America Winchester Haunted House: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌జోస్ నగరంలో ఉన్న వించెస్టర్ హాంటెడ్ హౌస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ భవనం వెనుక దాగి ఉన్న కథ, అనేక రహస్యాలు, అనుభవాలు, అసాధారణ సంఘటనలతో నిండి ఉంటుంది. ఈ భవనాన్ని “వించెస్టర్ మిస్టరీ హౌస్”గా కూడా పిలుస్తారు. ఇది అమెరికన్ గన్ తయారీ సంస్థ “వించెస్టర్ రిపీటింగ్ ఆర్మ్స్ కంపెనీ” వారసురాలు సారా వించెస్టర్ నిర్మించింది. సారా భర్త విలియం వించెస్టర్ గన్ కంపెనీ యజమాని. ఈ సంస్థ తయారు చేసిన తుపాకులతో వేలాది మంది మరణించారని చెబుతారు. భర్త, కుమార్తె ఇద్దరినీ కోల్పోయిన సారా తీవ్రమైన మానసిక ఆవేదనలో పడింది. ఆ సమయంలో ఆమె ఒక ఆధ్యాత్మిక సలహాదారుణ్ని సంప్రదించింది. తన భర్త తయారు చేసిన తుపాకుల వల్ల చనిపోయిన వ్యక్తుల ఆత్మలు తనను వెంటాడుతున్నాయని, ఆ ఆత్మల నుంచి తప్పించుకోవాలంటే ఎప్పటికీ నిర్మాణం పూర్తి కాని ఓ ఇల్లు కట్టాలని చెప్పాడట.
దాంతో సారా 1884లో కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి, 38 సంవత్సరాల పాటు ఆ ఇంటిని నిర్మి్స్తూనే ఉండిపోయింది. 1922లో ఆమె మరణించే వరకు ఆ నిర్మాణం ఆగలేదు. ఈ ఇంటి నిర్మాణం విశేషంగా ఉంటుంది. దారితప్పించే మెట్లు, ఎక్కడికీ వెళ్లాలో తెలియని తలుపులు, గోడల్లో మూసుకుపోయే మార్గాలు, అర్థ రహిత గదులు ఉన్నాయట.. మొత్తం మీద ఈ భవనంలో 160 గదులు, 40 మెట్లు, 2 బేస్మెంట్లు, 10,000 కిటికీలు ఉన్నాయని చెబుతారు. స్థానికులు ఈ ఇంటిని “శాపగ్రస్త భవనం”గా భావిస్తారు. రాత్రివేళల్లో అక్కడ విచిత్రమైన శబ్దాలు, తలుపులు స్వయంగా తెరుచుకోవడం, మెట్లపై అడుగుల శబ్దాలు వినిపించడం వంటి సంఘటనలు తరచూ జరుగుతాయని చెబుతారు. అక్కడ పనిచేసిన కార్మికులు, తరువాత ఈ భవనాన్ని సందర్శించిన పర్యాటకులు కూడా విచిత్రమైన అనుభవాలను పంచుకున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ వించెస్టర్ హౌస్ అమెరికాలో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ ఇంటిని సందర్శిస్తారు. దాని ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. ఆ భవనంలో దాగి ఉన్న రహస్యాలు, భయం, ఆత్మల కథలు ఇంకా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి.
READ MORE: Priyanka Gandhi: ఓట్ల చోరీపై గాంధీలాంటి పోరాటం చేస్తున్నాం.. బీహార్ ర్యాలీలో ప్రియాంకాగాంధీ వ్యాఖ్య
