NTV Telugu Site icon

T20 World Cup 2024: నేటి నుంచే టీ20 ప్రపంచకప్‌.. తొలి పోరులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్‌ ఢీ!

Womens T20 World Cup 2024

Womens T20 World Cup 2024

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా టీ20 ప్రపంచకప్‌ 2024కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి యూఏఈలో మహిళల పొట్టి కప్పు మొదలవుతోంది. గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను స్కాట్లాండ్‌ ఢీకొంటోంది. మరో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక తలపడతాయి. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుండగా.. రెండో మ్యాచ్ రాత్రి 7.30కి ప్రారంభం కానుంది. స్టార్‌ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రపంచకప్‌ మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ఆరుసార్లు ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. తొలిసారి విశ్వ విజేతగా నిలవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే గ్రూప్‌-ఎలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లను హర్మన్ సేన ఢీ కొట్టాల్సి ఉంది. టీ20ల్లో ఆస్ట్రేలియా హవా నడుస్తోంది. మిగతా జట్లతోనూ అంత తేలిక కాదు. కాబట్టి గ్రూప్‌ దశలో టాప్‌-2లో నిలవాలంటే.. భారత్ నిలకడగా ఆడాల్సిందే. భారత జట్టు ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉండడం మనకు కలిసొచ్చే అంశం. హర్మన్‌ప్రీత్‌, మంధాన, షెఫాలి, జెమీమా, రిచా లాంటి బ్యాటర్లు.. దీప్తి, పూజ, రేణుక, అరుంధతి, రాధ, ఆశలతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పోటీపడుతున్న 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ దశలో ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశ ముగిసేసరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేసురుకుంటాయి. గ్రూప్‌-ఎలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్లు ఉన్నాయి. ఈ మెగా టోర్నీ వాస్తవానికి బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ అక్కడ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో యూఏఈకి షిఫ్ట్ అయింది. టోర్నీ హక్కులు బంగ్లా వద్దనే ఉన్నాయి.

Show comments