ఫోసిస్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 130 మంది ఉద్యోగులు ఏడాదికి కోటి రూపాయలకుపైగా ఆదాయం పొందారు. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక సంఖ్య.

గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 112గా ఉంది. అంతకముందు అది 103గా ఉంది. అంటే వరుసగా ప్రతి ఏడాది కోటి రూపాయల క్లబ్‌లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం రావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని ప్రపంచమంతా మాట్లాడుతున్న సమయంలో ఇన్ఫోసిస్‌ కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది? దీనికి సమాధానం కూడా ఐటీ రంగంలో జరుగుతున్న మార్పుల్లోనే ఉంది.

×
×
Ad

నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ కోడింగ్ వర్క్స్‌ను వేగంగా పూర్తి చేయగలుగుతోంది. కానీ సిస్టమ్ డిజైన్, వ్యాపార వ్యూహాలు, పెద్ద ప్రాజెక్టుల నిర్వహణ, క్లయింట్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా ఇంజినీరింగ్ లాంటి నైపుణ్యాలకు డిమాండ్ తగ్గలేదు. పైగా ఇలాంటి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను కంపెనీలు మరింత విలువైన వనరులుగా చూస్తున్నాయి. అందుకే అత్యుత్తమ ప్రతిభను కాపాడుకోవడానికి భారీ వేతనాలు చెల్లిస్తున్నాయి.

ఇన్ఫోసిస్ నివేదికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. కోటి రూపాయల క్లబ్‌లో ఉన్న ఉద్యోగుల్లో కేవలం 22 మంది మాత్రమే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీని విడిచిపెట్టారు. అంటే అధిక వేతనాలు పొందుతున్న ప్రతిభావంతులను సంస్థ విజయవంతంగా నిలబెట్టుకోగలిగిందని అర్థం.

స్టాక్‌ అవార్డులతోనే కోటి రూపాయలు?

ఉద్యోగులు బయటకు వెళ్లకుండా వారిని సంస్థలోనే కొనసాగించడం కోసం కంపెనీలు ఇప్పుడు స్టాక్ ఆప్షన్లు, దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు, పనితీరు ఆధారిత బోనస్‌లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇక ఈ కోటి రూపాయల ఆదాయం అంతా నెలవారీ జీతం రూపంలోనే వస్తోందని అనుకోవడం పొరపాటు. ఇందులో పెద్ద భాగం గతంలో ఇచ్చిన స్టాక్ అవార్డులు, షేర్ ఆధారిత ప్రోత్సాహకాలు, పనితీరు బోనస్‌ల ద్వారా వచ్చినదే. కంపెనీ షేర్ల విలువ పెరిగినప్పుడు ఉద్యోగుల సంపద కూడా భారీగా పెరుగుతుంది. అందుకే సీనియర్ స్థాయి ఉద్యోగుల మొత్తం ఆదాయం వేగంగా పెరుగుతోంది.

మరోవైపు ఇదే సమయంలో దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టీసీఎస్‌లో వేరే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థ సగటున ఐదు శాతం వేతన పెంపు ప్రకటించినప్పటికీ కొందరు ఉద్యోగులు తమ జీతాల్లో ఆశించినంత పెరుగుదల కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరైతే నెలవారీ వేతనం తగ్గిందని కూడా ఆరోపించారు. అయితే దీనికి కారణం వేతన నిర్మాణంలో జరిగిన మార్పులేనని సంస్థ చెబుతోంది.

కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా వేతన ప్యాకేజీలను మార్చడం వల్ల లెక్కల్లో మార్పులు కనిపించాయని టీసీఎస్ వివరణ ఇచ్చింది. ఈ రెండు ఉదాహరణలు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాయి. ఐటీ రంగంలో అందరికీ ఒకే పరిస్థితి లేదు.

అత్యున్నత నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో సాధారణ నైపుణ్యాలతో ఉన్నవారు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. గతంలో కేవలం కోడింగ్ తెలుసుంటే సరిపోయేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడం మరింత కీలకంగా మారింది. అందుకే నిపుణులు కూడా ఒకే విషయం చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలను పూర్తిగా నాశనం చేయదు. కానీ ఉద్యోగాల స్వరూపాన్ని మాత్రం మార్చేస్తుంది. మార్పులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకునేవారికి భారీ అవకాశాలు ఉంటాయి. నేర్చుకోవడాన్ని ఆపేసినవారికి మాత్రం సవాళ్లు పెరుగుతాయి.

ఇక ఇన్ఫోసిస్ మరో కీలక ప్రకటన కూడా చేసింది. ఈ ఏడాది దాదాపు 20వేల మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు చెప్పింది. అంటే ఐటీ రంగంలో నియామకాలు పూర్తిగా ఆగిపోలేదని స్పష్టమవుతోంది. కంపెనీలు ఉద్యోగులను తగ్గించడం కంటే అవసరమైన నైపుణ్యాలతో ఉన్న ఉద్యోగులను వెతుకుతున్నాయని అర్థంచేసుకోవచ్చు.