Zaheer Khan Reacted on Ishant Sharma Statement You Are Ended My Career: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్లిప్, మిడాన్, మిడాఫ్, సర్కిల్, బౌండరీ.. ఎక్కడ ఫీల్డింగ్ చేసినా బంతిని అస్సలు వదలదు. బౌండరీల వద్ద రన్నింగ్ చేస్తూ క్యాచ్‌లు పట్టడం ఇప్పటికే మనం ఎన్నో చూశాం. అలాంటి కోహ్లీ కీలకమైన క్యాచ్‌ను చేజార్చాడు. ఆ క్యాచ్‌ను వదిలేయడంతో ఓ బ్యాటర్.. హాఫ్ సెంచరీ, సెంచరీ కాదు ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఇదంతా 2014లో జరిగింది. ఇప్పుడు ఆ క్యాచ్ గోల ఎందుకు అనుకుంటున్నారా?.. భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఇటీవల ఆ క్యాచ్ గురించి ప్రస్తావించడం, దానిపై మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పదించడం జరిగింది.
వెస్టిండీస్, భారత్ రెండో టెస్టు సందర్భంగా ఇషాంత్ శర్మ మాట్లాడుతూ… ‘2014లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లాం. రెండో టెస్టులో బ్రెండన్ మెక్‌కల్లమ్ 300లకు పైగా స్కోరు చేశాడు. మొహ్మద్ షమీ బౌలింగ్‌లో మెక్‌కల్లమ్ 9 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ నేలపాలు చేసాడు. దీంతో మెక్‌కల్లమ్.. జహీర్, నా బౌలింగ్‌లో భారీగా రన్స్ చేశాడు. దాంతో చాలాసార్లు జహీర్‌కు విరాట్ సారీ చెప్పాడు. మూడో రోజు టీ సమయంలోనూ కోహ్లీ మరోసారి క్షమాపణలు చెప్పడంతో.. ‘నువ్వు నా కెరీర్‌ను ముగించావ్’ జహీర్ అన్నాడు’ అని సరదాగా అన్నాడు.
టెస్టు తర్వాత జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఇషాంత్ శర్మ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తాజాగా జహీర్ ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. తాను అలా అనలేదని పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లీతో నేను అలా అనలేదు. టెస్టు కెరీర్‌లో అప్పటివరకు ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే క్యాచ్ మిస్ అయ్యాక ట్రిపుల్ సెంచరీ సాధించారని చెప్పా. గ్రాహం గూచ్ క్యాచ్‌ను కిరణ్ మోరె వదిలేయడంతో 300 స్కోరు చేయగా.. ఆ తర్వాత మెక్‌కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ చేజార్చడంతో 300 స్కోర్ బాదాడు. అయితే ఈ క్యాచ్‌ను వదిలేసిన తర్వాత కోహ్లీ చాలా నిరాశకు గురయ్యాడు. సరిగ్గా మాట్లాడలేకపోయాడు’ అని జహీర్ చెప్పుకొచ్చాడు.
2014లో న్యూజిలాండ్ టూర్‌కు భారత్ వెళ్లింది. ఈ టూర్‌లో భారత్ 5 వన్డేలు, 2 టెస్టులు ఆడింది. రెండు సిరీస్‌లనూ కివీస్ గెలిచింది. రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా.. డ్రాతో సరిపెట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ (6/51), మొహ్మద్ షమీ (4/70) దెబ్బకు కివీస్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 438 పరుగులు చేసి.. 246 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మెక్‌కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ చేజార్చాడు. 9 పరుగుల వద్ద ఔట్ అవ్వాల్సిన అతడు 302 పరుగులు చేశాడు. వాట్లింగ్ (124), జేమ్స్ నీషమ్ (137) శతకాలు చేయడంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 680/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. 435 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదో రోజు 166/3 స్కోరు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.