NTV Telugu Site icon

Worm in Brain: షాకింగ్‌ న్యూస్.. మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు! కొండచిలువలో ఉండే

Worm In Brain

Worm In Brain

Pythons Worm found in Australian Woman’s Brain: షాకింగ్‌ న్యూస్.. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటీమీటర్ల పురుగు ఉంది. సజీవంగా మరియు మెలికలు తిరుగుతున్న ఆ పరాన్నజీవిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళకు శస్త్ర చికిత్స చేసి.. ఆ పరాన్నజీవిని బయటికి తీశారు. ప్రస్తుతం సదరు మహిళ కోలుకుంటోంది. ఈ షాకింగ్‌ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో చోటుచేసుకుంది. 8 సెంటీమీటర్ల పురుగుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే…

న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన 64 ఏళ్ల మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో సహా ఇతర సమస్యలతో బాధపడుతోంది. 2021లో ఆమె స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఎలాంటి మెరుగైన ఫలితం లేకపోయింది. 2022 నాటికి ఆమె మతిమరుపుతో సహా జ్వరం వంటి సమస్యలు అధికం అయ్యాయి. దీంతో కాన్‌బెర్రా ఆసుపత్రి వైద్యులు అన్ని పరీక్షలు చేసినా.. రిజల్ట్స్ మాత్రం నార్మల్‌గానే వచ్చాయి. చివరిగా ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయగా.. ఆ మహిళ మెదడులో ఉన్న పురుగు చూసి వైద్యులు కంగుతిన్నారు. ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పురుగుని తీసేశారు.

ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనే పరాన్నజీవి మహిళ మెదడులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది సాధారణంగా కొండచిలువ (పైథాన్‌) శరీరంలో ఉండే ఒక రకమైన పురుగని పరిశోధకులు అంటున్నారు. కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో ఆ మహిళ నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆ మహిళ వంట చేయడం కోసం కట్టెలు, ఆకుకూరలు వంటి వాటిని ఇంటికి తీసుకొచ్చేది. వాటిపై కొండచిలువ పాకడం లేదా మలం ద్వారా ఈ పురుగు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

Also Read: RCB Jersey: కోర్టు మెట్లెక్కిన ఆర్‌సీబీ.. ఆ సీన్‌ను మార్చేందుకు ఒప్పుకున్న ‘జైలర్’ టీమ్!

ఆకుకూరలు తిన్నప్పుడు లేదా మరో విధంగానో ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనే పరాన్నజీవి మహిళ శరీరంలోకి వెళ్లి.. మెదడులో తిష్ట వేసింది. అది ఏకంగా 8 సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగింది. దీని కారణంగా మహిళ విపరీతమైన వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యల బారిన పడింది. చివరకు పురుగును గుర్తించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి దానిని తీసేశారు. ఈ కేసు ప్రపంచంలోనే మొదటి సంక్రమణగా గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్‌ (జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు) వ్యాధులేనని వైద్యులు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ఇతర కేసులు గుర్తించబడే అవకాశం ఉందన్నారు.