NTV Telugu Site icon

WPL 2024: నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్.. ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?

Mi Vs Rcb Eliminator

Mi Vs Rcb Eliminator

WPL 2024 Eliminator MI vs RCB Preview: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) సీజన్‌-2లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై.. టైటిల్‌ నిలబెట్టుకునే పనిలో ఉంది. తన చివరి మ్యాచ్‌లో ముంబైని ఓడించి ప్లేఆఫ్స్‌ చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్‌లోనూ ఇదే స్ఫూర్తితో ఆడాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్‌–18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముంబై ఇండియన్స్‌తో గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలీస్‌ పెర్రీపై ఆర్‌సీబీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పెర్రీ మరోసారి చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. ఫామ్‌లో ఉన్న రిచా ఘోష్‌, కెప్టెన్‌ స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, జార్జియా వేర్‌హామ్‌ రాణించడం కూడా బెంగళూరుకు కీలకం. మరోవైపు తన చివరి లీగ్‌ పోరులో బెంగళూరు చేతిలో ఓడినా ముంబైని తక్కువ అంచనా వేయలేం. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై పటిష్టంగా ఉంది. మాథ్యూస్, సజన, సీవర్‌ , అమెలియా, షబ్నిమ్‌, ఇషాక్ రాణిస్తే బెంగళూరును ఓడించడం పెద్ద కష్టం కాదు.

Also Read: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ మూడింట గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఫెవరెట్ అని చెప్పాలి. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్లో తలపడనుంది. ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్‌ 2024 లీగ్‌ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఒకవేళ ఎలిమినేటర్‌లో ముంబై గెలిస్తే 2023 ఫైనల్‌ పునరావృతం అవుతుంది.