పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వ విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిలు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. గుకేశ్‌కు విలక్షణ నటుడు కమల్ హాసన్ శుభాకాంక్షలు చెప్పారు.
‘చరిత్రకు చెక్‌మేట్ పడింది. చదరంగంలో కొత్త అధ్యయనాన్ని లిఖించిన డి గుకేశ్‌కు అభినందనలు. భారతదేశం మొత్తం గర్వంతో ఉప్పొంగిపోతోంది. చివరి గేమ్‌లో ప్రత్యర్థిపై ప్రశాంతంగా ఉండి అద్భుతంగా ఆడడం నీ ధైర్యాన్ని తెలియజేస్తోంది’ అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ‘గుకేశ్ నీకు పెద్ద సెల్యూట్. నువ్వు ఓ అద్భుతం. నీ ప్రయాణంలో ఇంకా ఎన్నో అద్భుత విజయాలు అందుకోవాలి’ అని ఎన్టీఆర్ ట్వీటారు.
Also Read: D Gukesh: ఇప్పుడే మొదలైంది.. ఇంకా చాలా ఉంది: గుకేశ్
‘నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. ఎంత అద్భుతంగా ఎత్తులు వేశావు. భారత్ మొత్తం నిన్ను చూసి గర్విస్తోంది. 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ సాధించావ్. చరిత్రలో ఛాంపియన్‌షిప్ సాధించిన రెండో భారతీయుడు. చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్‌గా మారావు. మేరా భారత్ మహాన్’ అని చిరంజీవి పేర్కొన్నారు. ‘అభినందనలు గుకేశ్. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించావ్. ప్రపంచ వేదికపై భారతదేశం గర్వించేలా చేశావు. జైహింద్’ అని ఎస్‌ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు.