New Year January 1 History: న్యూ ఇయర్ వేడుకలు డిసెంబర్ 31 రాత్రి నుంచి ప్రారంభం అయ్యి, అర్ధరాత్రి 12 గంటలకు తారా స్థాయికి చేరుకుంటాయని మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆలోచించారా.. జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలు ఎందుకు జరుపుకుంటారో అని.. వాస్తవానికి కొత్త సంవత్సరం అనేది ఒక సంవత్సరం ముగింపు తరువాత తిరిగి సరికొత్త ఏడాది ప్రారంభం రోజున జరుపుకునే ఒక వేడుక. ప్రస్తుతం వాడుకలో ఉన్న క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్ 31 తో పాత సంవత్సరం ముగిసిపోయి.. జనవరి 1తో సరికొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. ఇంతకీ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా మొదలు అయ్యాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: BJP Leader: షారూఖ్ ఖాన్ ‘‘దేశద్రోహి’’.. బంగ్లా బౌలర్ కొనుగోలుపై బీజేపీ నేత విమర్శలు..
న్యూ ఇయర్ వేడుకల వెనుక ఉన్న స్టోరీ..
ప్రస్తుతం మనం వాడుతున్న క్యాలెండర్ మొట్ట మొదటిసారి ఎప్పుడు వాడుకలోకి వచ్చిందో తెలుసా.. క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో. జూలియస్ సీజర్ అనే ఆయన జూలియన్ క్యాలెండర్‌ను ఫర్ ది ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు. ఈ క్యాలెండర్‌ను ఆయన సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా రూపొందించాడు. అయితే మనోడికి ఒక సమస్య వచ్చింది. అది ఏమిటంటే క్యాలెండర్‌ను ప్రవేశపెట్టేప్పుడు సంవత్సరాన్ని మొదలు పెట్టే రోజును, నెలను ఎంచుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి రోమన్లకు జనవరి నెల చాలా విశేషమైంది. నిజానికి జనస్ దేవత పేరిట వచ్చి నెల జనవరి అని ఒక నమ్మకం ఉంది.
రోమన్లు పూజించే జనస్ దేవతకు రెండు తలలు ఉంటాయి. అలాగే ఈ దేవతకు, జనస్ అనే పేరుతో పాటు ప్రారంభాల దేవత అని కూడా పేరు ఉంది. అందుకే జూలియస్ సీజర్ తన క్యాలెండర్‌కు ప్రారంభ నెలగా జనవరి నెలను ఎంచుకున్నారు. అలా క్యాలెండర్లో ప్రారంభ నెలగా జనవరి ఏర్పడింది. అయితే క్రీస్తుశకం 5వ శతాబ్దంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై వారి స్థానంలోకి క్రైస్తవం అధికారంలోకి వచ్చింది..
అలా అధికారంలోకి వచ్చిన క్రైస్తవులు అప్పట్లో జనవరి 1వ తేదీని అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు. నిజానికి కొత్త ఏడాదిగా చాలా క్రైస్తవ దేశాలు మార్చి 25వ తేదీ ఉండాలని కోరుకున్నాయి. కానీ పోప్ 13వ గ్రెగొరీ 16వ శతాబ్దంలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. నాటి నుంచి క్రైస్తవ దేశాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు జనవరి 1న జరిగేవి. అయితే క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది. కానీ 1752లో ఆ దేశ పార్లమెంటు Calendar Act చట్టం తీసుకొచ్చి, ఐరోపాతో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి. అందుకే ప్రతి ఏటా డిసెంబరు 31వ తేది రాత్రి నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలు అవుతాయి. ప్రజలందరూ వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలు చేసుకుంటూ రాత్రి 12 గంటలకు ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
