ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన రుణదాతలు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా క్రెడిట్ చెల్లింపులను అందించడానికి ముందుకు వస్తున్నాయి. UPI ద్వారా క్రెడిట్ లావాదేవీల కోసం బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు RuPay క్రెడిట్ కార్డులను అందిస్తున్నప్పటికీ, వారు ఇప్పుడు “క్రెడిట్ లైన్ ఆన్ UPI” ఫీచర్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి UPI క్రెడిట్ లైన్ అంటే ఏమిటి? దీని వల్ల ఎలా ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఈ ప్రొడక్ట్ ని ప్రారంభించడానికి ఫిన్‌టెక్ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయని చెప్పారు. Navi, Super Money, SalarySe వంటి స్టార్టప్‌లు ఈ ఫీచర్ ను అందించడానికి ఈ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు తెలిపారు. అయితే, HDFC బ్యాంక్, Axis బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.
బ్యాంకుల వాదన ఏమిటి?
వడ్డీ రేట్లు, వాటిపై ఎలా వసూలు చేస్తారు? కస్టమర్లు ఎంత వడ్డీ లేని కాల వ్యవధిని పొందుతారో స్పష్టత వచ్చే వరకు ప్రధాన బ్యాంకులు ఈ ఉత్పత్తిని ప్రారంభించడానికి ఇష్టపడవని ఈ విషయం తెలిసిన నిపుణులు తెలిపారు. అటువంటి ప్లాట్‌ఫామ్‌పై చిన్న రుణాలను తిరిగి పొందడం చాలా కష్టమని ఒక ప్రైవేట్ రంగ బ్యాంకర్ అన్నారు.
బ్యాంకులకు ప్రయోజనం?
ఢిల్లీకి చెందిన ఒక చెల్లింపు అప్లికేషన్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, అనేక బ్యాంకులు చిన్న రుణాలను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి దీనిని ఒక మార్గంగా చూస్తున్నాయని అన్నారు. ఇది బ్యాంకులు కొత్త కస్టమర్లను చేరుకోవడానికి, ఈ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే మంచి కస్టమర్లను నిలుపుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
Also Read:Donald Trump: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై అమెరికా నిఘా నివేదికను తప్పుబట్టిన ట్రంప్..
UPI క్రెడిట్ లైన్ అంటే ఏమిటి?
చాలాసార్లు మీరు అత్యవసరమైన చెల్లింపు చేయాల్సి ఉంటుంది. కానీ మీ బ్యాంక్ ఖాతాలో తగినంత నిధులు లేకపోవడం వల్ల మీరు పేమెంట్ చేయలేరు. UPI క్రెడిట్ లైన్ సౌకర్యం కింద, ఏ UPI వినియోగదారుడైనా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోయినా UPI ద్వారా అవసరమైన చెల్లింపులు చేయవచ్చు. ఇది మీరు తరువాత తిరిగి చెల్లించాల్సిన ఒక రకమైన రుణం. దీనిపై వడ్డీ కూడా వసూలు చేస్తారు. NPCI ఈ ఫీచర్ ను సెప్టెంబర్ 2023లో ప్రారంభించింది. కర్ణాటక బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నవీ, పేటీఎం సహకారంతో, UPIపై క్రెడిట్ లైన్‌లను అందించే మొదటి రెండు రుణదాతలుగా నిలిచాయి.
