NTV Telugu Site icon

Kriya Yoga: పరమహంస యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలు ఇక తెలుగులో…

Yss

Yss

Paramahamsa Yogananda: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘ఒక యోగి ఆత్మకథ’ రచయిత పరమహంస యోగానంద 1917లో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా తెలుగువారికి శుభవార్తను అందించింది. యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాల (వైఎస్ఎస్ క్రియా యోగ) తెలుగు అనువాదాలు యోగదా సత్సంగ సొసైటీ (వైఎస్ఎస్) ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద, బ్రహ్మచారి కేదారానంద్ జీ ద్వారా విడుదలయ్యాయి.

ఈ విశేషాలను స్వామి స్మరణానంద తెలియచేస్తూ, ”జగద్గురువు పరమహంస యోగానంద విరచిత ‘ఒక యోగి ఆత్మకథ’ గ్రంథం 1946 డిసెంబరులో విడుదలైనప్పటి నుంచి నిరంతరంగా అత్యధికంగా అమ్ముడవుతోంది. దీని ద్వారా లక్షలాది మందికి యోగా, ధ్యానాన్ని పరమహంస యోగానంద పరిచయం చేశారు. ప్రాచీన యోగ విజ్ఞాన శాస్త్రం గురించి అలాగే ధ్యానానికి సంబంధించి చాలా కాలం నుంచి గౌరవింపబడుచున్న సాంప్రదాయానికి సంబంధించిన లోతైన పరిచయం కూడా ఈ గ్రంథంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆధ్యాత్మిక అన్వేషకులను వారి జీవితాల్లో సమతుల్యమైన దైవాన్నే కేంద్రంగా చేసుకుని జీవించే విధానాన్ని ఈ రచన ప్రేరేపించింది. పరమహంస యోగానంద అద్భుతమైన జ్ఞానం ఆయన అనేక రచనలు, ప్రచురణలలో వ్యక్తీకరించబడింది. ఆయన బోధనలలో అంతర్గతంగా క్రియాయోగ పవిత్ర శాస్త్రం, రాజయోగం యొక్క స్వరూపము ఉంది. ఇది శరీరం, మనస్సు రెండింటినీ నిశ్చలం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంద్రియ సంవేదనల సాధారణ కల్లోలం నుంచి ఒకరి శక్తిని, ధ్యాసను ఉపసంహరించుకోవడం సాధ్యపడుతుంది. ఆ అంతర్గత నిశ్చలతలో, భక్తులు గాఢమౌతున్న అంతర్గత శాంతిని అనుభవిస్తారు. వారి స్వీయ ఆత్మతో సామరస్యం పొందుతారు” అని చెప్పారు. ఇంతవరకూ ఆంగ్ల, హిందీలో ఉన్న వైఎస్ఎస్ క్రియా యోగ పాఠలను ఇటీవలే తమిళ, తెలుగు భాషలలోకి అనువదించామని తెలిపారు.

విశేషం ఏమంటే… ధాన్యం పట్ల ఆసక్తి ఉన్న వారికి దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించడం కోసం హైదరాబాద్, బేగంపేటలోని యోగదా సత్సంగ ధ్యానకేంద్రంలో 11వ తేదీ సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో స్వామి స్మరణానంద ధ్యానం పట్ల ఆసక్తి ఉన్న వారి సందేహాలను నివృత్తి చేయబోతున్నారు.