Site icon NTV Telugu

AI ఉద్యోగులను తొలగిస్తుందా..? కొత్త అవకాశాలు సృష్టిస్తుందా..? సంచలన నివేదిక..

Ai

Ai

ఇప్పుడంతా ఏఐ.. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ.. అసలు ఏదో.. ఐఏ క్రియేట్‌ చేసింది ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. మొత్తంగా ఏఐ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ మార్పులతో పాటు అందరిలోనూ ఒకే ప్రశ్న తలెత్తుతోంది.. AI మన ఉద్యోగాలను నాశనం చేస్తుందా? లేక కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందా? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.. అయితే, ఈ ప్రశ్నకు స్పష్టతనిచ్చేలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) తాజాగా విడుదల చేసిన ‘Future of Jobs Report 2025’ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

AI ప్రభావం అన్ని రంగాలపై..!
బ్యాంకింగ్‌, ఐటీ, విద్య, ఆరోగ్యం నుంచి తయారీ రంగం వరకు AI వేగంగా విస్తరిస్తోంది. పని విధానాలు మారుతున్నాయి, నైపుణ్యాల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల్లో అనిశ్చితి పెరిగిందన్న ఆందోళన సహజమే. అయితే WEF నివేదిక ప్రకారం, AI ఒకవైపు కొన్ని ఉద్యోగాలను తగ్గిస్తూనే, మరోవైపు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించనుంది.

డేటా ఆధారిత నివేదిక
ఈ నివేదిక కేవలం అంచనాలపై కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, ప్రభుత్వాలు, పరిశ్రమల నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించబడింది. రాబోయే సంవత్సరాల్లో ఉద్యోగ మార్కెట్ ఎలా మారబోతుందో దీనిలో వివరంగా పేర్కొన్నారు. వ్యాపార వర్గాలు, నాయకుల అభిప్రాయాలు సేకరించారు.. WEF సర్వేలో పాల్గొన్న వారిలో.. 54 శాతం మంది AI వల్ల కొన్ని ఉద్యోగాలు మాయమవుతాయని భావిస్తున్నారు. 24 శాతం మంది AI కొత్త ఉపాధి అవకాశాలకు కారణమవుతుందని చెబుతున్నారు. ఇక, 45 శాతం మంది అయితే, AI పనిని వేగవంతం చేసి, సంస్థల లాభాలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. అంటే, AIను ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూస్తున్నవారూ గణనీయంగా ఉన్నారు. మరోవైపు.. 2030 నాటికి ఉద్యోగాల భవిష్యత్ – 4 అంశాలను WEF నివేదికలో AI ప్రభావంపై నాలుగు సంభావ్య దృశ్యాలను వెల్లడించారు.

వేగవంతమైన మార్పు:
AI వేగంగా అభివృద్ధి చెంది, పాత ఉద్యోగాలు తగ్గినా, కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అయితే ఈ మార్పును అందుకోవడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతుంది.

ఉద్యోగ నష్ట ప్రమాదం:
ప్రజలు AIకి అనుగుణంగా మారలేకపోతే, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఎక్కువ.

అవకాశంగా మారిన AI:
శిక్షణ, డిజిటల్ నైపుణ్యాల్లో ముందున్న దేశాలు, సంస్థలు AI ద్వారా లాభపడతాయి. కొత్త ఉద్యోగాలు వేగంగా సృష్టించబడతాయి.

నిలిచిపోయిన పురోగతి:
సరైన నైపుణ్యాలు లేకపోతే AI ప్రయోజనాలు పరిమితమవుతాయి. AIపై పట్టు ఉన్న సంస్థలకే లాభాలు దక్కుతాయి.

భవిష్యత్తుకు ఎలా సిద్ధపడాలి?
WEF సూచనల ప్రకారం.. చిన్నగా ప్రారంభించి, వేగంగా అభివృద్ధి చెందాలి.. సాంకేతికతతో పాటు నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలి.. మానవులు – AI కలిసి పనిచేసే విధానంపై దృష్టి పెట్టాలి.. డేటా, డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి.. భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాలను ముందుగానే నేర్చుకోవాలి అని సూచించింది.. అంటే, AI ఉద్యోగాలను పూర్తిగా నాశనం చేయదు. కానీ, మార్పుకు సిద్ధంగా లేని ఉద్యోగాలను మాత్రం తప్పక మార్చేస్తుంది. AIని భయపడకుండా, దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుంటే, భవిష్యత్తులో కొత్త అవకాశాలు తప్పకుండా దక్కుతాయని WEF నివేదిక స్పష్టం చేస్తోంది.

Exit mobile version