Site icon NTV Telugu

YS Jagan: జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌ ఘటనపై స్పందించిన జగన్‌.. సంచలన వ్యాఖ్యలు..

Ys Jagan On Mla Sridhar

Ys Jagan On Mla Sridhar

YS Jagan: రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ జంగిల్‌రాజ్‌గా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు, మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. బరితెగింపునకు అడ్డుకట్ట లేకుండా పోయింది. విచ్చలవిడితనం ఊహించని స్థాయికి చేరింది అంటూ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి దిగజారారో అర్థం కావడం లేదని విమర్శించారు.

రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, భయపెట్టాడని ఆరోపించారు వైఎస్‌ జగన్‌… అలాగే ఆముదాలవలస ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, సత్యవేడు ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేసి అధికార బలంతో కేసును క్లోజ్ చేయించుకున్నారని జగన్ పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళను అరెస్టు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సుల వ్యవహారాన్నీ ఆయన ప్రస్తావించారు. ఇక, చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తయ్యాయని, మూడు బడ్జెట్లు పెట్టినా ప్రజలకు ఒక్క మంచిపని కూడా జరగలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ప్రతి హామీని అమలు చేశామని గుర్తుచేశారు. కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఏ పథకాన్నీ నిలిపివేయలేదన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దయ్యాయని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అబద్ధాలని తేలిపోయాయని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల నుంచీ మద్యం వరకు ప్రతి రంగంలోనూ మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశామని, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయని జగన్ తెలిపారు. కానీ చంద్రబాబు రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని ప్రశ్నించారు. “దోచుకో–పంచుకో–తిను” అన్న విధానమే ప్రస్తుతం నడుస్తోందని ఆరోపించారు జగన్..

ఇసుక, మద్యం, ఖనిజాల రంగాల్లో విస్తృత అవినీతి జరుగుతోందని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం చంద్రబాబు మరియు ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తోందన్నారు. బెల్టుషాపులు, మద్యం షాపులు అధికార పార్టీ నేతల ఆధీనంలో ఉన్నాయని విమర్శించారు జగన్.. గత ఎనిమిది త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు చదువులు మానేస్తున్నారని, వసతి దీవెన నిధులు విడుదల కాలేదన్నారు. గోరుముద్ద పథకంలో నాణ్యత లోపించడంతో హాస్టళ్లలో కల్తీ ఆహారం వల్ల ప్రాణాలు పోతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైందని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, యూరియా కూడా అందుబాటులో లేదన్నారు. రాబోయే కాలంలో ప్రజల మధ్యే ఉంటూ 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతానని జగన్ ప్రకటించారు. గ్రామస్థాయిలో పార్టీ కమిటీలను బలోపేతం చేస్తామని, జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని స్పష్టం చేశారు. “ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ తన్నినట్టు తంతారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌..

Exit mobile version