World Economic Forum: ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) వేదికగా ఇండియా లాంజ్‌ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘నేషన్ ఫస్ట్’ అనే భావనతో అన్ని రాష్ట్రాలు, కేంద్రం కలిసి టీమ్ ఇండియాగా పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నా, దేశంగా మాత్రం అందరం ఒక్కటేనని స్పష్టం చేశారు.
Read Also: US Iran Tensions: అండర్‌గ్రౌండ్‌లోకి ఇరాన్ టాప్ లీడర్.. ట్రంప్ భయమే కారణామా?
ప్రస్తుతం భారత్ వేగంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని, ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానంగా భారత్ నిలిచిందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయన్నారు. మన దేశానికి బలమైన నాయకత్వం ఉందని, దేశ శక్తి సామర్థ్యాలను ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పామని చెప్పారు. అదే సమయంలో పటిష్టమైన వ్యవస్థల రూపకల్పన కూడా జరుగుతోందని పేర్కొన్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినా, అందరం భారత్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రాలుగా పోటీ పడుతున్నప్పటికీ, దేశంగా మాత్రం పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతున్నామని సీఎం వివరించారు. సంపద సృష్టితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళ్తోందో తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వచ్చే రెండేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, 2047 నాటికి అగ్రస్థానానికి చేరే లక్ష్యంతో ముందుకు సాగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
