NTV Telugu Site icon

Dream Communication : కలలో కూడా మాట్లాడుకుందాం..!

Dream Communication

Dream Communication

మనలో చాలా మంది కలల ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. నిజ జీవితంలో అద్భుతాలు సాకారం కాకపోయినా కలల్లో మాత్రం ఎన్నెన్నో అద్భుతాలను ఊహించుకుంటూ బతికేస్తూ ఉంటాం. సహజంగా సినిమాల్లో మాత్రమే కలల కనడం, వాటిని సాకారం చేసుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సైన్ ఫిక్షన్ సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలు కనడాన్ని పక్కన పెడితే కలల్లో కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవచ్చని నిరూపించారు శాస్త్రవేత్తలు.. ఇదిప్పుడు సంచలనం కలిగిస్తోంది.

ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం.. లేదంటే ఇప్పుడు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అలా కాకుండా పడుకుని నిద్రపోతున్నప్పుడు వచ్చే కలల్లో కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా..? పడుకుని నిద్రపోతున్నప్పుడు ఎంతోమందికి కలలు వస్తుంటాయి. అయితే ఇవన్నీ జరుగుతాయో జరగవో చెప్పలేం. ఎంతోమంది ఆ కలల ప్రపంచంలో కాసేపు విహరిస్తూ ఉంటారు. ఇంకొందరు అలా కలల్లోనే ఇతరులతో మాట్లాడేస్తూ ఉంటారు. అయితే నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులు తమ కలల ద్వారా మాట్లాడుకోవచ్చని నిరూపిస్తున్నారు శాస్త్రవేత్తలు. కలల్లో కూడా ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకోవడం సాధ్యమేనంటున్నారు కాలిఫోర్నియాలోని రెమ్ స్పేస్ కంపెనీ శాస్త్రవేత్తలు. ఇద్దరు వ్యక్తులు కలలో ఒకరితో మరొకరు మాట్లాడుకునే ప్రయోగాన్ని ఈ సంస్థ విజయవంతంగా నిర్వహించింది. ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులు కలలో కామన్ గా షేర్ చేసుకుంటున్నట్టు నిర్ధారించింది.

ఇద్దరు వ్యక్తులు కలలో మాట్లాడుకోవచ్చని నిరూపించేందుకు రెమ్ స్పేస్ కంపెనీ చాలాకాలంగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రత్యేకమైన పరికరాలతో ఇది సాధ్యమేనని నిరూపించింది. కలల కమ్యూనికేషన్ ను గుర్తించేందుకు రెమ్ స్పేస్ శాస్త్రవేత్తలు అత్యాధునిక ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. తాజాగా వేర్వేరు ప్రదేశాల్లో పడుకున్న ఇద్దరు వ్యక్తులపై ఈ ప్రయోగం చేపట్టారు. వాళ్ల మెదడు తరంగాలని రిమోట్ ఆపరేట్స్ ద్వారా ట్రాక్ చేశారు. తమ శరీరంలోని బయొలాజికల్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయడానికి ప్రత్యేక డివైజ్ ను ఉపయోగించారు. ఈ డివైజ్ లను సర్వర్ కు కనెక్ట్ చేశారు. ఆ డేటానంతటినీ సర్వర్లలో స్టోర్ చేశారు. సర్వర్ లో ఓ వ్యక్తి కలలోకి వెళ్లినట్టు గుర్తించారు. కోడ్ ద్వారా కలలో ఉన్న వ్యక్తికి జిలక్ అనే పదాన్ని ఇయర్ బడ్ ద్వారా వినిపించారు. ఆయన అదే పదాన్ని కలలో రిపీట్ చేశారు. కాసేపటి తర్వాత మరో వ్యక్తి కలలోకి ఎంటరయ్యారు. మొదటి వ్యక్తి నుంచి స్టోర్ చేసిన డేటాను సర్వర్ ద్వారా రెండో వ్యక్తికి పంపించారు. రెండో వ్యక్తి కూడా అదే పదాన్ని రిపీట్ చేశారు. దీన్నిబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకేలా కలగనరని శాస్త్రవేత్తలు నిరూపించారు.

కలలను ట్రాక్ చేస్తున్నారు.. కలల ద్వారా మాట్లాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు సరే.. అసలు ఈ డ్రీమ్ కమ్యూనికేషన్ వల్ల లాభమేమైనా ఉందా..? రెమ్ స్పేస్ సంస్థ పరిశోధకులు ఎంతోకాలంగా కలలపై ప్రయోగాలు చేస్తున్నారు. తొలిసారిగా కలల ద్వారా కమ్యూనికేషన్ సాధ్యమేనని గుర్తించారు. దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనేది రెమ్ స్పేస్ లక్ష్యం. ఇందుకోసం భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టబోతున్నారు. సహజంగా మనిషి నిద్రపోతున్నప్పుడు అచేతనావస్థలోకి జారుకుంటారు. అలాంటప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి.. ఆ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది.. కమ్యూనికేషన్ ఏమైనా జరుగుతుందా..? ఒకవేళ జరిగితే అది ఎలా ఉంటుంది.. లాంటివాటిని కనిపెట్టేందుకు ఈ పరిశోధనలు దోహదపడతాయి. వీటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే వ్యక్తుల మానసిక సమస్యలను గుర్తించేందుకు వీలవుతుంది. వాటిని అధిగమించేందుకు అవకాశం కలుగుతుంది.

వాస్తవానికి ఇలా కలల్లో కూడా కమ్యూనికేషన్ జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మనం ఇలాంటివి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. ఏదైనా ఆరంభంలో కొత్తగానే ఉంటుంది. కానీ లోతులకు వెళ్లేకొద్దీ అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు కలల కమ్యూనికేషన్ కూడా అలాంటిదే. ఇది ఆరంభంలోనే ఉంది. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి మెరుగు పరిస్తే మరిన్ని అద్భుతాలు సాకారమయ్యే అవకాశం ఉంది. కాన్షియస్ స్టేజ్ లోనే కాకుండా అన్ కాన్షియస్ స్టేజ్ లో కూడా పనులు చేసేందుకు, మాట్లాడుకునేందుకు వీలవుతుంది. అంతేకాక.. తమ కలలను తాము కంట్రోల్ చేసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే కలలపై ఎంతోమంది పరిశోధనలు చేస్తున్నారు. తాజా ప్రయోగం మాత్రం చరిత్రలో ఓ మైలురాయి కానుంది.

కలలపై ప్రయోగాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే మానసిక సమస్యలను పసిగట్టేందుకు వీలవుతుంది. అప్పుడు వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు అవకాశం కలుగుతుంది. మున్ముందు మన జీవితాల్లో డ్రీమ్ కమ్యూనికేషన్ ఒక భాగమైపోతుందనేది రెమ్ స్పేస్ సైంటిస్టులు చెప్తున్న మాట.

Show comments