Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!

  • 2025 నవంబర్ 2.
  • భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలుపు..
  • నేటితో ఏడాది పూర్తి..
Team India

Team India

Women Cricket World Cup 2025: భారత మహిళల క్రికెట్ చరిత్రలో 2025 నవంబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఈ సందర్భంగా బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను పంచుకుంది. “ఎంతో ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్.. కలల నుంచి గమ్యం వైపు సాగిన ఆ ప్రయాణం. మనం ఛాంపియన్లుగా నిలిచి ఏడాది పూర్తయ్యింది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోతో ప్రపంచకప్ విజయానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను మరోసారి అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. దీప్తి శర్మ 58 పరుగులు సాధించింది. స్మృతి మంధాన 45 పరుగులతో రాణించింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీతో పోరాడింది. ఆమె 101 పరుగులు చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. 45.3 ఓవర్లలో 246 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటైంది. దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. షఫాలీ వర్మ రెండు వికెట్లు తీయగా, శ్రీ చరణి ఒక వికెట్ సాధించింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీని అందించడమే కాకుండా భారత్ లో మహిళల క్రికెట్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎంతోమంది యువతులకు క్రికెటర్ కావాలనే కలను నిజం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ఈ విజయం అందించింది. ఏడాది గడిచినా ఆ చారిత్రక క్షణాల జ్ఞాపకాలు అభిమానుల్లో ఇంకా తాజాగా ఉన్నాయి.