Site icon NTV Telugu

Yashasvi Jaiswal: యశస్వి సరికొత్త చరిత్ర.. తొలి బ్యాటర్‌గా రికార్డు! రోహిత్, సెహ్వాగ్‌కు కూడా సాధ్యం కాలే

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు సిక్సర్‌ బాదిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. జైస్వాల్ ఇప్పటివరకు మూడు సార్లు మొదటి బంతికే సిక్సర్‌ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సిక్సర్ బాదడంతో జైస్వాల్ ఖాతాలో ఈ ఫీట్ చేరింది. ఐపీఎల్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే మొత్తం ఎనిమిది మంది సిక్సర్ కొట్టినా.. మూడుసార్లు బాదిన ఏకైక క్రికెటర్ జైస్వాల్ మాత్రమే.

బెంగళూరు నిర్ధేశించిన 206 పరుగుల లక్ష్య ఛేదనకు రాజస్థాన్ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ను సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వేయగా.. తొలి బంతినే యశస్వి జైస్వాల్ సిక్సర్‌గా మలిచాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ విరుచుకుపడ్డాడు. మొత్తంగా 19 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్సర్ బాదడం డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలకు సైతం సాధ్యం కాలేదు.

Also Read: IPL 2025: రెండులో కోహ్లీ, హేజిల్‌వుడ్‌.. మూడులో ఆర్సీబీ!

ఐపీఎల్‌లో మొదటి బంతికే 8 మంది క్రికెటర్లు సిక్సర్లు బాదారు. యశస్వి జైస్వాల్‌ (3), నమన్‌ ఓజా (1), మయాంక్‌ అగర్వాల్‌ (1), సునీల్ నరైన్‌ (1), విరాట్‌ కోహ్లీ (1), రాబిన్‌ ఊతప్ప (1), ఫిల్‌ సాల్ట్‌ (1), ప్రియాన్ష్‌ ఆర్య (1)లు ఈ జాబితాలో ఉన్నారు.

 

Exit mobile version