Site icon NTV Telugu

GROK: గీత దాటిన గ్రోక్‌.. ఇది స్వేచ్ఛ కాదు.. విచ్చలవిడితనం..! చిన్నపిల్లల దుస్తులను తీసేసి..

Grokunderfire

Grokunderfire

శరీరంపై ధరించి ఉన్న చిన్నపిల్లల దుస్తులు మాయమయ్యాయి. గౌరవం చెరిగిపోయింది.
చివరికి పిల్లల భద్రతే పగిలిపోయింది. ఇది స్వేచ్ఛ కాదు.. గ్రోక్ విచ్చలవిడితనానికి పరాకాష్ట! ఇది టెక్నాలజీ చాటున నైతికతపై జరిగిన అనైతిక దాడి. మనిషి గీసిన గీతను యంత్రం దాటిన ఆ క్షణం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. చిన్నపిల్లల ఫొటోలను, మహిళల ఫొటోలను అన్‌డ్రెస్‌ చేయాలని కామిస్టులు అడిగిన ప్రాంప్ట్‌ని గ్రోక్‌ తిరస్కరించలేదు. వారికి ఏం కావాలో అది క్రియేట్ చేసి చూపించింది. నిజానికి మీరు ఎప్పుడైనా అడగకూడనది అడిగితే చాట్‌జీపీటీ కానీ.. ఇతర ఏఐ టూల్స్‌ కానీ మీరు కోరిన దాన్ని తిరస్కరిస్తాయి. మా కంటెంట్‌ పాలసీ మీరు అడిగిన ప్రాంప్ట్‌కి స్పందించదని ఖరాఖండిగా చెప్పేస్తాయి. కానీ గ్రోక్‌ వేరు.. విచ్చలవిడితనమే దాని పేటెంట్‌ రైటూ! చైల్డ్ సె*క్సువల్ అబ్యూస్ మెటీరియల్ చట్టవిరుద్ధమని, అనైతికమని గ్రోక్ స్వయంగా ఒప్పుకుంటోంది కానీ.. మరి ఈ తరహా కంటెంట్‌ను ఎందుకు అడ్డుకోలేకపోతోంది? ఇది నిర్లక్ష్యం కాదా?

గ్రోక్ చేసిన తప్పు ఒక చిన్న టెక్నికల్ లోపం కాదు. ఇది ఒక పెద్ద నైతిక వైఫల్యం. డిసెంబర్ చివరిలో ‘ఇమేజ్ ఎడిట్’ ఫీచర్ తీసుకురాగానే ఈ ప్రమాదం మొదలైంది. ఎవరు ఏ ఫోటో పెట్టినా దాన్ని ఎలా కావాలంటే అలా మార్చే అవకాశం ఇవ్వడమంటే నియంత్రణ పూర్తిగా వదిలేసినట్టే. చిన్నపిల్లల ఫొటో అయినా సరే, మహిళల ఫోటో అయినా సరే, ‘ఇది చేయకూడదు’ అని గ్రోక్ చెప్పలేదు. ఫొటోలో చిన్నపిల్లలు ఉన్నారా లేదా మహిళలు ఉన్నారా అనే కనీస సెన్సిటివిటీ కూడా కనిపించలేదు. సోషల్ మీడియాలో వరుసగా ఆధారాలు బయటపడ్డాయి. స్క్రీన్ షాట్లు వచ్చాయి. భయంకరమైన మార్పులు కనిపించాయి. అప్పటికే నష్టం జరిగిపోయింది. ఈ మొత్తం విషయం బయటపడిన తర్వాతే గ్రోక్ స్పందించింది. లోపాలు గుర్తించాం, సరిచేస్తున్నాం అంటూ చిన్న వాక్యంలో తప్పించుకుంది.

ఇక్కడే కంపెనీ ఫౌండర్‌ ఎలాన్ మస్క్ గురించి చెప్పుకోవాలి. గ్రోక్ ఒక్క సాధారణ ఏఐ టూల్ కాదు. ఇది ఎలాన్ మస్క్ ఆలోచనల ప్రతిబింబం. నియంత్రణలు అవసరం లేదన్న అహంకారం. నన్నెవరూ తాకలేరన్న ధీమా. డబ్బు ఉంది కాబట్టి చట్టం నా దగ్గరికి రాదన్న భావన. మీడియా ప్రశ్నిస్తే అబద్ధాలు అంటాడు. ప్రభుత్వాలు ప్రశ్నిస్తే ఫ్రీ స్పీచ్ పేరుతో తప్పించుకుంటాడు. కానీ ఇది మాటల విషయం కాదు. ఇది చిన్నపిల్లల భద్రత విషయం. ప్రపంచంలో నీకు ఎంత సంపద ఉన్నా నైతికత కంటే నువ్వు ఎవరూ ఎక్కువ కాదు. గ్రోక్‌లో జరిగినది ఒక టెక్నికల్ లోపం కాదు. ఇది నాయకత్వ వైఫల్యం. ఎలాన్ మస్క్ తన సృష్టి వల్ల కలిగిన నష్టానికి బాధ్యత తీసుకోకపోతే అది ధనవంతుడి అహంకారంగా మాత్రమే చరిత్రలో మిగిలిపోతుంది.

ఇక్కడ మరో విషయం గురించి ఆలోచించాలి. ఇలాంటి దుర్వినియోగాన్ని ఇప్పుడే ఆపకపోతే రేపటి ప్రపంచం ఎలా ఉంటుందనే ప్రశ్న. పిల్లల జీవితాలు ప్రయోగాలుగా మారడం నిజంగా బాధాకరం. మహిళల గౌరవం డేటాగా మారడం చాలా దుర్మార్గం. మార్ఫింగ్ ఫొటోలతో జీవితాలే నాశనం అవుతాయి. కంపెనీలు క్షమాపణలు చెప్పి తప్పించుకుంటాయి కానీ.. బాధితులకు బాధ పోదు. అందుకే నియంత్రణ లేకపోతే ఏఐ ఓ సాధనంగా కాకుండా కిరాతకుల ఆయుధంగా మారుతుంది.

నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా కూడా చైల్డ్ సె*క్సువల్ అబ్యూస్ మెటీరియల్‌ను సహించరు. అమెరికా చట్టాల ప్రకారం రూల్స్‌ను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పడతాయి. యూరప్‌లో అయితే ఇంకా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అందుకే ఫ్రాన్స్‌లో ఇప్పటికే మస్క్ కంపెనీ Xపై దర్యాప్తు పెరిగింది. గ్రోక్ ద్వారా చిన్నపిల్లల అశ్లీల కంటెంట్ తయారైందన్న ఆరోపణలు అధికారిక దర్యాప్తు వరకు వెళ్లాయంటే గ్రోక్‌ ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ తరహా ఆరోపణలు వచ్చిన ప్రతీసారి మస్క్‌ వితండవాదానికి దిగుతారు. ఇది ఫ్రీ స్పీచ్ అని.. ఫ్రీడమ్‌ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అని పెద్ద సోషల్‌ మేధావిలా కలరింగ్ ఇస్తారు. నిజానికి ఇదంతా తన తప్పు నుంచి తప్పించుకునే మార్గంలో భాగం! ఫ్రీ స్పీచ్ అనే మాటను కవచంగా వాడుకుని నియంత్రణలను తుంగలో తొక్కింది గ్రోక్. ఫ్రీ స్పీచ్ అంటే పిల్లల శరీరాలపై దాడి చేయడమా? ఫ్రీ స్పీచ్ అంటే మహిళల గౌరవాన్ని అల్గోరిథమతో చింపేయడమా? ఏమో మస్క్‌కి ఈ నైతికత లేదేమో కానీ.. ప్రపంచానికైతే ఇంకా ఉంది!

ఇప్పటివరకు ఉన్న చాలా ఏఐ టూల్స్ ఒక బౌండరీని గీసుకున్నాయి. మీరు ఎంత అడిగినా సరే, చట్టవిరుద్ధమైతే, అనైతికమైతే, స్పష్టంగా నిరాకరిస్తాయి. కానీ గ్రోక్‌లో ఆ నిరాకరణ కనిపించలేదు. అదే అసలైన సమస్య. యంత్రానికి నియంత్రణ లేకపోతే అది సాధనం కాదు.. అది కరుడుకట్టిన ఉన్మాదం. ఇక ఈ వివాదం ఒక్క గ్రోక్ వరకే పరిమితం కాదు. ఇది రేపు వచ్చే ప్రతి ఏఐ టూల్‌కి హెచ్చరిక. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా సరే, నైతికత లేకపోతే అది సమాజాన్ని వెనక్కి లాగుతుంది. పిల్లల భద్రతతో ప్రయోగాలు చేసే హక్కు ఏ కంపెనీకి లేదని బడాబాబులు మర్చిపోకూడదు!

Exit mobile version