Site icon NTV Telugu

Yashasvi Jaiswal: గిల్‌ కారణంగానే డబుల్ సెంచరీ మిస్.. యశస్వి జైస్వాల్ ఏమన్నాడంటే?

Yashasvi Jaiswal Runout

Yashasvi Jaiswal Runout

ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ మిస్ అయ్యాడు. డబుల్ సెంచరీకి చేరువ అవుతున్న తరుణంలో కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ కారణంగానే రనౌట్ అయ్యాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గిల్‌ ముందుగా పరుగు తీయడానికి ఓకే అని.. తర్వాత వెనక్కి వెళ్లడంతో యశస్వి రనౌట్‌ అయిపోయాడు. దీంతో గిల్‌పై జైస్వాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తప్పంతా గిల్‌దే అంటూ ఫాన్స్, మాజీలు ఫైర్ అయ్యారు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం తన రనౌట్‌పై యశస్వి స్పందించాడు.

రనౌట్‌ ఆటలో భాగమే అని, ఆ ఘటనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని యశస్వి జైస్వాల్ చెప్పాడు. ‘నేను ఎప్పుడూ వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తా. రనౌట్ ఆటలో భాగం. దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండో రోజు ఆట ప్రారంభంలో పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించింది. ఓ గంట క్రీజులో నిలదొక్కుకుంటే ఆ తర్వాత పరుగులు చేయొచ్చని అనుకున్నాం. నేను ఏం చేయగలను, జట్టు లక్ష్యం ఏంటి అని మైదానంలో ఆలోచిస్తా. వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేసేందుకే చూస్తాను’ అని యశస్వి తెలిపాడు. యశస్వి 258 బంతుల్లో 22 ఫోర్లతో 175 రన్స్ చేశాడు.

Also Read: Pawan Kalyan: లులూ మాల్ గొంతెమ్మ కోర్కెలు.. డిప్యూటీ సీఎం పవన్ అసంతృత్తి!

రెండోరోజు ఆటలో యశస్వి జైస్వాల్ మంచి జోష్‌లో కనిపించాడు. డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. ఇన్నింగ్స్‌ 92వ ఓవర్‌ రెండో బంతిని యశస్వి మిడాఫ్‌ వైపు షాట్ ఆడాడు. రన్ కోసం ముందుకు పరుగెత్తగా.. నాన్ స్ట్రైకర్ శుభ్‌మన్‌ గిల్ కూడా ముందుకు వచ్చాడు. వెంటనే నో అంటూ గిల్ వెనక్కి వెళ్లిపోయాడు. అప్పటికే యశస్వి సగం పిచ్‌ దాటేశాడు. తిరిగి క్రీజులోకి చేరుకునే లోపు కీపర్ వికెట్లను పడగొట్టేశాడు. దాంతో అతడు తీవ్ర అసహనంతో తలను చేతితో కొట్టుకుంటూ మైదానం బయటకు వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Exit mobile version