NTV Telugu Site icon

World War 3 : జ్యోతిష్యం నిజమవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధమేనా..!?

Worldwar3

Worldwar3

అనుకున్నట్టే జరుగుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ఇరాన్ వరకూ పాకింది. గల్ఫ్ దేశాలన్నీ ఏకమైతే దాని ప్రభావం అంచనా వేయడం కష్టం. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా ఏడాదికి పైగా పోరాడుతోంది. ఇప్పుడు రష్యాకు ఉత్తర కొరియా తోడైంది.. ఇక తైవాన్ పై చైనా కాలు దువ్వుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే పలు దేశాల మధ్య పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్న అంశాల్లో ఇజ్రాయెల్ – ఇరాన్ వార్ ఒకటి. గాజా స్ట్రిప్ లో మొదలైన యుద్ధం ఇప్పుడు ఇరాన్ – ఇజ్రాయెల్ వార్ గా మార్పు చెందింది. ఇది ఇంతటితో ఆగుతుందా..?
2023 అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై విరుచుకు పడ్డారు. సరిహద్దు దాటి ఇజ్రాయెల్ లోపలికి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 1200 మంది దాకా చనిపోయారు. 251 మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను హమాస్ బందీలుగా పట్టుకుంది. దీంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. బందీలను విడిపించుకునేందుకు గాజాలో భారీ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికీ కొంతమంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బందీలుగానే ఉన్నారు. వాళ్లను విడిచిపెట్టే వరకూ యుద్ధం ఆగదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్.

ఇజ్రాయెల్ – హమాస్ మధ్యే ఈ యుద్ధం పరిమితమై ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది అంతటితో ఆగలేదు. గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్ పై హమాస్ గట్టిగా పోరాడుతోంది. హమాస్ కు మద్దతుగా హెజ్బొల్లా, హౌతీ లాంటి ఉగ్రవాద సంస్థలు కూడా ప్రవేశించాయి. ఈ తీవ్రవాద సంస్థలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ లాంటి దేశాలు కూడా యుద్ధంలోకి ఎంటరయ్యాయి. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లాకు మంచి పట్టుంది. హమాస్ కు హెజ్బొల్లా మద్దతు ఇస్తోందని గ్రహించిన ఇజ్రాయెల్ ఆ సంస్థ మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. తమ గడ్డపై హసన్ నస్రల్లాను చంపేయడంతో లెబనాన్ యుద్ధరంగంలోకి ఎంటరైంది. ఇక సిరియా రాజధాని డమాస్కస్ లో తలదాచుకుంటున్న హెజ్బొల్లా నేతలను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ దాడులు చేసింది. డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి పలువురిని చంపేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో తలదాచుకున్న హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియేను చంపేసింది. దీంతో ఇరాన్ కూడా కయ్యానికి కాలు దువ్వింది.

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేస్తుందని అందరూ ఊహించిందే. అయితే ఇజ్రాయెల్ సైనిక సత్తా ముందు ఇరాన్ చేతులెత్తేయడం ఖాయమనుకున్నారు. కానీ అలా జరగలేదు. తమ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సహించలేకపోయింది. అందుకే ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా యుద్ధానికి సై అంది. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా సాయంతో వీటిని ఇజ్రాయెల్ కొంతవరకూ అడ్డుకోగలిగింది. కానీ నష్టం జరిగింది. దీంతో ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ వేచి చూసింది. తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఆ దేశ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు తాము ఎందాకైనా వెళ్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

ఇప్పుడు యుద్ధం పశ్చిమాసియా మొత్తానికి వ్యాపించింది. నాలుగైదు దేశాలు ప్రత్యక్షంగా ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదు. పాలస్తీన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పడు లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ లకూ విస్తరించింది. ఇజ్రాయెల్ కు ఇప్పటికే అమెరికా సాయం చేస్తోంది. ఇరాన్ లాంటి దేశాలకు రష్యాతో పాటు పలు గల్ఫ్ దేశాలు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి బాటలు వేసినట్లే భావించాలి.

ఇక పశ్చిమాసియాలో మరో యుద్ధం కూడా జరుగుతోంది. సిరియాపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ – ఐసిస్ కు సిరియా ఆశ్రయమిస్తోన్న సంగతి తెలిసిందే. ఐసిస్, అల్ ఖైదా లాంటి సంస్థలు అమెరికాకు భారీ నష్టాన్నే కలిగించాయి. దీంతో ఈ సంస్థల అంతు చూసేంతవరకూ తాము నిద్రపోమని అమెరికా ప్రకటించింది. అందుకే ఈ టెర్రరిస్టు సంస్థల జాడ ఎక్కడున్నా అక్కడ అమెరికా దాడులు చేస్తోంది. అందులో భాగంగానే సిరియాలో ఉంటున్న ఐసిస్ తీవ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గత రెండు నెలలుగా యుద్ధం చేస్తోంది.

ఇక రష్యా – ఉక్రెయిన్ వార్ గురించి అందరికీ తెలిసిందే. రెండేళ్లు దాటినా ఈ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పట్లో ఆగే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. నాటోలో ఉక్రెయిన్ చేరికను నిరసిస్తూ ఆ దేశంపై రష్యా యుద్ధానికి దిగింది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ లో సైనిక చర్య చేపట్టింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు వైపులా వేలాది మంది సైనికులు చనిపోయారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అయినా ఇరు దేశాలూ వెనక్కు తగ్గట్లేదు. రష్యా ముందు ఉక్రెయిన్ చేతులెత్తేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ కు అమెరికా, నాటో దేశాలు మద్దతుగా నిలిచాయి. దీంతో ఈ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని నిరసిస్తూ అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయినా రష్యా లెక్క చేయట్లేదు. ఇప్పుడు రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా రంగంలోకి దిగింది.

ఉత్తర కొరియా – దక్షిణ కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం మనకు తెలుసు. నిత్యం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక నియంత. అతని నియంతృత్వాన్ని గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి కిమ్ కు రష్యా ప్రధాన మద్దతుదారుగా ఉంది. కిమ్ కూడా రష్యా కోసం తన వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా పెద్ద ఎత్తున సైన్యాన్ని కోల్పోయింది. దీంతో రష్యాకోసం ఉత్తరకొరియా 1500 మంది సైన్యాన్ని పంపించిందని సమాచారం. అంతేకాదు రష్యాకు కిమ్ ఆయుధాలను కూడా పెద్ద ఎత్తున పంపిస్తున్నారని దక్షిణ కొరియా ఆరోపించింది. రష్యాకు ఉత్తర కొరియా సైన్యాన్ని, ఆయుధాలను పంపడాన్ని దక్షిణ కొరియా తీవ్రంగా ఆక్షేపించింది. మరోవైపు ఉత్తర కొరియాపై దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. చెత్త బెలూన్లను ఆ దేశంపైకి వదలడం, ఆ దేశ రహదారులను ధ్వంసం చేయడం.. లాంటివి చేస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితులు ఏ క్షణమైనా యుద్ధానికి దారి తీయొచ్చు.

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మరో అంశం చైనా – తైవాన్ మధ్య యుద్ధం. తైవాన్ ను ఎలాగైనా లాక్కోవాలనే పట్టుదలతో ఉంది చైనా. తైవాన్ సార్వభౌమత్వాన్ని చైనా అంగీకరించట్లేదు. తైవాన్ తమదేనంటోంది చైనా. కాదు తమది స్వతంత్ర దేశమంటోంది తైవాన్. దీంతో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. తైవాన్ ను ఎలాగైనా తమలో విలీనం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఆ దేశం చుట్టూ నిత్యం సైనిక విన్యాసాలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తమపై యుద్ధానికి చైనా రిహార్సల్స్ చేస్తోందని తైవాన్ ఆందోళన చెందుతోంది. అయితే తైవాన్ కు అమెరికా అండగా నిలుస్తోంది.

ఇలా చెప్పుకుంటూ పోతో ప్రపంచంలో ప్రతీ రెండు దేశాల మధ్య ఏదో ఒక సమస్య ఉంది. దీంతో చాలా దేశాల మధ్య పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. వాటికి మద్దతుగా మరికొన్ని దేశాలు కూడా ఇందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంటరవుతున్నాయి. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతున్నాయనే భయం మొదలైంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలువురు జ్యోతిష్యులు కూడా 2025 నాటికి ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు. వాళ్ల మాట నిజమవుతాయేమో అని అందరిలోనూ టెన్షన్ మొదలైంది.