NTV Telugu Site icon

YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఆదాయమే ఆదాయం! వారికి మాత్రం నో ఛాన్స్

Youtube

Youtube

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘యూట్యూబ్‌’ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కంటెంట్‌ క్రియేటర్ల ఆదాయాన్ని పెంచే దిశగా ‘షాపింగ్ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించింది. దాంతో అర్హులైన క్రియేటర్లు తమ వీడియోలు, షార్ట్‌లు సహా లైవ్ స్ట్రీమ్‌లలో ఉత్పత్తులను ట్యాగ్‌ చేసి.. ఆదాయంను సంపాదించుకోవచ్చు. దీనికోసం ఇ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది.

షాపింగ్ ప్రోగ్రామ్‌ను దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాల్లో యూట్యూబ్‌ గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవల్ని మరిన్ని దేశాలకు విస్తృతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా భారత్‌లో లాంచ్‌ చేసింది. షాపింగ్ ప్రోగ్రామ్‌ ఫీచర్‌ని ఎనేబల్‌ చేసుకొనేందుకు వీడియో క్రియేటర్లు ముందుగా యూట్యూబ్‌ షాపింగ్‌లో సైనప్‌ అవ్వాలి. మీ అప్లికేషన్‌ ఆమోదం పొందాక ఈ సదుపాయాన్ని యాక్సెస్‌ చేయొచ్చు. అప్‌లోడ్‌ చేసే వీడియోలు, షార్ట్‌లు, లైవ్‌ స్ట్రీమ్‌లో ఉత్పత్తులను ట్యాగ్‌ చేయొచ్చు. యూజర్లు పక్కనే ఉన్న షాపింగ్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే.. ఆ ప్రొడక్ట్‌ వివరాలు కనిపిస్తాయి. వేరే బ్రౌజర్‌ పేజ్‌కు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి. నచ్చిన ప్రొడక్ట్‌ని పిన్‌ కూడా చేసుకోవచ్చు.

Also Read: Google Photos: గూగుల్‌ ఫొటోస్‌లో కొత్త ఫీచర్‌.. ఇక ఆ సమస్యకు చెక్!

యూట్యూబ్‌ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం అయిన కంటెట్‌ క్రియేటర్లకు మాత్రమే షాపింగ్ ప్రోగ్రామ్‌ సదుపాయం ఉంటుంది. 10 వేల మంది కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉండాలి. అయితే పిల్లల కోసం ఛానళ్లు నడుపుతున్న వారికి, మ్యూజిక్‌ ఛానళ్లు నడిపే వారికి ఈ సదుపాయం ఉండదని యూట్యూబ్‌ తెలిపింది. ప్రమోట్‌ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే.. క్రియేటర్లకు కమీషన్‌ వస్తుంది. ఐటమ్స్ ట్యాగ్‌ చేసే సమయంలోనే కమీషన్‌ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఒక వీడియోకు దాదాపు 30 ఐటమ్స్ ట్యాగ్‌ చేసుకోవచ్చని యూట్యూబ్‌ పేర్కొంది.