శతాబ్దాలుగా నిలబడ్డ హిమనదులు ఇప్పుడు మెల్లగా మాయమవుతున్నాయి. మంచుతో కప్పబడిన ఈ పర్వతాల అడ్రెస్ గల్లంతయ్యే ప్రమాదముంది. భూమి వేడెక్కుతున్న కొద్దీ.. ఈ హిమనదులు ఒక్కొక్కటిగా అంతరించిపోతున్నాయి. ఇది నెమ్మదిగా జరుగుతున్న ప్రక్రియ కాదు. ఇది వేగంగా సాగుతున్న ఒక విపత్తు.

తాజా అంతర్జాతీయ పరిశోధన ప్రకారం, రానున్న దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది హిమనదులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. 2055లో.. అంటే ఆ ఒక్క ఏడాదే దాదాపు 4,000 హిమనదులు మాయమయ్యే స్థాయికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలే కదా అని లైట్ తీసుకోవద్దు. ప్రతి హిమనది ఒక ప్రాంతానికి నీరు.. ఒక లోయకు జీవనం కూడా. ఒక తరం జ్ఞాపకాలు కూడా అందులోనే దాగి ఉంటాయి.
ఇక ఈ హిమనదులు ఎంత వేగంగా అంతరించిపోతున్నాయన్నదాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు కచ్చితంగా లెక్కగట్టారు. ఈ పరిశోధనను స్విట్జర్లాండ్‌లోని ETH Zurich నేతృత్వంలో ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ‘Nature Climate Change’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనదుల భవిష్యత్తును సంఖ్యల రూపంలో చూపించింది. ఊహలు కాదు.. అంచనాలు కాదు.. మూడు ఆధునిక గ్లేసియర్ మోడల్స్, వేర్వేరు వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ లెక్కలు రూపొందించారు.
ఈ అధ్యయనం ఒక కొత్త పదాన్ని పరిచయం చేసింది. పీక్ గ్లేసియర్ ఎక్స్‌టిన్‌క్షన్. అంటే ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో హిమనదులు పూర్తిగా అంతరించిపోయే క్షణం. భూమి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల వరకు పెరిగితే.. ఈ పీక్ 2041లో వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ఏడాది ఒక్కటే దాదాపు 2,000 హిమనదులు మాయమవుతాయి. అదే ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు చేరితే, ఈ పీక్ 2055కి మారుతుంది. అప్పుడు ఆ ఒక్క ఏడాదిలోనే 4,000 హిమనదులు అంతరించిపోతాయి. అంటే భూమి ఒక్క డిగ్రీ ఎక్కువ వేడెక్కితే, నష్టం రెట్టింపు అవుతుంది.
ఈ ప్రభావం మొదటగా చిన్న హిమనదులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆల్ప్స్ లాంటి పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆల్ప్స్‌లో సుమారు 3,000 హిమనదులు ఉన్నాయి. కానీ భూమి ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే, 2100 నాటికి వాటిలో కేవలం 110 మాత్రమే మిగిలే అవకాశం ఉంది. అంటే 97 శాతం హిమనదులు కనుమరుగవుతాయి.
ఒకవేళ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పెరిగితే.. మిగిలేది కేవలం 20 హిమనదులు మాత్రమే. ఇక్కడ మరో భయానకమైన విషయం ఏంటంటే.. పెద్ద హిమనదులు కూడా ఇక సురక్షితంగా లేవు. రోన్ గ్లేసియర్ లాంటి మధ్యస్థ హిమనదులు చిన్న ముక్కలుగా మారిపోతాయి. ఇప్పటికే స్విట్జర్లాండ్‌లో 1973 నుంచి 2016 మధ్యకాలంలోనే వెయ్యికి పైగా హిమనదులు పూర్తిగా అంతరించిపోయాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ సమస్య ఆల్ప్స్‌కే పరిమితం కాదు.. కాకేసస్ పర్వతాలు, రాకీ మౌంటెన్స్, ఆండీస్, ఆఫ్రికాలోని కిలిమంజారో లాంటి పర్వత ప్రాంతాలు కూడా అదే దారిలో వెళ్తున్నాయి. ఈక్వేటర్‌కు దగ్గరగా, తక్కువ ఎత్తులో ఉన్న చిన్న హిమనదులు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో రానున్న 10 నుంచి 20 సంవత్సరాల్లో సగానికి పైగా హిమనదులు పూర్తిగా మాయమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇక హిమనదులు కరిగిపోతే సముద్ర మట్టం పెరుగుతుందన్న మాట మనం చాలాసార్లు విన్నాం. కానీ ఈ అధ్యయనం మరో ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ఒక చిన్న హిమనది కరిగితే సముద్ర మట్టం మీద పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ.. ఒక హిమనది పూర్తిగా అంతరించిపోతే, ఆ ప్రాంత జీవితం పూర్తిగా మారిపోతుంది. పర్వత లోయల్లో నీటి సరఫరా తగ్గిపోతుంది. వ్యవసాయం దెబ్బతింటుంది. పర్యాటకం కుప్పకూలుతుంది. ఒక లోయ ఆర్థికంగా, సామాజికంగా శూన్యంగా మారిపోతుంది.
అందుకే శాస్త్రవేత్తలు హిమనదులను కేవలం మంచు ముక్కలుగా చూడటం మానేయాలని చెబుతున్నారు. ఇదంతా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగానే జరుగుతుంది కాబట్టి ప్రపంచదేశాలు ఈ సమస్యను ఎంత త్వరగా సాల్వ్ చేసుకుంటే అంత మంచిదని వార్నింగ్ ఇస్తున్నారు. లేదంటే మహా ముప్పు తప్పదు..!
