NTV Telugu Site icon

Andre Russell: 3 వికెట్లు, 29 పరుగులు.. రీఎంట్రీలో అదరగొట్టిన ఆండ్రీ రసెల్‌!

Andre Russell Re Entry

Andre Russell Re Entry

Andre Russell returns in style as West Indies beat England in 1st T20: వెస్టిండీస్‌ క్రికెటర్‌, హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌ జాతీయ జట్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్‌ తరఫున బరిలోకి దిగిన రసెల్‌.. బ్యాట్, బంతితో మెరిశాడు. రసెల్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌తో తొలి టీ20లో వెస్టిండీస్‌ విజయాన్ని అందుకుంది. బంతితో మూడు వికెట్స్ పడగొట్టిన రసెల్‌.. బ్యాట్‌తో 29 పరుగులు చేశాడు. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (40), జొస్ బట్లర్ (39) తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌ 10.5 ఓవర్లలో 2 వికెట్స్ కోల్పోయి 117 పరుగులు చేసి భారీ స్కోర్ చేసేలా కనిపించింది. ఈ సమయంలో ఆండ్రీ రసెల్, అల్జారీ జోసెఫ్ చెలరేగడంతో ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ (27) మినహా ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. నాలుగు ఓవర్లు వేసిన రసెల్.. 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

Also Read: U19 WC 2024: ఇద్దరు హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్‌ జట్టులో చోటు!

లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (22), కైలీ మేయర్స్‌ (35) మంచి ఆరంభం ఇచ్చారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షై హోప్‌ (36) రాణించాడు. నికోలస్‌ పూరన్‌ (13), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (1) త్వరగా పెవిలియన్ చేరారు. ఈ సమయంలో రోవ్‌మన్‌ పావెల్‌, ఆండ్రీ రసెల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 18.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేశారు. పావెల్‌ 15 బంతుల్లో 31 పరుగులు చేయగా.. రసెల్‌ కూడా 14 బంతుల్లో 29 పరుగులు బాదాడు. రసెల్‌ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.