ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి ఎక్కడా తావులేకుండా పాలన అందిస్తున్నామని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యనించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలే కాదు ఇయ్యని హామీలు కూడా అమలు జరిపామని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో కూడా సంక్షేమం అందించాం.. కోట్లాది మందికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నాం అంటూ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టిలకు సీఎం జగన్ ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని తెలిపారు.
Read Also: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి ఆత్మహత్య
ఇక, 2014 నుంచి 2019 వరకు దోపిడి ప్రభుత్వం నడిచింది అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. బీసీలంటే బ్లాక్ వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అంటూ ఏలూరులో సీఎం జగన్ చెప్పారు అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ర్టాలలో కూడా ఇన్ని పథకాలు, పదవులు బీసీలకు అందలేదు అని పేర్కొన్నారు. మంత్రి పదవులు, ఎమ్మెల్సీలలో కూడా అత్యధికంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలకే 70 శాతానికి పైగా అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు ఏం చేశాం.. అన్నది తెలియ చెప్పడానికే సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర చేపడుతున్నాట్లు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు తాము మీ ముందుకు వస్తున్నాట్లు ఆయన అన్నారు.