అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులోనే అరంగేట్రం చేసిన ఆటగాడు అనగానే అందరూ నేడు అరంగేట్రం చేసిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సూర్యవంశీ కంటే ముందే కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టి, ఇప్పటికీ చెదరని ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచిన ఒక దిగ్గజ ఆటగాడు ఉన్నాడు.
ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఘనత పాకిస్థాన్‌కు చెందిన హసన్ రజా పేరిట ఉంది. ఆయన 1996లో జింబాబ్వేపై ఫైసలాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 ఏళ్ల 227 రోజుల వయస్సులోనే బరిలోకి దిగి ఈ అద్భుత ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. తాజాగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానాన్ని, అలాగే అత్యంత చిన్న వయస్సులో అరంగేట్రం చేసిన భారతీయ ఆటగాడిగా సరికొత్త చరిత్రను లిఖించాడు. వైభవ్ కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయస్సులోనే ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం విశేషం.
దీనికంటే ముందు భారత్ తరఫున ఈ రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 1989లో పాకిస్థాన్‌పై కరాచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 16 ఏళ్ల 205 రోజుల వయస్సులో అరంగేట్రం చేయగా, అదే ఏడాది వన్డేల్లో 16 ఏళ్ల 238 రోజుల వయస్సులో ఆడాడు. అలాగే టీ20ల పరంగా చూస్తే భారత్ తరఫున 2017లో శ్రీలంకపై 18 ఏళ్ల 80 రోజుల వయస్సులో బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకు అత్యంత చిన్న వయస్కుడిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు వైభవ్ ఆ రికార్డులన్నింటినీ తిరగరాశాడు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో పూర్తి స్థాయి జట్లను పరిశీలిస్తే.. హసన్ రజా, వైభవ్ సూర్యవంశీల తర్వాత బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫ్ 2001లో జింబాబ్వేపై 15 ఏళ్ల 116 రోజుల వయస్సులో, పాకిస్థాన్‌కు చెందిన ముస్తాక్ మహ్మద్ 1959లో వెస్టిండీస్‌పై 15 ఏళ్ల 124 రోజుల వయస్సులో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత స్థానాల్లో పాకిస్థాన్‌కు చెందిన ఆకిబ్ జావేద్ (16 ఏళ్ల 127 రోజులు), సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయస్కుడిగా హసన్ రజా రికార్డు పదిలంగా ఉన్నప్పటికీ, భారత క్రికెట్ పరంగా మాత్రం సచిన్ సుదీర్ఘకాల రికార్డును వైభవ్ సూర్యవంశీ అధిగమించడం విశేషం.

