బడ్జెట్ అనగానే పన్ను రాయితీలు, ఉద్యోగాలు, జీతాలు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ 2026 బడ్జెట్‌ను చూసే జెన్-జీ దృష్టి అక్కడితో ఆగడం లేదు. ఉద్యోగ భద్రత లేని ప్రపంచంలో పెరిగిన తరం ఇది.
కోవిడ్, యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, క్లైమేట్ మార్పులు అన్నింటినీ చిన్న వయసులోనే చూసింది. అందుకే ఈ తరం ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలు భిన్నంగా ఉన్నాయి. జీతం ఎంత వస్తోందన్నదాని కంటే, ఆ జీతంతో జీవించగలుగుతున్నామా? మానసిక ఆరోగ్యానికి భద్రత ఉందా? చదువు ఉద్యోగంగా మారుతోందా? మహిళలకు ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉన్నాయా? నగరాల్లో బతకడం ఎందుకు ఇంత ఖరీదయ్యింది? పర్యావరణం విషయంలో మాటలు కాదు, చర్యలు ఎప్పుడు కనిపిస్తాయి? ఇటు డిలాయిట్ సర్వేలు చెబుతున్న గణాంకాలు, యువత అనుభవిస్తున్న ఒత్తిడి, ఆందోళనలు ఒకటే చెబుతున్నాయి.
జెన్-జీకి బడ్జెట్ అంటే ఇక కేవలం ట్యాక్స్ స్లాబ్స్ కాదు. అది జీవన నాణ్యతపై ఒక పరీక్ష. ఆరోగ్యం నుంచి చదువు వరకు, పన్నుల నుంచి పర్యావరణం వరకు ప్రభుత్వం తమ భవిష్యత్తును ఎలా చూస్తుందో తెలుసుకునే క్షణం. ఇంతకీ 2026 బడ్జెట్ నుంచి జెన్-జీ నిజంగా ఏం ఆశిస్తోంది?
జెన్-జీకి ఆరోగ్యమంటే చికిత్స మాత్రమే కాదు. మానసిక ఆరోగ్యం కూడా. డిలాయిట్ 2025 సర్వే ప్రకారం 36 శాతం మంది జెన్-జీ కిడ్స్ తరచూ ఒత్తిడి, ఆందోళనతో ఉన్నామని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయిటింగ్ టైమ్, డాక్టర్ల కొరత, సేవల నాణ్యతపై అసంతృప్తి స్పష్టంగా ఉంది. బడ్జెట్ కేటాయింపులు పెరిగినా, రియాల్టీలో మార్పు కనిపించడంలేదన్న భావన ఉంది.
ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఖర్చు GDPలో సుమారు 2 శాతం చుట్టూనే ఉంది. ఇది చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే తక్కువ. జెన్-జీ ప్రకారం హాస్పిటల్ అంటే చివరి ఆప్షన్ కాకుండా, నమ్మకమైన వ్యవస్థగా మారాలి. కాలేజీల్లో, వర్క్‌ప్లేస్‌ల్లో కౌన్సెలింగ్ సేవలు అందుబాటులోకి రావాలి.
ఇటు నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం భారత్‌లో 10.6 శాతం పెద్దలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కానీ చికిత్స ఖర్చు, స్టిగ్మా, సరైన సదుపాయాల లేమి వల్ల యువత మౌనంగా ఉండిపోతుంది.
మెంటల్ హెల్త్‌ను బీమా కవరేజ్‌లో భాగం చేయాలని జెన్-జీ కోరుకుంటోంది. విద్యాసంస్థల్లో ఇది ఒక సపోర్ట్ సిస్టమ్‌గా ఉండాలి. బడ్జెట్‌లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం కావాలన్నది వారి డిమాండ్. మరోవైపు మెన్‌స్ట్రువల్ హెల్త్‌పై కూడా జెన్-జీకి పలు డిమాండ్లు ఉన్నాయి. NFHS-5 డేటా ప్రకారం 15 నుంచి 24 ఏళ్ల మహిళల్లో 77 శాతం మంది హైజీనిక్ ఉత్పత్తులు వాడుతున్నారు. అంటే ఇంకా పెద్ద శాతం మహిళలు వాటికి దూరంగా ఉన్నారు. కారణం ధర. జెన్-జీ మహిళలు కోరేది స్పష్టంగా ఉంది. శానిటరీ న్యాప్కిన్లు లగ్జరీలా కాకుండా సాధారణ వస్తువుల్లా అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ పంపిణీ బలపడాలి. ధర తగ్గేలా పాలసీ ఉండాలి.
ఇటు డిగ్రీ ఉన్నా జాబ్ గ్యారంటీ లేదు. ఇది జెన్-జీ అనుభవిస్తున్న కఠిన నిజం. విద్యా వ్యవస్థ ఇంకా పాత పద్ధతుల్లోనే నడుస్తోందన్న అసంతృప్తి ఉంది. బడ్జెట్‌లో కేవలం కొత్త కాలేజీలు కాదు, ఉన్న విద్యాసంస్థలను అప్‌గ్రేడ్ చేయాలని జెన్-జీ కోరుతోంది. స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ లింకేజెస్ పెరగాలట. ఇక మొదటిసారి ట్యాక్స్ ఫైల్ చేసే యువతకు సిస్టమ్ భయపెడుతోందనే భావన ఉంది. ఫ్రీలాన్సర్లు, గిగ్ వర్కర్స్‌కు నియమాలు క్లియర్‌గా లేవు. ట్యాక్స్ అంటే భయం కాకుండా సింపుల్ ప్రాసెస్ కావాలన్నది వారి ఆశ.
ఇటు డిఫెన్స్, స్పేస్ సెక్టార్‌లో పెట్టుబడులు దేశ భద్రతతో పాటు హై స్కిల్ ఉద్యోగాలు కూడా సృష్టిస్తాయని జెన్-జీ భావిస్తోంది. ఈ రంగాల్లో బడ్జెట్ పెరగాలని యువత కోరుతోంది. మరి వీరి డిమాండ్లు నేరవేరుతాయా లేదా అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 1వరకు వెయిట్ చేయాల్సిందే!
ALSO READ: మహిళలకు గుడ్‌న్యూస్..! బడ్జెట్‌లో కొత్త స్కీములు..? పూర్తి డీటెయిల్స్ ఇవే!
