Temple Dwajasthambam: ప్రతి హిందూ దేవాలయంలో ప్రధాన గోపురం దాటి లోపలికి అడుగుపెట్టగానే మనకు మొదట దర్శనమిచ్చేది ‘ధ్వజ స్తంభం’. బంగారు లేదా వెండి తొడుగులతో, గంటలతో అలంకరించబడి నిటారుగా ఉండే ఈ స్తంభం చుట్టూ ప్రదక్షిణ, నమస్కారం చేసిన తర్వాతే మనం మూలవిరాట్టును దర్శించుకోవడం ఆనవాయితీ. కేవలం ఆచారంగా భావించే ఈ ధ్వజస్తంభం వెనుక.. అద్భుతమైన పౌరాణిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? తెలియదా.. అయితేనేమి అవేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆగమ శాస్త్రం ప్రకారం, ధ్వజస్తంభానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని కేవలం ఒక కర్రగా కాకుండా విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా భావిస్తారు. మన పెద్దలు “దేహమే దేవాలయం” అని చెప్పారు. దాని ప్రకారం ఆలయ నిర్మాణాన్ని మానవ శరీర నిర్మాణంతో పోలుస్తారు. ఇక్కడ ధ్వజస్తంభం ఆలయానికి వెన్నెముక వంటిది. గర్భగుడి ముఖం అయితే, ధ్వజస్తంభం హృదయంగా పరిగణించబడుతుంది. ఇక ఆగమ సంప్రదాయం ప్రకారం.. దైవశక్తి ఐదు రూపాలలో ఐదు చోట్ల ఉంటుంది. అవేంటంటే.. మూలవిరాట్టు (ప్రధాన విగ్రహం), ఉత్సవమూర్తి (ఊరేగింపు విగ్రహం), పాదుకలు, అర్చకుడు, చివరిగా ధ్వజస్తంభంలో. అందుకే ధ్వజస్తంభంను జీవధ్వజం లేదా దారుబేరం అని కూడా అంటారు. భగవంతుని చూపులు నిరంతరం ఈ స్తంభంపై పడటం వలన దీనికి అపారమైన శక్తి లభిస్తుంది.
Kartika Purnima: కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపం ఎందుకు..? విశిష్టత ఏంటి..?
షోడశోపచార పూజా విధానం, నిత్య హారతులు, నైవేద్యాలు వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా జరగాలి. ధ్వజస్తంభం ఉంటేనే అది ఆలయంగా పరిగణించబడుతుంది. లేకపోతే అది కేవలం మందిరం అవుతుంది. ఇక వైజ్ఞానిక కోణంలో చూసినట్లైతే.. పండితులు, శాస్త్రజ్ఞులు ధ్వజస్తంభాన్ని ఒక శక్తి వాహక వ్యవస్థగా చెబుతారు. ధ్వజస్తంభం యంత్రాలు, మంత్రాల సహాయంతో నిర్మించబడుతుంది. ఇది ప్రకృతిలోని విద్యుత్, అయస్కాంత శక్తిని గ్రహిస్తుంది. ఇక సైన్స్ ప్రకారం మాత్రం.. ఈ స్తంభం భూమిపై ఉన్నటువంటి అయస్కాంత శక్తిని గ్రహించి దానిని గుడి ప్రాంగణం ద్వారా గర్భగుడిలోకి ప్రసరింపజేస్తుందని చెబుతారు. ఇక భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, ఆ శక్తి కేంద్రం (ధ్వజస్తంభం) వద్ద కొంత సమయం కూర్చోవడం ద్వారా, ఆ ప్రాంతంలో ఉన్న సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) వారిలోకి ప్రవేశించి ఉత్తేజపరుస్తుంది. ఇది మానసిక సమస్యలను దూరం చేస్తుంది.
ఇక పౌరాణిక నేపథ్యంలో చూసినట్లయితే.. ధ్వజస్తంభం ఆవిర్భావం వెనుక మయూరధ్వజుడు అనే గొప్ప దాత కథ ఉంది. ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తున్నప్పుడు, శ్రీకృష్ణుడు అతని దాన గుణాన్ని పరీక్షించడానికి నిర్ణయించుకుంటాడు. దానితో శ్రీకృష్ణుడు, ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరి రాజు మయూరధ్వజుని దర్శిస్తారు. తమ కుమారుడిని పట్టుకున్న సింహం, మయూరధ్వజుని శరీరంలో సగ భాగం తనకు ఆహారంగా కావాలని కోరిందని అబద్ధం చెప్తారు. దానికి మయూరధ్వజుడు వెంటనే అంగీకరించి తన భార్యాపుత్రులతో తన శరీరాన్ని సగానికి కోయమని చెబుతాడు. దానం ఇస్తుండగా.. అతని ఎడమ కంటి నుంచి నీరు కారడం చూసి ధర్మరాజు ఆశ్చర్యపోగా, మయూరధ్వజుడు మాత్రం “నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకెందుకు దక్కలేదని నా ఎడమ కన్ను బాధతో కన్నీరు కారుస్తోంది” అని వివరిస్తాడు. ఇక మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి అతని కోరిక మేరకు “నీ శరీరం నశించినా నీ ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా, నిత్యం నా ముందు ఉండేలా అనుగ్రహిస్తున్నానని వరం ఇచ్చాడు. ఆనాటి నుంచీ ప్రతి దేవాలయం ముందు మయూరధ్వజుని గుర్తుగా ధ్వజస్తంభాలు వెలిశాయి. ఈ స్తంభాలను ఆశ్రయించిన అతని ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు ధ్వజస్తంభాన్ని దర్శించి ప్రదక్షిణ చేసిన తర్వాతే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకోవడం సాంప్రదాయంగా మారింది.
ధ్వజస్తంభం వల్ల భక్తులకు లభించే గొప్ప సౌలభ్యం ఏమిటంటే… భక్తులు ఆలయానికి చేరే సమయానికి వేళ దాటి ఆలయ ద్వారాలు మూసివేసినా దిగులు పడనవసరం లేదు. ధ్వజస్తంభ దర్శనంతోనే దైవ దర్శనం పొందిన ఫలితం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ధ్వజస్తంభం లేని దేవాలయాన్ని స్వాములు, సన్యాసులు ఆలయంగా పరిగణించరు. మన పూర్వీకులు ఒక ఆచారాన్ని పెట్టారంటే దాని వెనుక కచ్చితంగా గొప్ప సైన్స్, పురాణ నేపథ్యం ఉంటుందనడానికి ధ్వజస్తంభమే ఒక సజీవ నిదర్శనం.
