108 కి.మీ రేంజ్, 16 ఇంచుల భారీ వీల్స్‌తో Yamaha Xenter E కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..!

Yamaha Xenter E Electric Scooter

Yamaha Xenter E Electric Scooter

Yamaha Xenter E Electric Scooter: భారత మార్కెట్‌లో సాధారణంగా చిన్న వీల్స్‌తో కూడిన స్కూటర్లే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే యూరప్, తూర్పు ఆసియా దేశాల్లో పెద్ద వీల్స్ ఉన్న స్కూటర్లకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా సరికొత్త బిగ్ వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ Xenter Eను ఆవిష్కరించింది. 2027లో యూరప్ మార్కెట్‌లో దీనిని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన పెట్రోల్ వెర్షన్ కాన్సెప్ట్‌ను కూడా యమహా ప్రదర్శించింది. అయితే దాని ఫీచర్లు, లాంచ్ వివరాలను వెల్లడించలేదు. ఈ రెండు వెర్షన్లను వియత్నాంలో తయారు చేయనున్నారు.

యమహా Xenter E స్కూటర్‌ను సింపుల్ డిజైన్‌తో రూపొందించింది. ఇందులో ప్రత్యేకమైన ఫ్రంట్ ఆప్రాన్, హెక్సాగనల్ ఆకారంలో ఉండే కాంపాక్ట్ హెడ్‌ల్యాంప్, నిలువుగా అమర్చిన DRL ఎలిమెంట్ ఉన్నాయి. స్టెప్-అప్ సీట్, తేలికైన ఫ్రంట్ ఫెండర్, వెనుకవైపు విశాలమైన ఫెండర్‌తో పాటు సైడ్ ప్యానెల్‌పై Xenter E బ్యాడ్జింగ్‌ కూడా ఇచ్చారు. ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణగా 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ నిలవనున్నాయి. వీటికి ముందు వైపు 100/80, వెనుక వైపు 120/80 టైర్లను అమర్చారు. గుంతలు, ట్రామ్ లైన్లు, రాళ్లతో కూడిన రోడ్లపై సాఫీగా ప్రయాణించేందుకు పెద్ద వీల్స్ ఉపయోగపడతాయి. అందుకే యూరప్‌లో ఇలాంటి స్కూటర్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. భారతదేశంలో మాత్రం ఈ అవసరాలను చాలావరకు మోటార్‌సైకిళ్లు తీరుస్తున్నాయి. ఇక్కడి స్కూటర్లలో సాధారణంగా 14 ఇంచుల వరకు మాత్రమే వీల్స్ కనిపిస్తాయి. Xenter E ప్లాటినమ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. దీనికి అవసరమైన పలు యాక్సెసరీలను కూడా యమహా ప్రకటించింది.

పనితీరు విషయానికి వస్తే, Xenter E 125cc పెట్రోల్ స్కూటర్‌కు సమానమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇందులో 3.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 108 కిలోమీటర్ల (67 మైళ్లు) రేంజ్ అందిస్తుంది. ఇందులో కొత్త eAxle ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో ఎయిర్ కూల్డ్ పర్మనెంట్ మాగ్నెట్ మోటార్, కంట్రోలర్, రిడక్షన్ గేర్‌ను ఒకే యూనిట్‌గా అనుసంధానించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 10 bhp పవర్, 33.35 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బెల్ట్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి శక్తి అందుతుంది. ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌తో పాటు సీటు కింద కొంత స్టోరేజ్ స్పేస్ అందించేందుకు L-ఆకారపు బ్యాటరీని ఏర్పాటు చేశారు. బ్యాటరీకి రక్షణగా ప్రత్యేక హౌసింగ్ ఇచ్చారు. ఇది IP67 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ పొందుతుంది.

Xenter Eలో 800 వాట్ల ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను అందించారు. పూర్తిగా ఖాళీ అయిన బ్యాటరీని 100% ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది. యమహా ప్రారంభించనున్న YOU Charge సబ్‌స్క్రిప్షన్ ద్వారా పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలను 2027 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ఆలోచనలో ఉంది. ఈ స్కూటర్‌లో కొత్త అండర్‌బోన్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. దీని సీట్ హైట్ 790 మి.మీ. ముందు భాగంలో 100 మి.మీ. ట్రావెల్ కలిగిన టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు 97 మి.మీ. ట్రావెల్‌తో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ముందు, వెనుక చక్రాలకు 245 మి.మీ. డిస్క్ బ్రేకులు, ABS అందించారు. ఇంకా రైడర్ల అవసరాలకు అనుగుణంగా S, T, E అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. S మోడ్ స్పోర్టీ రైడింగ్ కోసం, T మోడ్ రోజువారీ ప్రయాణాల కోసం, E మోడ్ గరిష్ట రేంజ్ పొందేందుకు ఉపయోగపడుతుంది. వీటితో పాటు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఎంచుకున్న రైడింగ్ మోడ్‌ను బట్టి దీని పనితీరు మారుతుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 5 ఇంచుల TFT డిస్‌ప్లేను అందించారు. బ్యాటరీ స్థితి, సర్వీస్ వివరాలు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, పార్కింగ్ లొకేషన్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. వీటితో పాటు USB Type-C ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ కీ ఇగ్నిషన్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి యమహా Xenter Eను యూరప్ మార్కెట్‌లో 2027లో విడుదల చేయనుంది. భారత్‌లో ఈ స్కూటర్ లాంచ్‌పై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి భారతీయ మార్కెట్‌లోకి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.