ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మంగళవారం గ్రూప్-2 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ తన సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, వరుసగా మూడో ఓటమితో స్కాట్లాండ్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
ఇజీ షార్ప్, బ్రూక్ హ్యాలీడే అద్భుత భాగస్వామ్యం..
స్కాట్లాండ్ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. కేవలం 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే.. ఇజీ షార్ప్ (43 బంతుల్లో 62 పరుగులు; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించడంతో పాటు బ్రూక్ హ్యాలీడే (38 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు) తో కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 101 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరి వీరోచిత పోరాటంతో న్యూజిలాండ్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. స్కాట్లాండ్ బౌలర్లలో కాథరిన్ బ్రైస్, రాచెల్ స్లేటర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ గ్రూప్-2లో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
డార్సీ కార్టర్ ఒంటరి పోరాటం..
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ డార్సీ కార్టర్ (52 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 72 నాటౌట్) ఒంటరి పోరాటం చేసింది. మరో ఓపెనర్ కాథరిన్ ఫ్రేజర్ (7) తో కలిసి మొదటి వికెట్‌కు 51 పరుగులు జోడించిన డార్సీ, ఆ తర్వాత సారా బ్రైస్ (25) తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపింది. అయితే మిగిలిన బ్యాటర్లు రాణించలేకపోయారు.
మేలీ కెర్ మ్యాజిక్ బౌలింగ్..
న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ మేలీ కెర్ తన లెగ్ స్పిన్ మ్యాజిక్‌తో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ను కట్టడి చేసింది. ఇందులో 19వ ఓవర్ మెయిడెన్ వికెట్ కావడం విశేషం. సోఫీ డివైన్ 2 వికెట్లు తీయగా, లియా తాహుహు ఒక వికెట్ సాధించి అంతర్జాతీయ టీ20ల్లో తన 100వ వికెట్ మైలురాయిని అందుకుంది.

